Share News

గంజాయి మత్తులో యువత

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:53 PM

: బెల్డ్‌ దుకాణాలతో మద్యం అందుబాటులోకి వచ్చి గ్రామాల్లో అన్నివర్గాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతుండగా యువత గంజాయి బారిన పడుతోంది.

గంజాయి మత్తులో యువత

ఆత్మకూరు(ఎస్‌), ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) : బెల్డ్‌ దుకాణాలతో మద్యం అందుబాటులోకి వచ్చి గ్రామాల్లో అన్నివర్గాలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతుండగా యువత గంజాయి బారిన పడుతోంది. పాఠశాల స్థాయిలోనే పేదరికంతో విద్యనాపేసి ఆర్థిక పరిస్థితుల్లో వెనుకబడిన యువకులు ఉపాధి కోసం హైదరాబాద్‌లాంటి మహానగరాలకు వెళ్తున్నారు. అక్కడ చేసే పనులతో వచ్చే చాలీచాలని డబ్బులతో ఇమడలేక అడ్డదారుల్లో అక్రమ సంపాదనకు అలవాటుపడుతున్నారు. మరికొందరు గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలై డబ్బుల కోసం వాటినే విక్రయిస్తున్నారు. పోలీసులకు చిక్కి కేసుల పాలవుతున్నారు.

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌) మండలంలో రెండేళ్లుగా గంజాయి విక్రయాలు, వాడకాలు పెరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. మండలంలో ప్రధాన రహదారులు సూర్యాపేట-దంతాలపల్లి, ఏపూరు-చివ్వెంల రహదారుల వెంట ఉన్న గ్రామాలను అడ్డాలుగా చేసుకొని గంజాయి దందాను కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఏడాది కిందట ఏనుబాముల స్టేజీ వద్ద నెమ్మికల్‌, గట్టికల్‌కు చెందిన ఇద్దరు యువకులు ఆటోలో వచ్చి గంజాయిని సేవిస్తుండగా సమాచారం తెలుసుకున్న పోలీసులు పట్టుకొని కేసు నమోదుచేశారు. అదే సమయంలో నిందితుల్లో ఒకరి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకోగా రాజకీయ పలుకుబడితో తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్‌లో పోలీసులకు దొరికిన గంజాయి ముఠా ఇచ్చిన సమాచారం మేరకు మండలంలోని పాతర్లపాడు గ్రామంలో ఒకరి ఇంటి బాతరూంలో మూడు కిలోల గంజాయి, నెమ్మికల్‌ వద్ద మరో 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో దొరికిన వారిని పోలీసులు పట్టుకెళ్లి నెమ్మికల్‌కు చెందిన యువకులపైనే కేసు నమోదు చేయగా, పాతర్లపాడుకు చెందిన వారు రాజకీయ పలుకుబడితో తప్పించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గంజాయి తాగుతూ, అరుస్తూ రోడ్లపై ద్విచక్రవాహనాలతో అతివేగంగా వెళుతూ ఇతరులను ప్రమాదాలకు గురిచేస్తున్నారు. అక్కడక్కడా గంజాయిని సేవించిన యువకులు అనవసర విషయాల్లో తలదూర్చి దాడులు చేసుకుంటూ ఘర్షణలకు దిగితున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నెమ్మికల్‌ దండుమైసమ్మ ఆలయ సమీపంలోని ఫంక్షన హాల్స్‌ వద్ద జరిగిన ఘర్షణల్లోనూ భక్తులపై దాడులు చేసిన సందర్భాల్లో గంజాయి బ్యాచ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టి గంజాయి చేయిస్తున్న, విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో గంజాయి నివారణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి అవగాహన కల్పిస్తున్నామని ఎస్‌ఐ శ్రీకాంతగౌడ్‌ తెలిపారు. ఇప్పటికే గంజాయి సేవిస్తున్నా, విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్‌ ఇచ్చామన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 11:53 PM