Share News

పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించండి.. మెట్రోలో వెళ్లండి: ప్రధాని మోదీ

ABN , Publish Date - May 11 , 2026 | 05:30 AM

యుద్ధాలతో ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయని.. భారత్‌పైనా తీవ్ర ప్రభావం పడుతోందని.. ఈ తరుణంలో దేశం కోసం మనందరం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు!

పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించండి.. మెట్రోలో వెళ్లండి: ప్రధాని మోదీ

  • ఇంటి నుంచి పని, ఆన్‌లైన్‌, వర్చువల్‌ భేటీలకు ప్రాధాన్యమివ్వాలి

  • వంట నూనె తగ్గిస్తే దేశ సేవ.. దేహ సేవ.. విదేశాల్లో పెళ్లి, పర్యటనలొద్దు

  • రసాయన ఎరువులొద్దు.. ప్రకృతి సాగే ముద్దు.. సౌర మోటార్లను వాడండి

  • ఇతర దేశాల ఉత్పత్తులొద్దు.. విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయడమూ దేశభక్తే

  • బెంగాల్‌ ఉత్సాహం ఇక్కడా కనిపిస్తోంది.. తెలంగాణలోనూ వచ్చేది బీజేపీనే

  • కాంగ్రెస్‌ మిగిలింది 3 రాష్ట్రాల్లోనే.. అబద్ధపు హామీలతో అధికారంలోకి

  • కాంగ్రెస్‌ కాదది ఎంఎంసీ.. అంటే ముస్లింలీగ్‌ మావోవాదీ కాంగ్రెస్‌

  • పరేడ్‌ గ్రౌండ్‌ సభలో ప్రధాని మోదీ.. యుద్ధం నేపథ్యంలో ప్రజలకు సూచనలు

  • సింధు ఆస్పత్రిని ప్రారంభించిన మోదీ.. హెటిరో పార్థసారథిరెడ్డికి అభినందన

హైదరాబాద్‌, మే 10(ఆంధ్రజ్యోతి): యుద్ధాలతో ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయని.. భారత్‌పైనా తీవ్ర ప్రభావం పడుతోందని.. ఈ తరుణంలో దేశం కోసం మనందరం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు! పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించాలని.. మెట్రో రైలు సౌకర్యం ఉన్న నగరాల్లో ప్రజలుదాన్ని వినియోగించుకోవాలని.. కారులో వెళ్లాల్సి వస్తే కార్‌ పూల్‌ చేసి ఇతరులనూ తీసుకెళ్లాలని సూచించారు. ఏడాదిపాటు ఎవరూ బంగారం కొనొద్దని.. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలని హితవు పలికారు. వస్తు రవాణా కోసం రైలు సేవలు వినియోగించుకోవాలన్నారు. రైళ్లు కరెంటుతో నడుస్తాయి కాబట్టి వాటికి పెట్రోల్‌, డీజిల్‌ అవసరం ఉండదని గుర్తుచేశారు. ఇరాన్‌ యుద్ధం మొదలయ్యాక ప్రధాని మోదీ ఇంధనం, ఎరువుల కొరతతోపాటు యుద్ధం వల్ల కలుగుతున్న పలు సమస్యలపై బహిరంగంగా ప్రస్తావించి, ప్రజలకు జాగ్రత్తలు చెప్పడం ఇదే తొలిసారి. రాష్ట్రపర్యటనలో ఉన్న ఆయన.. ఆదివారం సాయంత్రం పరేడ్‌ గ్రౌండ్స్‌లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తూ ఈ జాగ్రత్తలు చెప్పారు. ‘‘నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా.. మీ అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ.. రాజకీయ విమర్శలు చేయడంతోపాటు, దేశ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు.


