Share News

పంచాయతీల సొంత రాబడి ఇక వాటి బ్యాంకు ఖాతాల్లోకే

ABN , Publish Date - Sep 11 , 2026 | 03:18 AM

గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టం-2018 సవరణ బిల్లును గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సెక్షన్‌ 70లోని సబ్‌ సెక్షన్‌-3కు సవరణ చేస్తూ రూపొందించిన ఈ బిల్లుపై అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్నారు.

పంచాయతీల సొంత రాబడి   ఇక వాటి బ్యాంకు ఖాతాల్లోకే
SEETHAKKA

  • ట్రెజరీలో జమ చేయాల్సిన అవసరం లేదు

  • గ్రామసభ తీర్మానంతో ఖర్చు చేసుకోవచ్చు

  • అసెంబ్లీలో మంత్రి సీతక్క వెల్లడి

  • చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

  • పంచాయతీల సొంత ఆదాయం

  • ఇక వాటి బ్యాంకు ఖాతాల్లోకే..

  • ట్రెజరీలో జమ చేయాల్సిన అవసరం లేదు

  • గ్రామసభ తీర్మానంతో ఖర్చు చేసుకోవచ్చు

  • అసెంబ్లీలో మంత్రి సీతక్క వెల్లడి

  • పంచాయతీరాజ్‌ చట్టం-2018

  • సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టం-2018 సవరణ బిల్లును గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సెక్షన్‌ 70లోని సబ్‌ సెక్షన్‌-3కు సవరణ చేస్తూ రూపొందించిన ఈ బిల్లుపై అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్నారు. సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లు ఏకగ్రీవంగా శాసనసభ ఆమోదం పొందింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామ పంచాయతీల సొంత ఆదాయం వాటి అవసరాలకు సకాలంలో అందుబాటులో ఉండాలని, అందుకే గ్రామసభ తీర్మానం మేరకు నిధులను ఖర్చుచేసుకునేలా చట్టానికి సవరణ చేశామని తెలిపారు. పంచాయతీకి వచ్చే ఆదాయం గ్రామాభివృద్ధికే ఉపయోగపడాలన్నారు. ఇక నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసే ఆర్థిక సంఘాల నిధులు ఎలాగైతే గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయో, అదే మాదిరిగా సొంత ఆదాయం కూడా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.


ప్రస్తుతం గ్రామ పంచాయతీలు సొంత ఆదాయ వనరుల ద్వారా సమకూర్చుకునే నిధులను ప్రభుత్వ ట్రెజరీ ఖాతాల్లో జమ చేయాల్సి వస్తోంది. వాటిని డ్రా చేయాలంటే నిర్దిష్ట ప్రక్రియలు పూర్తిచేయాల్సి ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు నిధుల వినియోగంలో ఆలస్యం జరుగుతోంది. అందుకే పంచాయతీల సొంత ఆదాయం వాటి అవసరాలకు సకాలంలో అందుబాటులో ఉంచాలనే ఈ నిర్ణయం తీసుకున్నామ’ని చెప్పారు. ఈ నిధులను గ్రామసభ తీర్మానం మేరకు ఖర్చు చేసుకోవచ్చన్నారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలపై వివక్ష చూపిందని, దానిని రూపుమాపేందుకే చట్ట సవరణ చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నూతన విధానాలు గ్రామాల అభివృద్ధిపై ప్రభావం చూపుతున్నాయని విమర్శించారు. వీబీజీరాంజీ పథకంతో రూ.2 వేల కోట్ల అదనపు భారం పడుతోందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కారణంగతానే పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఆలస్యం జరిగిందని, ఆ కాలానికి సంబంధించిన కేంద్రం నిధులు పూర్తిస్థాయిలో రాలేదనిచెప్పారు. 2025-26కు సంబంధించిన రెండో విడత నిధులు రూ.619 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. అటవీ చట్టాలు రోడ్ల నిర్మాణానికి ఆటంకం కలిగిస్తున్నాయని, తాను పంచాయతీరాజ్‌ మంత్రిగా ఉన్నా వెనకబడిన ములుగు నియోజకవర్గంలో రోడ్లు వేసుకోలేకపోతున్నానని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం క్లియరెన్స్‌ ఇప్పించాలని కోరారు. ఉప సర్పంచులకు చెక్‌ పవర్‌ కల్పించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

Updated Date - Sep 11 , 2026 | 03:24 AM