సీఎం, మంత్రుల మధ్య ఎలాంటి గ్యాప్ లేదు
ABN , Publish Date - May 16 , 2026 | 04:29 AM
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, ఒక్కతాటిపై నిర్ణయాలు తీసుకుంటూ సమష్టిగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
సమష్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నాం.. క్యాబినెట్ భేటీలోనూ ఒక్కతాటిపై నిర్ణయాలు
తెలంగాణ ప్రజల మధ్య చిచ్చుపెట్టడమే బీజేపీ లక్ష్యం
రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
రైతుల పేరిట రాజకీయం చేస్తున్న బీఆర్‌ఎస్ నేతలు
చివరిగింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం,
సంగారెడ్డిలో విలేకరులతో మంత్రి శ్రీధర్‌బాబు
సంగారెడ్డి, మే15(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, ఒక్కతాటిపై నిర్ణయాలు తీసుకుంటూ సమష్టిగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీశాట్‌ను సీఎం పరిధిలో ఉన్న విద్యాశాఖకు మార్చారని, మీకు, సీఎంకు గ్యాప్ ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయనే ప్రశ్నకు శ్రీధర్‌బాబు పైవిధంగా స్పందించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచబోమని ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఎన్నికలు పూర్తికాగానే ధరలు పెంచడం విడ్డూరమని ఆయన విమర్శించారు. ఓటర్లను తప్పుదారి పట్టించేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. తెలంగాణలో అధికారమే తమ టార్గెట్ అని బీజేపీ నేతలు మాట్లాడడంపై శ్రీధర్‌బాబు ఘాటుగా స్పందించారు. ప్రజల్లో చిచ్చుపెట్టడం, విభేధాలు సృష్టించడమే వారి టార్గెట్ అని, రాష్ట్ర అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ టార్గెట్ అని చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వ విధానాల వల్లనే ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుందని ఆరోపించారు. తెలంగాణలో ముందస్తు చర్యలు తీసుకుని కాలుష్యాన్ని నివారించే ప్రయత్నం చేశామన్నారు. హిల్ట్‌పాలసీ కూడా ఇందులో భాగమేనన్నారు. రైతుల పేరిట బీఆర్‌ఎస్ రాజకీయం చేయడం తగదని, ధాన్యం కొనుగోళ్లపై వారికే మాట్లాడే హక్కులేదన్నారు. రెండ్రోజులకు ఒకసారి సీఎం సమీక్ష చేస్తున్నారని వివరించారు. 23లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటమాడిందని, నీట్ ఎగ్జామ్ నేషనల్ లీకేజీ ఏజన్సీగా మారిందని దుయ్యబట్టారు.