కరోనా, రష్యా-ఉక్రెయిన్‌ యుద్దంతో సమస్యలు పెరిగాయని.. అయినప్పటికీ వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఒక యూరియా బస్తా అంతర్జాతీయంగా రూ. 3వేల ధర ఉంటే.. భారత్‌లో అదే రూ. 300 కంటే తక్కువగా వస్తోందని గుర్తుచేశారు. అయితే, మన చుట్టుపక్కల జరుగుతున్న (ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌) యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా సమస్యలు మరింతగా పెరిగాయని ఆందోళన వెలిబుచ్చారు. ‘‘యుద్ధ ప్రభావం మనపై తీవ్రంగా పడుతోంది. మనవద్ద పెట్రోల్‌ బావులు లేవు. ఇతర దేశాలపై ఆఽధారపడుతున్నాం. యుద్ధంతో ప్రపంచం అంతా పెట్రోలు, ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ సమస్య నుంచి ప్రజలను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. ప్రజలపై భారం వేయకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే భరిస్తోంది. సరఫరా గొలుసు (సప్లై చైన్ల) ఇబ్బందులతో.. విదేశీమారక ద్రవ్యం ఎక్కువగా ఖర్చవుతోంది. దీనిపై మనమంతా కలిసి పోరాడాలి. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడమే దేశభక్తి కాదు.. దేశం కోసం బతకడం, దేశ కర్తవ్యం కోసం పాటుపడటం కూడా దేశభక్తే’’ అని ఆయన పేర్కొన్నారు.


నూనె తగ్గించడమూ..

పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం తగ్గించాలంటే.. వర్క్‌ ఫ్రం హోమ్‌, ఆన్‌లైన్‌, వర్చువల్‌ మీటింగ్‌లకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని సూచించారు. అలాగే.. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేయాలన్నారు. మంచి నూనె, బంగారం వంటివాటి కొనుగోలుకు విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా ఖర్చవుతోందని గుర్తుచేశారు. ‘‘మంచి నూనె వాడకం తగ్గించినా అది దేశభక్తి అవుతుంది. దేశసేవతోపాటు దేహ సేవ. దీంతో దేశ ఆర్థికవ్యవస్థతోపాటు కుటుంబ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘గతంలో యుద్ధం వచ్చినప్పుడు, ఏదైనా సంకటం వచ్చినప్పుడు ప్రజలు దేశం కోసం బంగారం ఇచ్చేవారు. ఇప్పుడలా బంగారం దానం చేయాల్సిన అవసరం లేదుగానీ.. దేశ ప్రయోజనాల నిమిత్తం ఏడాది వరకూ.. ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే.. బంగారం కొనకూడదని నిర్ణయం తీసుకోండి. దీంతో విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది’’ అని సూచించారు. గతంలో మన దేశం రాగిని ఎగుమతి చేసేదని.. ఇప్పుడు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ధర్నాలు, ఆందోళనలతో కాపర్‌ ప్లాంట్లు మూతపడడమే అందుకు కారణమన్నారు. ఇప్పుడు రాగి దిగుమతుల కోసం విదేశీ మారకద్రవ్యాన్ని ఎక్కువగా వినియోగించాల్సి వస్తోందన్నారు. విదేశాల్లో పెళ్లిళ్లు, పర్యాటకాన్ని ఏడాదిపాటు వాయిదా వేసుకోవాలన్నారు. దేశంలో పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయని.. ఇక్కడ కూడా పర్యటించవచ్చని పేర్కొన్నారు.


స్థానిక ఉత్పత్తులే కొనండి..

