అమెరికాలో రోడ్డు ప్రమాదం..
ABN , Publish Date - Jul 29 , 2026 | 07:23 AM
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లికి చెందిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీపాతి దీపారెడ్డి (42) దుర్మరణం పాలయ్యారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు... అమెరికా కాలమానం ప్రకారం సోమవారం దీపారెడి తన భర్త రామకృష్ణారెడ్డిని..
ఆమనగల్లు, జూలై 28(ఆంధ్రజ్యోతి): అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లికి చెందిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీపాతి దీపారెడ్డి (42) దుర్మరణం పాలయ్యారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు... అమెరికా కాలమానం ప్రకారం సోమవారం దీపారెడి తన భర్త రామకృష్ణారెడ్డిని కారులో మెట్రో స్టేషన్ వద్ద దింపి తిరిగి ఇంటికి వెళ్తుండగా... సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో ఆమె కారును మరో కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో దీపారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై అమెరికా నుంచి సమాచారం అందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
కాగా మాడ్గుల మండల కేంద్రానికి చెందిన పట్టాభిశేఖర్‌రెడ్డి, శశిరేఖల కుమార్తె దీపారెడ్డికి ఇరవై ఏళ్ల క్రితం ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లికి చెందిన శ్రీపాతి పుల్లారెడ్డి, ఉమావతిల కుమారుడు రామకృష్ణారెడ్డితో వివాహం జరిగింది. అనంతరం దంపతులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కావడంతో అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు హర్షిత, సంస్కృత ఉన్నారు. కాగా దీపారెడ్డి మరణానంతరం అవయవ దానం చేస్తానని ఇచ్చిన డిక్లరేషన్ ఆధారంగా.. కుటుంబ సభ్యుల అంగీకారంతో న్యూజెర్సీలో ఆమె అవయవాలను సేకరించినట్లు సమాచారం. ఆమె మృతదేహాన్ని అమెరికా నుంచి తెలంగాణకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.