బాన్సువాడలో కాన్పుల ఇన్ఫెక్షన్ల కలకలం
ABN , Publish Date - Jul 29 , 2026 | 07:19 AM
బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో కాన్పుల ఆపరేషన్ల అనంతరం బాలింతలు ఇన్ఫెక్షన్‌కు గురైన ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆపరేషన్ థియేటర్‌లో శస్త్రచికిత్స పరికరాలు, దుస్తులను సరిగ్గా స్టెరిలైజ్ చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకుగాను ఆసుపత్రి నర్సింగ్ ఆఫీసర్లు..
ఇద్దరు నర్సింగ్ ఆఫీసర్ల సస్పెన్షన్..
హైదరాబాద్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో కాన్పుల ఆపరేషన్ల అనంతరం బాలింతలు ఇన్ఫెక్షన్‌కు గురైన ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆపరేషన్ థియేటర్‌లో శస్త్రచికిత్స పరికరాలు, దుస్తులను సరిగ్గా స్టెరిలైజ్ చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకుగాను ఆసుపత్రి నర్సింగ్ ఆఫీసర్లు ఎమ్.జమున, పి.రజనిలను సస్పెండ్ చేస్తూ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్థు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 10, 11 తేదీల్లో బాన్సువాడ ఆసుపత్రిలో సిజేరియన్లు చేయించుకున్న ఐదుగురు బాలింతలకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ (సెప్సిస్) సోకింది. పరిస్థితి విషమించడంతో వారిని నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి, హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై గాంధీ ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ శోభ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆపరేషన్ థియేటర్లలో పరిశుభ్రత నిబంధనలు పాటించకపోవడం, సర్జికల్ పరికరాల స్టెరిలైజేషన్‌లో లోపాలుండడం వల్లే ఈ ఇన్ఫెక్షన్లు సోకాయని కమిటీ తేల్చింది. దాంతో బాధ్యులైన నర్సింగ్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేశారు. కాగా సస్పెషన్ ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ కె.ఆదిలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు వైద్యమంత్రి, టీవీవీపీ కమిషనర్, కామారెడ్డి కలెక్టర్‌కు లేఖలు రాశారు.