‘‘మనం వ్యవసాయం కోసం రసాయన ఎరువులు వాడుతున్నాం. దీంతో భూమాత ఇబ్బంది పడుతోంది. ఇప్పుడు భూమిని కాపాడుకోకుంటే భవిష్యత్తులో మరిన్ని కష్టాలు వస్తాయి. అందుకే రసాయన ఎరువుల వినియోగం 50 శాతానికి తగ్గించాలి. ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలి. దీంతో మనం విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడంతోపాటు భూమాతనూ కాపాడుకోగలం. అలాగే.. పొలాల్లో డీజిల్‌ పంప్‌ స్థానంలో సౌరవిద్యుత్తు మోటార్లు వాడాలి’’ అని ప్రధాని పిలుపునిచ్చారు. అలాగే స్థానిక ఉత్పత్తులు వినియోగించి విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడాలన్నారు. ‘‘ఇప్పుడు వినియోగిస్తున్న విదేశీ వస్తువులు పారవేయమని చెప్పను. కానీ, కొత్తగా విదేశీ వస్తువులు కొనద్దు. మనం నిత్యం వినియోగించే వస్తువుల్లో చాలావరకూ విదేశాల నుంచి వచ్చేవేనని చాలామందికి తెలియదు. ఇంటికి ఉపయోగించే వస్తువుల జాబితా తయారుచేయండి. కత్తెర, టూత్‌ పేస్ట్‌.. ఇలా ఎన్నో వస్తువులున్నాయి. వాటన్నింటి విషయంలో స్వదేశీ ఉత్పత్తులకు మారండి. ప్రతి పౌరుడూ నిజాయతీతో వ్యవహరిస్తే దేశ అభివృద్ధి’’ అని ప్రధాని స్పష్టం చేశారు.


రాష్ట్రాభివృద్ధే లక్ష్యం..

రాష్ట్ర అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. తెలంగాణను, హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడం ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని.. అందులో భాగంగానే రూ.వేల కోట్ల పనులకు తాను శంకుస్థాపనలు చేశానని గుర్తుచేశారు. ‘‘దేశంలోని 14 పారిశ్రామిక కారిడర్లలో ఇక్కడ ఒకటి వస్తుంది. జహీరాబాద్‌ పారిశ్రామిక ప్రాంతంతో స్థానిక రైతులు, యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దేశంలో 7 పీఎం టెక్స్‌టైల్‌ పార్క్‌లలో ఒకటి వరంగల్‌ కాకతీయ పార్క్‌. దాంతో లక్షల ఉద్యోగాలొస్తాయి. అక్కడి రైతులకు లబ్ధి కలగనుంది. వేల కోట్ల రూపాయల కేంద్ర ప్రోత్సాహక నిధులతో వరంగల్‌ పత్తి రైతులకు లాభం కలగనుంది. ఇక దిగుమతులపై ఆధారపడే అవసరం ఉండదు’’ అని ఆయన పేర్కొన్నారు.


తెలంగాణలోనూ బీజేపీ..

‘‘అసోంలో గతంలో కొద్దిమంది మాత్రమే బీజేపీ ఎమ్మెల్యేలు ఉండేవారు. కానీ ఇప్పుడక్కడ వరుసగా మూడోసారి విజయంతో హ్యాట్రిక్‌ కొట్టాం. పదేళ్ల క్రితం 3 ఎమ్మెల్యే సీట్లున్న బెంగాల్‌లో ఇప్పుడు 200కి పైగా సాధించి తొలిసారి అధికారం చేపట్టాం. ఇప్పుడు ఇక్కడి (తెలంగాణలో) బీజేపీ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వచ్చేది బీజేపీ సర్కారే అని స్పష్టమవుతోంది’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశం మొత్తంలో ఒకప్పుడు బీజేపీ కేవలం రెండే రెండు సీట్లు గెలిస్తే.. అందులో ఒకటి తెలంగాణ నుంచి గెలిచిందేనని గుర్తుచేశారు. ‘‘అప్పటి నుంచే బీజేపీకి ఇక్కడి ప్రజలు మద్దతు పలుకుతున్నారు.. ఇక్కడి కుటుంబ రాజకీయాలతో ప్రజలు విసుగెత్తిపోయారు.. బీజేపీ కోసం ఎదురుచూస్తున్నారు.. అగ్‌లీ బార్‌.. మోదీ సర్కార్‌.. (వచ్చేసారి మోదీ సర్కారు)’’ అని నినదించారు. శనివారం తాను బెంగాల్‌లో ఉన్నానని.. అక్కడ కనిపించిన విజయోత్సాహం తెలంగాణలోనూ కనిపిస్తోందని ఆనందంగా చెప్పారు. ‘‘కాంగ్రెస్‌ అవినీతిని, కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించింది. రాజ్యంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేసింది. ఆ పార్టీ నుంచి టీఎంసీ అన్ని దురలవాట్లనూ నేర్చుకుని మరిన్ని తప్పులు చేసింది. ప్రజలను బేడీలతో బంధించింది. అక్కడ బీజేపీ.. టీఎంసీ ఏకఛత్రాధిపత్యాన్ని ఓడించింది. ఎన్నో ఏళ్ల తర్వాత అక్కడి ప్రజలు నిర్భయంగా ఊపిరి పీల్చుకుంటున్నారు’’ అని వివరించారు. దేశవ్యాప్తంగా బీజేపీ సాధిస్తున్న విజయాలు కేవలం రాజకీయ విజయాలు కాదని.. దేశంలో వస్తున్న మార్పునకు సంకేతమని.. ప్రజలు ఇప్పుడు కుటుంబ రాజకీయాలను తిరస్కరిస్తున్నారని ప్రధాని స్పష్టం చేశారు.


