Share News

రూ.5కోట్ల విలువైన స్థలం కబ్జా అయినా పట్టించుకోరా?

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:28 AM

నిలదీతలు, అనుమానాలు, సూచనల నడుమ సోమవారం భువనగిరి మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది.

 రూ.5కోట్ల విలువైన స్థలం కబ్జా అయినా పట్టించుకోరా?

నిలదీతల నడుమ కొనసాగిన మునిసిపల్‌ సమావేశం

గతానికి భిన్నంగా ఎజెండాపై చర్చ.. ఆమోదం

భువనగిరిటౌన, జూన 29 (ఆంధ్రజ్యోతి): నిలదీతలు, అనుమానాలు, సూచనల నడుమ సోమవారం భువనగిరి మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. చైర్‌పర్సన తంగెళ్లపల్లి శ్రీవాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 26 ఎజెండా అంశాలు ఆమోదం పొందినప్పటికీ పలు అంశాలపై కౌన్సిలర్లు అధికారులను ప్రశ్నలతో ముంచెత్తారు. పాలకపక్షానికి చెందిన కౌన్సిలర్‌ జాలిగం విఘ్నేష్‌ మాట్లాడుతూ 22వ వార్డులో రూ.5కోట్ల విలువైన పార్కు స్థలం కబ్జా అయిందని, అయినప్పటికి అప్పటి, ఇప్పటి అధికారులు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కబ్జా అయిన విలువైన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ డిమాండ్‌ చేసి చైర్‌ పర్సనకు వినతిపత్రం అందజేశారు. రూ.10లక్షలతో కొనుగోలు చేస్తున్న శానిటేషన సామగ్రి ధరల్లో వ్యత్యాసం ఉందని, అవగాహన లేకుండానే రూ.60లక్షలతో నాలుగు ఎలక్ర్టికల్‌ సానిటేషన వాహనాలను కొనుగోలు చేయడం తగదని, ఈ నిర్ణయాన్ని పునఃస్సమీక్షించాలని కాంగ్రెస్‌ సభ్యులు ఎండీ.లయాక్‌ అహ్మద్‌, స్వతంత్ర సభ్యుడు పాశం అమర్నాథ్‌ అన్నారు. దీంతో కమిషనర్‌ కె.చంద్రప్రకాష్‌రెడ్డి స్పందిస్తూ ఆటోల పని సామర్థ్యాన్ని పరిశీలించాకే కొనుగోలు చేస్తామని పేర్కొనడంతో వివాదం సద్దుమణిగింది. అలాగే మడిగెల అద్దె తగ్గిస్తేనే వేలంపాటకు స్పందన వస్తుందని, పాత బస్టాండ్‌ కూరగాయల మార్కెట్‌ను కూల్చివేసి రెండంతస్తులుగా నూతన డిజైనలో నిర్మించాలని చేసిన డిమాండ్‌ను పరిశీలిస్తామని చైర్‌ పర్సన, కమిషనర్‌ అన్నారు. బాబూజగ్జీవన రామ్‌ భవనకు, 23వ వార్డులోని కమ్యూనిటీ హాల్‌ మరమ్మతులకు నిధులు ఇస్తామని గత కౌన్సిల్‌లో ఇచ్చిన హామీ ఏమైందని కౌన్సిలర్‌ బర్రె పూజిత నిలదీశారు. సైనిక్‌పురి, భువనగిరి మంచినీటి పైపులైనకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ ఎండీ.సుమయ్య తబుసుం అన్నారు. పొలిశెట్టి అనిల్‌కుమార్‌, ఎండీ.తహేరబేగం మాట్లాడుతూ వీధి స్తంభాలు, డ్రైనేజీ, సీసీరోడ్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ ఒంగేటి సుచరిత మాట్లాడుతూ పట్టణ ప్రజలను బెంబేలెత్తిస్తున్న వీధి కుక్కలు, వానరాల సమస్య పరిష్కారం హామీలకే పరిమితమైందన్నారు. కాంగ్రెస్‌ సభ్యురాలు గంజి శ్రీవాణి, బీఆర్‌ఎస్‌ సభ్యుడు నాకోటి నగేశ మాట్లాడుతూ అభివృద్ధి పనులపేరిట కేటాయించిన రూ. 2లక్షలతో ఏమి పనులు చయవచ్చునో అధికారులే చెప్పాలన్నారు.

కోరం కోసం ఎదురుచూపులు..

కౌన్సిల్‌ సాధారణ సమావేశ నిర్వహణకు అవసరమైన కోరం లేక నిర్దేశిత సమయానికి అరగంట ఆలస్యంగా సమావేశం ప్రారంభమైంది. ఉదయం 11గంటలకు జరగాల్సిన సమావేశం కోసం చైర్‌ పర్సన, వైస్‌ చైర్మన, కమిషనర్‌ సమావేశం హాల్‌కు వచ్చారు. కానీ కోరం లేకపోవడంతో అరగంట పాటు వేచి చూశారు. ఈ క్రమంలో 11.30కి కోరం సమకూరింది. ఆ వెంటనే మునిసిపల్‌ అధికారులు ఎప్పటి మాదిరిగానే ఎజెండాను ప్రవేశపెడుతూ ఒక్కో అంశంపై చర్చ జరిగాక మరో అంశాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తుండగా చైర్‌ పర్సన జోక్యం చేసుకుని 26ఎజెండా అంశాలను ఒకేసారి ప్రవేశపెట్టాకే అంశాల వారీగా చర్చించాలనడంతో అధికారులు మొత్తం మొత్తం ఎజెండాను చదివి వినిపించారు. గతంలో మాదిరిగానే అంశాల వారీగానే ఎజెండాను ప్రవేశపెట్టాలని పలువురు సభ్యులు డిమాండ్‌ చేశారు. దీంతో తదుపరి కౌన్సిల్‌ సమావేశంలో పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తామని చైర్‌ పర్సన హామీ ఇచ్చారు. అలాగే సమిష్టి నిర్ణయాలు, కృషితో పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని ప్రజల ఆకాంక్షాలను నెరవేరుద్దామని అన్నారు. వైస్‌ చైర్మన పోతంశెట్టి మంజుల, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 12:28 AM