ప్రతీ రోజు 62,637 మందికి పని
ABN , Publish Date - Nov 07 , 2026 | 12:25 AM
ఎలినినో కారణంగా యాసంగి లో క్రాప్‌హాలిడే ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో కురువును ఎదుర్కొనేందుకు అధికారయంత్రాంగం సన్నద్ధమైంది. వీబీ జీరాంజీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవీకా మిషన్) కింద గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు విస్తృతంగా పను కల్పించనున్నారు.
ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు వీబీ జీరాంజీ కింద ఉపాధి
జిల్లాకు అదనంగా 75.88లక్షల పనిదినాల కేటాయింపు
‘జలసిరి’ ద్వారా జోరుగా పనులు
(ఆంధ్రజ్యోతిప్రతినిధి, నల్లగొండ): ఎలినినో కారణంగా యాసంగి లో క్రాప్‌హాలిడే ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో కురువును ఎదుర్కొనేందుకు అధికారయంత్రాంగం సన్నద్ధమైంది. వీబీ జీరాంజీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవీకా మిషన్) కింద గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు విస్తృతంగా పను కల్పించనున్నారు. అదే సమయంలో జలవనరుల సృష్టి జరగాల నే ద్విముఖ వ్యూహంతో జిల్లాలో పలు పనులు చేపట్టనున్నారు.
జిల్లాలో జాబ్‌కార్డు ఉన్న ప్రతీ కూలీకి పని కల్పించడమే లక్ష్యంగా వీబీ జీరాంజీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రతీ గ్రామంలో ఈ పనులు కొనసాగుతుండగా, ప్రతీ రోజు 62,637 మంది కూలీలకు పనులు కల్పిస్తున్నారు. ఎల్‌నినో నేపథ్యంలో జిల్లాకు అదనంగా 75.88లక్షల పనిదినాలను కేటాయిస్తూ కేం ద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో కరువు ప్రభావం లేకుండా గ్రామీణ ప్రాంత కూలీలందరికీ ఊతమిచ్చేలా వీబీ జీరాంజీ పను లు కొనసాగిస్తున్నామని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఉన్నతాధికారులకు నివేదించారు.
అదనంగా 75.88లక్షల పనిదినాలు
ఎల్‌నినో నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాఽధి కల్పించేందుకు జిల్లాలో వీబీజీరాంజీ పథకం కింద 75.88 లక్షల పనిదినాలను కేంద్రం కేటాయించింది. ఇప్పటికే సాధారణ కోటా కింద ఈ ఆర్థిక సంవత్సరంలో పనిదినాలు కేటాయించారు. వీటికి అదనంగా తాజా కోటా కలిపి వచ్చే మార్చిలోగా కూలీలకు ఈపనిదినాల్లో కూలి కల్పించేందుకు జిల్లా అధికారయంత్రాంగం వివిధ రకాల పనులను కొనసాగిస్తోంది.
3.55 లక్షల జాబ్‌కార్డులు
వీబీ జీరాంజీ కింద 3.55లక్షల జాబ్‌కార్డులున్నాయి. వీటిలో ఈ ఏడాది మంజూరుచేసిన 7,200 జాబ్‌కార్డులతో పాటు, గతం లో తొలగించిన 4,300 జాబ్‌కార్డులను కూడా యాక్టివ్ చేసి కూ లీలందరికీ పనులు కల్పిస్తున్నారు. జిల్లాలో జాబ్‌కార్డులున్న ప్రతి కూలీకి పని కల్పించడమే లక్ష్యంగా అధికారులు కార్యాచర ణ రూపొందించారు. క్షేత్రస్థాయిలో కూలీలను పనికి తీసుకువచ్చేందుకు మేట్లకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. ప్రతీ 40మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించారు. కూలీలను సమీకరించడం, పనులకు వచ్చేలా ప్రోత్సహించడం, నిర్ణీత సమయంలో పని పూర్తయ్యేలా చూడడం, పని ప్రదేశాల్లో కూలీలకు అవసరమైన సదుపాయాలు కల్పించడం, పనికి అవసరమైన సూచనలు చేయడం వంటి బాధ్యతలను మేట్లకు అప్పగిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3,600పైగా మేట్లను నియమించారు. వీరికి ప్రతిరోజూ రూ.308 చొప్పున పారితోషికం ఇస్తున్నారు.
