బీజేపీ తరఫున మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్
ABN , Publish Date - Feb 04 , 2026 | 08:08 AM
త్వరలో తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. బీజేపీకి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్వరలో తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈనెల 7,8 తేదీల్లో బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం చేయనున్నారు. నిన్న (మంగళవారం) కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు రామచందర్‌రావు.. పవన్ కల్యాణ్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మున్సిపల్ ఎన్నికలు సహా పలు కీలక అంశాలపై ముగ్గురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీ తరఫున ప్రచారంలో పాల్గొనాలని కిషన్ రెడ్డి, రామచందర్ రావు.. పవన్‌ను కోరారు.
ఇందుకు పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని రామచందర్ రావు స్వయంగా వెల్లడించారు. మంగళవారం ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పవన్ కల్యాణ్ గారిని కలవడం గౌరవంగా భావిస్తున్నా. తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలతో సహా ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా, అర్థవంతమైన చర్చలు జరిపాము. పవన్ కల్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి అంగీకరించారు’ అని తెలిపారు.
కాగా, రాష్ట్రంలోని ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత 13న ఫలితాలను వెల్లడించనున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243, తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019 ప్రకారం ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ, జనసేన స్నేహపూర్వక పోటీ అంటూ ఈ మేరకు జనసేన పార్టీ ట్వీట్ చేసింది.