Share News

లంచం ఇస్తేనే పనులు..

ABN , Publish Date - Oct 28 , 2026 | 11:28 PM

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి జలగలా పీడిస్తోంది. ప్రజలకు ఉచితంగా సేవలు అందించాల్సిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు చేతులు తడపందే పనులు చేయకుండా వేధిస్తున్నారు.

లంచం ఇస్తేనే పనులు..

ఏసీబీకి చిక్కుతున్నా.. మారని తీరు..

ప్రభుత్వ కార్యాలయాల్లో వసూళ్ల దందా..

రెవెన్యూ నుంచి ట్రాన్స్‌కో వరకు అదేబాట

తాజాగా రూ.20వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన లీగల్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి జలగలా పీడిస్తోంది. ప్రజలకు ఉచితంగా సేవలు అందించాల్సిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు చేతులు తడపందే పనులు చేయకుండా వేధిస్తున్నారు. పనుల కోసం పేద, సామాన్యవర్గాల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే లంచం ఇవ్వనిదే కొందరు జిల్లాలోని ఉద్యోగులు, అధికారులు ఫైలు ముందుకు కదలనీయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు వరుస తనిఖీలు, వలపన్ని పట్టుకుంటున్నా అవినీతి జాఢ్యం మా త్రం వీడటం లేదు. తాజా బుధవారం జిల్లాలోని ఓ పెట్రోల్‌బంక్‌ యజమాని నుంచి లీగల్‌ మెట్రాలజీ వెరిఫికేషన్‌ కోసం రూ.20వేలు లంచం తీసుకుంటూ ఇన్‌స్పెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు పట్టుబడటం చర్చనీయాంశమైంది. గతం లో అవినీతి ఆరోపణలపై సస్పెన్షన్‌కు సైతం గురైన అధికారి,ఉద్యోగ విరమణకు ఆరుమాసాల ముందే లంచం తీ సుకుంటూ ఏసీబీ అధికారుల చిక్కారు. అదేవిధంగా పోలీ్‌సశాఖ రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని జిల్లాలో గతం లో విధులు నిర్వహించిన ఇద్దరు పోలీస్‌ అధికారులు హైదరాబాద్‌లో ఏసీబీ చిక్కడం కూడా చర్చనీయాంశమైంది.

ఏడాదిలో ఏసీబీకి చిక్కిన ఐదుగురు

జిల్లాలో గత ఏడాది అక్టోబరు నుంచి ఈ నెల 28వ తేదీ నాటికి ఐదుగురు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. తాజాగా, బుధవారం జిల్లా లీగల్‌ మెట్రాలజీ అధికారి కె.వెంకటేశ్వర్లు రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అదే విధంగా ఈ ఏడాది ఆగస్టు 24న రెవెన్యూశాఖకు చెందిన ఆలేరు తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పూర్ణచందర్‌రావు, కొలనుపాక జీపీవో షేక్‌ అహ్మద్‌ రూ.14వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు. మార్చి 12న మోత్కూరు సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించే ఎండీ.ఖదీర్‌ లంచం తీసుకున్నాడనే ఆరోపణలపై పోలీసులు పట్టుకున్నారు. గత ఏడాది అక్టోబరు 30న యాదగిరిగుట్ట దేవస్థానంలో ఎలక్ట్రికల్‌ ఈఈగా విధులు నిర్వహించే రామారావు బిల్లుల చెల్లింపునకు కాంట్రాక్టర్‌ వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

రెవెన్యూలో అడగడుగునా అవినీతి ఆరోపణలు

జిల్లాలోని రెవెన్యూశాఖలో కొందరు ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. భూముల సర్వేలు, రికార్డుల సవరణ, మ్యుటేషన్‌, పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ, నిషేధిత భూము ల జాబితా నుంచి తొలగింపు వంటి పనుల కోసం డబ్బు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ రికార్డుల సవరణ కోసం కొన్ని సందర్భాల్లో పెద్ద మొత్తంలో లంచం డిమాండ్‌ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆయా భూముల విలువ, విస్తీర్ణం లెక్కగట్టి మరీ ముడుపులు డిమాండ్‌ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందాల్సి ఉన్నా చేతులు తడపందే కాగితం ముందుకు కదలని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి ఉద్యోగుల వైఖరితో సామాన్యులు, ప్రధానంగా గ్రామీణ ప్రాంత పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రతీ సేవకు కాసులు సమర్పించాల్సిందే..

జిల్లాలో అవినీతి ఆరోపణలు కేవలం రెవెన్యూశాఖకే కాదు ప్రతీ శాఖలో, ప్రతీ సేవకు కాసులు సమర్పించాల్సిన పరిస్థితులే నెలకొన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సబ్‌ రిజిస్ట్రేషన్‌, పోలీస్‌, ట్రాన్స్‌కో, మునిసిపల్‌, పంచాయతీరాజ్‌, రవాణా శాఖ ల్లో లంచాల వ్యవహారాలు నడుస్తున్నాయని బహిరంగంగానే చర్చిస్తున్నారు. ప్రధానంగా అభివృద్ధి పనుల బిల్లులకు పర్సెంటేజీలు ముట్టజెప్ప డం ఖచ్చితమైన వ్యవహారంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. మునిసిపల్‌లో అనుమతులు, రిజిస్ట్రేషన్‌శాఖలో దస్తావేజుల రిజిస్ట్రేషన్‌, పోలీ్‌సస్టేషన్‌లో స్టేషన్‌ బెయిల్‌ మొదలు, అరెస్టు చేయకుండా ఉండేందుకు చేతులు తడపాల్సి వస్తోంద ని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు, పారదర్శకంగా సేవలు అందించేందుకు ఆన్‌లైన్‌ సదుపాయాన్ని ప్రవేశపెట్టినా కొర్రీలు పెడుతూ సదరు పనిని పెండింగ్‌లో ఉంచి బేరం కుదిరితేనే ఫైల్‌ ముందుకు కదిలిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రజలకు అవసరమైన సేవలు, కాల వ్యవధిని ఆసరాగా చేసుకు ని అవినీతి అధికారులు డబ్బు కోసం పీడిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఫిర్యాదులతో వెలుగులోకి..

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలపై సేవలు అందని బాధితుల ఫిర్యాదులతో వెలుగుచూస్తున్నాయి. లంచం డిమాండ్‌ చేయడంలో అడ్డూఅదుపు లేకపోవడం.. డబ్బు ముట్టినా మరింత కావాలని వేధింపులకు గురిచేస్తుండటంతో కొందరు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి లంచావతారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. అయినప్పటికీ ఏసీబీకి చిక్కినవారు అమాయకంగా దొరికారని, తాము తెలివిగా వ్యవహరిస్తున్నామనే కొందరు అవినీతి ఉద్యోగుల వైఖరిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. పనుల్లో జాప్యం, జవాబుదారీతనం, లంచం అడిగే వారిపై కఠినంగా వ్యవహరించడం, ప్రభుత్వ సేవలను పారదర్శకంగా నిర్ణీత గడువులోగా అందించే వ్యవస్థను పటిష్టంగా అమలు చేసే వరకు సామాన్యులకు ప్రభుత్వ కార్యాలయాల్ల గౌరవప్రద పౌరసేవలు అందుబాటులోకి వచ్చే పరిస్థితులు లేవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Updated Date - Oct 28 , 2026 | 11:28 PM