నీటిసంరక్షణ పనులకే తొలి ప్రాధాన్యం
కరువు నేపథ్యంలో వీబీజీరాంజీ పనుల కింద జలసంరక్షణకు ఉపయోగపడే పనులకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. జలసిరి కార్యక్రమం కింద గ్రామానికో ఊటకుంట, పొలానికో ఫాంపాండ్, ఇంటికో ఇంకుడుగుంత నినాదంతో పెద్ద సంఖ్యలో పనులు చేపట్టారు. ఈ పథకం కింద 1,87,653 పనులు ప్రతిపాదించిన అధికారులు వాటిని పూర్తిచేయించేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని 898 గ్రామపంచాయతీల్లో ఈ పనులు చేపడుతున్నారు. అత్యధికంగా వ్యక్తిగత ఇంకుడు గుంతలకు సంబంధించి 1,73,600 పనులు, ఆ తరువాత 4,340 చొప్పున కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, ఫాంపాండ్ల నిర్మాణాలకు ఆమోదం తెలిపారు. ఊటకుంటలు, బోరువెల్ రీచార్జ్ పథకాలు, రూప్‌హౌస్ హార్వెస్టింగ్ పనులను ఆ తదుపరి ప్రాధాన్యంలో కేటాయించి నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈ పనులకు కూలీలు రావడం మొదలైనప్పటికీ, కొంత కఠినంగా ఉండడంతో ఆసక్తి తగ్గుతోందని క్షేత్రస్థాయిలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోజంతా పనిచేసినా రూ.305కి మించి కూలి రావడం లేదని, అదే సమయంలో నిర్మాణ రంగ పనులు ఇతరత్రా పనులకు వెళ్తే కూలి కనీసంగా రూ.600 వరకు వస్తోందని కూలీలు చెబుతున్నారు. దీంతో ఈ పనులకు మొగ్గుచూపడం లేదు.
స్థలాభావంతో ఊటకుంటలు, ఫాంపాండ్ల నిర్మాణంలో జాప్యం
జలసిరి పథకం కింద ప్రతిపాదించిన ఊటకుంటలు, ఫాంపాండ్ల నిర్మాణానికి స్థలాభావం ఏర్పడింది. వీటి నిర్మాణానికి ఫాంపాండ్లకు కనీసం 2 నుంచి 5 గుంటల భూమిని రైతులు విరాళంగా ఇవ్వాల్సి ఉండగా, ఊటకుంటల నిర్మాణానికి కనీసం 5 నుంచి 10గుంటల భూమిని ఇవ్వాల్సి ఉంది. అధికారులు ఈ కుంటల నిర్మాణానికి గుర్తించిన ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వడానికి రైతులు సుముఖత చూపకపోవడంతో వీటి నిర్మాణంలో జిల్లాలో జాప్యం జరుగుతోంది. రైతుల పొలాలకు ఉపయుక్తమైన కార్యక్రమాలే అయినప్పటికీ భూమి ఇచ్చేందుకు రైతులు ముందుకురాని పరిస్థితి ఏర్పడింది. ప్రతి గ్రామానికి కనీసం ఒక ఊటకుంట నిర్మించాలని, అదేవిధంగా కనీసం 10వరకైనా ఫాంపాండ్లు నిర్మించాలని లక్ష్యం నిర్ధారించినా, ఆచరణలో సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. రైతు సమావేశాలు నిర్వహించి, ప్రజాప్రతినిధులతో అవగాహన కల్పించి స్థలం ఇచ్చేందుకు చైతన్యపరచాలని భావిస్తున్నారు. ఇటీవల సర్పంచ్‌లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లోనూ ఈ అంశంపై అధికారులు సూచనలు చేశారు.
విస్తృతంగా పనులు చేపట్టేందుకు చర్యలు : బి.చంద్రశేఖర్, కలెక్టర్
జిల్లాలో ఎల్‌నినోని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, గ్రామీణ ప్రాంత కూలీలకు ఉపాధి కల్పించేందుకు వీబీ జీరాంజీ పథకం కింద జాబ్‌కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి పని కల్పించేలా కార్యాచరణ అమలు చేస్తున్నాం. అన్ని ఆవాసాల్లోనూ పనులు ప్రారంభమయ్యాయి. జిల్లాలో ప్రస్తుతం ఈ పథకం కింద సగటున ప్రతి రోజూ 62వేల మందికి పైగా కూలీలు పనిచేస్తున్నారు. ఇటీవలే ప్రతి గ్రామంలో పని కి వచ్చే కూలీల సంఖ్య 17నుంచి 64కి పెరిగింది. ఇకపై ప్రతీ వా రం ప్రతీ గ్రామంలో అదనంగా మరో 10 మంది కూలీలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎల్‌నినో నేపథ్యంలో గ్రామాల్లో నీటిసంరక్షణకు ఉపయోగపడే పనులకే ఈ పథకం కింద ప్రాధాన్యం ఇస్తున్నాం. సర్పంచ్‌లు క్షేత్రస్థాయిలో ఈ పనుల నిర్వహణ సక్రమంగా చేపట్టేలా ఇటీవలే వారికి శిక్షణ కూడా అందించాం.