Drunk Driving Cases: తాగారు.. ఊగారు!
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:06 AM
ఫూటుగా తాగేశారు! తప్పతాగి తూలుతూ తూగుతూ నడవలేక నానా అవస్థలూ పడ్డారు! ఒళ్లు తెలియనంతగా తాగేసి.. తాగిందంతా లోపల్నుంచి తన్నుకొస్తుంటే వాంతులు చేసుకుంటూ నడిరోడ్లపై సొమ్మసిల్లిపడిపోయారు! ఒకరో ఇద్దరో చేతులు పట్టి నడిపిస్తే తప్ప నడవలేనంతగా తాగారు!
కొత్త సంవత్సరం సందర్భంగా మందేసి చిందేసిన భారతీయ యువత
పూటుగా మద్యం తాగి రోడ్ల మీద హల్‌చల్
తూలుతూ తూగుతూ వాంతి చేసుకుంటూ..గుర్గావ్‌లో రోడ్లపై యువతీయువకుల అవస్థలు
మందు ఎక్కువై స్పృహకోల్పోయిన పలువురు
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇవే దృశ్యాలు
రాష్ట్రంలో రికార్డుస్థాయిలో మద్యం అమ్మకాలు
3 రోజుల్లో దాదాపు రూ.వెయ్యి కోట్లు
హైదరాబాద్‌లో ‘ఈగల్’ తనిఖీల్లో నలుగురు డీజేలు సహా ఐదుగురికి గంజాయి పాజిటివ్
మూడు కమిషనరేట్ల పరిధిలో డ్రంకెన్ డ్రైవ్‌లో 2731 మంది మందుబాబుల పట్టివేత
ఏపీలో 3 రోజుల్లో రూ.500 కోట్ల లిక్కర్ సేల్స్
(ఆంధ్రజ్యోతి-హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, అమరావతి)
ఫూటుగా తాగేశారు! తప్పతాగి తూలుతూ తూగుతూ నడవలేక నానా అవస్థలూ పడ్డారు! ఒళ్లు తెలియనంతగా తాగేసి.. తాగిందంతా లోపల్నుంచి తన్నుకొస్తుంటే వాంతులు చేసుకుంటూ నడిరోడ్లపై సొమ్మసిల్లిపడిపోయారు! ఒకరో ఇద్దరో చేతులు పట్టి నడిపిస్తే తప్ప నడవలేనంతగా తాగారు!! డ్రగ్స్, గంజాయి మత్తులో ఊగిపోయారు!! ఇదీ.. దేశవ్యాప్తంగా యువత నూతన సంవత్సర వేడుకలను జరుపుకొన్న తీరు! ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో భాగమైన గుర్గావ్‌లో, ఇండియన్ సిలికాన్‌వ్యాలీగా పేరొందిన బెంగళూరులో, మన హైదరాబాద్‌లో.. అక్కడా ఇక్కడా అని లేదు.. ఆడా, మగా తేడా లేదు.. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో డిసెంబరు 31 అర్ధరాత్రి సమయంలో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపించాయి! ‘నైట్‌లైఫ్ క్యాపిటల్ ఆఫ్ ద ఢిల్లీ-ఎన్సీఆర్ రీజియన్’గా పేరొందిన గుర్గావ్‌లోని సెక్టార్ 29లో, బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో పలువురు యువతీయువకులు తూలుతూ నడుస్తున్న దృశ్యాలు, పబ్బుల నుంచి బయటికొచ్చి నడవలేక ఫుట్‌పాత్‌లపై కూర్చుండిపోయిన దృశ్యాలు, తామేం చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో ఒళ్లుమరిచి వికృత విన్యాసాలు చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మద్యం అమ్మకాల్లో తెలంగాణ రికార్డు సృష్టించింది. నూతన సంవత్సరం మొదటి రోజునే.. రూ.700 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. 2024 డిసెంబరు నెలలో ఎక్సైజ్ శాఖకు వచ్చిన ఆదాయం రూ.3805 కోట్లు కాగా.. 2025 డిసెంబరులో ఆ ఆదాయం ఏకంగా రూ.5051 కోట్లకు చేరింది.
