Share News

విద్యార్థుల పోరాటానికి కేంద్రం దిగొచ్చింది

ABN , Publish Date - Jul 26 , 2026 | 05:45 AM

నీట్‌ పేపర్‌ లీక్‌ అంశంలో సీజేపీ నేతృత్వంలో విద్యార్థులు, యువత తెచ్చిన ఒత్తిడికి తలొగ్గి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పదవికి రాజీనామా చేయడంపై రాష్ట్రంలోని వివిధ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

విద్యార్థుల పోరాటానికి కేంద్రం దిగొచ్చింది

  • ప్రధాన్‌ రాజీనామాపై పలువురి హర్షం

  • ప్రజాస్వామ్యంలో నియంత పోకడలకు తావులేదని రుజువైంది : మహేష్‌ గౌడ్‌

  • విద్యార్థి శక్తికి తలవంచిన కేంద్రం : కోదండరాం

  • అహంభావానికి చెంపదెబ్బ : సీపీఐ

  • చారిత్రక విజయం: సీపీఎం

  • విద్యార్థులకు సెల్యూట్‌: ఆర్‌.నారాయణమూర్తి

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, హైదరాబాద్‌ సిటీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): నీట్‌ పేపర్‌ లీక్‌ అంశంలో సీజేపీ నేతృత్వంలో విద్యార్థులు, యువత తెచ్చిన ఒత్తిడికి తలొగ్గి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పదవికి రాజీనామా చేయడంపై రాష్ట్రంలోని వివిధ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇది విద్యార్థి లోకం సాధించిన విజయమని పేర్కొన్నాయి. విద్యార్థులు, ప్రతిపక్షాలు చేపట్టిన సుదీర్ఘ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అన్నారు. ప్రజాస్వామ్యంలో నియంత పోకడలకు తావులేదని ఈ పోరాటం రుజువు చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌, బీజేపీయేతర రాజకీయ పక్షాలన్నీ చేసిన పోరాటం ఫలితమే ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా అని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే.. యువత తగిన సమాధానం చెబుతుందని ఈ ఉద్యమం నిరూపించిందని అన్నారు. కాగా, ఇన్నాళ్లూ ప్రజా వ్యతిరేకతను లెక్కచేయని మోదీ ప్రభుత్వం తొలిసారిగా విద్యార్థుల శక్తి ముందు తలవంచిందని ఎమ్మెల్సీ, టీజేఎస్‌ అధినేత ప్రొఫెసర్‌ కోదండరాం న్యూఢిల్లీలో అన్నారు. 2014 తర్వాత బీజేపీ రాజకీయ చరిత్రలో ఓ మంత్రి రాజీనామా చేయడం, ప్రధాని మోదీ స్వయంగా విద్యార్థులకు విజ్ఞప్తి చేయడం, ప్రభుత్వం తక్షణమే విద్యా వ్యవస్థలో సంస్కరణలకు ఉపక్రమించడం యువత పోరాట ఫలితాలేనని స్పష్టం చేశారు. కాక్రోచ్‌ రూపంలో యువత చేపట్టిన ఉద్యమం బీజేపీ అబద్ధాలకు, అహంభావానికి గుణపాఠం చెప్పిందని సీపీఐ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ కె. నారాయణ అన్నారు.


ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో విద్యార్థుల ఉద్యమం, ప్రజాస్వామ్యం గెలిచాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ సీపీఐ పిలుపునిచ్చిన ఆందోళనలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. నయా ఫాసిస్టు మోదీ ప్రభుత్వ నిరంకుశ పాలనపై యువత, విద్యార్థులు చారిత్రక విజయం సాధించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా దేశ యువత పోరాటపటిమతో సాధించిన విజయమని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. పేపర్‌ లీకేజీ వ్యవహారంలో కేంద్రం మెడలు వంచి విద్యార్థుల అభీష్టాన్ని నెరవేర్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పేర్కొన్నారు. కేంద్రం ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకొని విద్యావిధానంలో తగిన మార్పులు చేయాలని ప్రభుత్వ విప్‌ బల్మూర్‌ వెంకట్‌ డిమాండ్‌ చేశారు. కాగా, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజా ఉద్యమాలే శరణ్యమని జంతర్‌మంతర్‌ వేదికగా దేశ యువత మరోసారి నిరూపించారని సినీనటుడు ఆర్‌. నారాయణమూర్తి అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే దాకా రాజీలేని పోరాటం చేసిన విద్యార్థి లోకానికి సెల్యూట్‌ అంటూ ప్రజా గాయకుడు అరుణోదయ నాగన్న సంస్మరణ సభలో హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 26 , 2026 | 05:47 AM