Share News

11 లక్షల ఇళ్లు ఇవ్వండి

ABN , Publish Date - Jul 29 , 2026 | 08:05 AM

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన-గ్రామీణ్‌ (పీఎంఏవై-జీ) కింద తెలంగాణకు 11,56,915 ఇళ్లు కేటాయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సొంత ఇల్లు నిర్మించి..

11 లక్షల ఇళ్లు ఇవ్వండి

  • ఆవాస్‌ ప్లస్‌ యాప్‌లో తేలిన అర్హులు వీరు

  • బీఆర్‌ఎస్‌ నిర్లక్ష్యంతో పదేళ్లు ఇళ్లు ఇవ్వలేదు

  • వీబీ జీరామ్‌ జీలో అదనపు పనులివ్వండి

  • కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు సీఎం రేవంత్‌ వినతి

న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన-గ్రామీణ్‌ (పీఎంఏవై-జీ) కింద తెలంగాణకు 11,56,915 ఇళ్లు కేటాయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వడానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలోని కృషి భవన్‌లో మంగళవారం ఆయన కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ‘‘గత ప్రభుత్వం పీఎంఏవై-జీని వినియోగించుకోవడంలో అలసత్వం వహించింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పదేళ్లు పేదలకు సొంత ఇళ్లు దక్కలేదు. అందుకే, ఇప్పుడు తీవ్ర డిమాండ్‌ నెలకొంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన ఆవాస్‌ ప్లస్‌ యాప్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 11,56,915 కుటుంబాలకు అర్హత ఉన్నట్లు గుర్తించాం. సాధ్యమైనంత త్వరగా వీరికి ఇళ్లు కేటాయించాలి’’ అని కోరారు.

వీబీ జీరామ్‌ జీలో అదనపు పనులు కల్పించండి

ఎల్‌నినో నేపథ్యంలో వీబీ జీరామ్‌ జీ కార్యక్రమంలో అదనపు పనులు చేర్చాలని చౌహాన్‌కు సీఎం రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. వర్షాభావంతో పనులు లేనందున ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీలకు జీవనోపాధి మెరుగుపర్చేందుకు, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు చట్టంలో అదనపు పనులను చేర్చాలని కోరారు. రైతులు తమ భూముల్లో కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్ల అభివృద్ధి, మల్బరీ తోటల సాగు, పట్టు పురుగుల పెంపకం షెడ్లు, ఇళ్ల సమీపంలో ఆకు కూరలు, కూరగాయల తోటలు, వెదురు వనాలు పెంచుకునే పనులను వీబీ జీరామ్‌ జీలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం కింద ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ సమయంలో 90 రోజుల వరకు పనులు చేసే అవకాశం ఉండేదని, వీబీ జీరామ్‌ జీలోనూ అందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. స్థానిక అవసరాలకు తగినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే ఇతర పనులను పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్‌ రెడ్డి, పోరిక బలరాం నాయక్‌, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, రామసహాయం రఘురాం రెడ్డి, సురేష్‌ షెట్కార్‌, గడ్డం వంశీ కృష్ణ, ఎం.అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ముఖ్యమంత్రి సలహాదారు రామకృష్ణారావు, సెక్రటరీ కో ఆర్డినేషన్‌ అద్వైత్‌ కుమార్‌ సింగ్‌ ఉన్నారు.

Updated Date - Jul 29 , 2026 | 08:05 AM