కాంగ్రెస్‌ వల్లే మావోయిస్టుల అంతం ఆలస్యం..

దేశంలో కేవలం 3 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్‌ సీఎంలు ఉన్నారని ప్రధాని గుర్తుచేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాక.. ఇచ్చిన హామీలను మరచిపోవడం కాంగ్రెస్ కు అలవాటైపోయిందని దుయ్యబట్టారు. ‘‘హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటకలో ఇచ్చిన హామీలన్నీ మరిచారు. తెలంగాణలోనూ అంతే. కాంగ్రెస్‌ వామపక్షాలను మించిన మావోయిస్టుగా.. ముస్లింలీగ్‌ కంటే ఎక్కువ ముస్లింలీగ్‌గా మారింది. అందుకే కాంగ్రెస్ ను ఎంఎంసి.. ముస్లిం లీగ్‌, మావోవాదీ కాంగ్రెస్ గా పేర్కొంటున్నారు’’ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌, వామపక్షాల మద్దతుతోనే తెలంగాణలో మావోయిస్టులు పెరిగారని.. ఇప్పుడు వారు చివరిశ్వాస తీసుకుంటుంటే, కాపాడేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణ పోలీసులకు స్వాతంత్రం ఇచ్చి ఉంటే.. మావోయిస్టుల అంతం ఎప్పుడో అయ్యేదన్నారు. కానీ ఇక్కడ సహకారం లభించలేదని.. అందుకే మావోయిస్టుల అంతం ఆలస్యమైందని.. నేడు తెలంగాణ మావో విముక్త రాష్ట్రంగా మారిందని పేర్కొన్నారు.

మీ చిరునామా ఇవ్వండి.. ఉత్తరం రాస్తా

ప్రధాని ప్రసంగించే సమయంలో.. సభకు వచ్చిన పలువురు ఆయన చిత్రపటాలు ప్రదర్శించారు. వారంతా ఆయన్ను చూసేందుకు ముందుకు వస్తుండడంతో ప్రధాని తన ప్రసంగాన్ని ఆపి.. ‘‘దయచేసి ముందుకు రావద్దు.. చేతులు జోడించి నమస్కరిస్తున్నా. నాకోసం తెచ్చిన చిత్రాలు ప్రదర్శించవద్దు. కింద పెట్టేయండి. వెనకవారికి కనిపించడం లేదని జనం అరుస్తున్నారు. పోస్టర్లు, జెండాలు కింద పెట్టండి’’ అని విజ్ఞప్తి చేశారు. ఆ చిత్రపటాలను ఎస్పీజీ సిబ్బంది తీసుకుంటారని చెప్పారు. ‘‘వాటి వెనుక మీ చిరునామా ఉంటే నేను ఉత్తరం రాస్తా’’ అని నచ్చజెప్పారు. ‘‘మీ ప్రేమ నాపై ఉంటుంది. మీరు కురిపిస్తున్న ప్రేమ నా అదృష్టం. మీరు కాస్త శాంతిస్తే నేను నా ప్రసంగం కొనసాగిస్తాను’’ అని ప్రధాని విజ్ఞప్తి చేశారు.

Updated Date - May 11 , 2026 | 06:04 AM