2025 డిసెంబరు 29న రూ.283 కోట్ల ఆదాయం రాగా.. 30వ తేదీన రూ.375.71 కోట్లు, 31న రూ.282.20 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మూడు రోజులూ కలిపి దాదాపు రూ.971 కోట్లు. జనవరి 1 అమ్మకాలు కూడా కలిపితే దాదాపు రూ.1671 కోట్లు అవుతుంది! కాగా.. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మద్యం అమ్మకాలు ఒకెత్తయితే.. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగిన విక్రయాలు ఒక ఎత్తని, డిసెంబరులో ఈ పరిధిలో రూ. 2,020 కోట్లలో మద్యం విక్రయాలు జరిగాయని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. డిసెంబరు 29, 30, 31 తేదీల్లోనే గ్రేటర్ హైదరాబాద్‌లో రూ. 397 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు చెప్పారు. దీనికితోడు.. హైదరాబాద్‌లో పబ్బులు, బార్లు ప్రత్యేక ఆఫర్లతో ఆకట్టుకోగా.. వివిధ సంస్థలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాధాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో భారీ ఈవెంట్లను నిర్వహించాయి. హైటెక్ సిటీలోని శిల్పారామం ఎదురుగా గల హైటెక్ ఎరీనాలో ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన భారీ ఈవెంట్లో యువత వేలాదిగా సందడి చేశారు. అక్కడ పెద్ద ఎత్తున మద్యం పారింది. యువతీయువకులు ఫుల్లుగా తాగి డీజే పాటలకు చిందులేశారు. అటు ఏపీలోనూ నూతన సంవత్సరం సందర్భంగా మద్యం ఏరులై పారింది. డిసెంబరు చివరి మూడురోజుల్లో రూ.543 కోట్ల విలువైన మద్యాన్ని షాపులు, బార్ల లైసెన్సీలు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు. అందులో అత్యధిక భాగం డిసెంబరు 31, జనవరి 1 తేదీల్లో విక్రయించారు. కాగా నిరుడు నూతన సంవత్సరం సమయంలో ఏపీలో రూ.331 కోట్ల అమ్మకాలు జరిగాయి.
తాగి వాహనాలు నడుపుతూ..
న్యూ ఇయర్ సందర్భంగా.. ట్రై కమిషనరేట్ పరిఽధిలో ట్రాఫిక్ పోలీసులు అడుగడుగునా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో-120, సైబరాబాద్‌లో 100, రాచకొండలో 100 స్పెషల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ తనిఖీల్లో మొత్తం 2731 మంది మందుబాబులు తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. అలా దొరికిపోయిన 1198 మంది మందుబాబులతో హైదరాబాద్ టాప్‌లో నిలవగా.. సైబరాబాద్‌లో 928 మంది, రాచకొండలో 605 మంది డ్రైంకెన్ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కారు. వీరిలో 21-30 ఏళ్ల యువకులే అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
గంజాయి మత్తూ..
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈగల్ బృందాలు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో డ్రగ్ టెస్టుల్లో నలుగురు డిస్క్ జాకీలు (డీజే) సహా మొత్తం ఐదుగురికి గంజాయి పాజిటివ్‌గా తేలింది. 15 ఈగల్ బృందాలు, 8 ఎక్సైజ్ బృందాలు, స్థానిక పోలీ్‌సలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించిన ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. పబ్బులు, రిసార్టులు, ఫామ్ హౌసుల్లో జరుగుతున్న వేడుకల్లో నిషేధిత గంజాయి, మత్తు పదార్థాలు వినియోగిస్తున్నారన్న సమాచారం వచ్చినచోట తనిఖీలు చేపట్టారు. 89 మందికి డ్రగ్స్ కిట్లతో పరీక్షలు నిర్వహించగా... వేర్వేరు పబ్బుల్లో డీజే ఆపరేటర్లు శ్రీధర్, డేవిడ్, తన్విర్ సింగ్, డ్రమ్మర్ మణిభూషణ్‌తోపాటు రవికిరణ్ అనే ప్రైవేటు ఉద్యోగికి గంజాయి పాజిటివ్ వచ్చింది. ఈగల్ సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకున్నారు.
మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్
నిమిషానికి 95 మద్యం సీసాల అమ్మకం
93 సీసాలతో 2వస్థానంలో ఏపీ
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాల్లో.. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ తొలి రెండు స్థానాల్లో యూపీకి చెందిన ఆర్థిక సేవల సంస్థ ‘ఫింటెలెక్ట్ ఇండియా’ తెలిపింది. ఆ గణాంకాల ప్రకారం.. తెలంగాణలో న్యూ ఇయర్ నేపథ్యంలో నిమిషానికి 95 మద్యం సీసాలు అమ్ముడుపోగా, 93 సీసాలతో ఏపీ రెండో స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక (74), మహారాష్ట్ర (41), ఉత్తరప్రదేశ్ (28), ఢిల్లీ (28), రాజస్థాన్ (22) ఉన్నాయి.