Share News

ఆయిల్‌పామ్‌ రైతులకు కొండంత అండ!

ABN , Publish Date - Mar 22 , 2026 | 04:53 AM

రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ తోటలు సాగు చేస్తున్న రైతులకు మరింత తోడ్పాటు లభించనుంది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన...

ఆయిల్‌పామ్‌ రైతులకు కొండంత అండ!

  • 62 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో..

  • అత్యాధునిక టెక్నాలజీతో నర్మెట్ట ఫ్యాక్టరీ నిర్మాణం

  • గంటకు 30 టన్నుల గింజల క్రషింగ్‌ సామర్థ్యం

  • మంత్రి తుమ్మల చొరవతో 16 నెలల్లోనే నిర్మాణం

  • నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

  • రిఫైనరీ పరిశ్రమకు శంకుస్థాపన, బహిరంగసభ

సంగారెడ్డి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ తోటలు సాగు చేస్తున్న రైతులకు మరింత తోడ్పాటు లభించనుంది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. దీంతోపాటు రిఫైనరీ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటయ్యే బహిరంగసభలో సీఎం, మంత్రులు పాల్గొంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అశ్వరావుపేట, అప్పారావుపేట ప్రాంతాల్లోనే ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కొత్తగా ప్రారంభం కానున్న నర్మెట్ట ఫ్యాక్టరీతో మూడు ఫ్యాక్టరీలు రైతులకు అందుబాటులోకి రానున్నాయి. గంటకు 30 టన్నుల నూనె గింజలను క్రషింగ్‌ చేసి క్రూడ్‌ ఆయిల్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం నర్మెట్ట ఫ్యాక్టరీకి ఉంది. నూనెగింజల ఉత్పత్తి పెరిగిన కొద్దీ గంటకు 120 టన్నులను సైతం క్రషింగ్‌ చేసేలా దీనిని నిర్మించారు. దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక మలేషియా టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ రూపుదిద్దుకుందని అధికారులు చెప్పారు. క్రషింగ్‌ అనంతర వ్యర్థాలతో 6 మెగావాట్ల విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకునేలా ప్లాంటును నిర్మించినట్లు వెల్లడించారు. కాగా, నర్మెట్ట ఫ్యాక్టరీలో వివిధ విభాగాల్లో 2,500 మందికి ఉపాధి లభించనుంది. రిఫైనరీ పరిశ్రమ ప్రారంభమైతే క్రూడ్‌ ఆయిల్‌ను రిఫైనరీ ఆయిల్‌గా వేరు చేసి ఇక్కడే ప్యాకెట్లలో నింపుతారు. స్వచ్ఛమైన పామాయిల్‌ నూనెను వినియోగదారులు నేరుగా కొనుక్కునే అవకాశం కల్పించనున్నారు. నర్మెట్ట ఫ్యాక్టరీ నిర్మాణంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే, 16 నెలల్లోనే ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధమైంది.

Updated Date - Mar 22 , 2026 | 04:57 AM