Share News

సర్వే.. సరిచేసేనా?

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:12 AM

దశాబ్దానికి పైగా నిషేధిత జాబితాలో ఉన్న 1057 సర్వే నెంబరు భూవివాదానికి పరిష్కారం లభించనుంది. సర్వే నెంబరులోని భూసర్వేను అధికారులు సోమవారం ప్రారంభించారు

సర్వే.. సరిచేసేనా?

1057లో మొదలైన భూసర్వే

కొన్నాళ్లుగా పోరాటం చేస్తున్న రైతులు

నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూములకు పట్టాలు

దరణి, భూభారతిలో అసలుదారులకు దక్కని చోటు

1057లో సర్వే నిర్వహిస్తున్న రెవిన్యూ సిబ్బంది

(ఆంధ్రజ్యోతి-మేళ్లచెర్వు): దశాబ్దానికి పైగా నిషేధిత జాబితాలో ఉన్న 1057 సర్వే నెంబరు భూవివాదానికి పరిష్కారం లభించనుంది. సర్వే నెంబరులోని భూసర్వేను అధికారులు సోమవారం ప్రారంభించారు. ముందుగా సర్వే నెంబరు హద్దును గుర్తించి, ఆపై అందులో హక్కుదారుల భూమి సరిహద్దును నిర్ణయించనున్నారు. ఇందుకోసం ముందస్తు గా నోటీసులు జారీ చేశారు. దీంతో కొన్నాళ్లుగా భూహక్కుల కోసం ఎదురుచూస్తున్న రైతులు సర్వేపై ఆశలు పెట్టుకుని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

మేళ్లచెర్వు మండలంలో అత్యధిక విస్తీర్ణం కలిగిన సర్వే నెంబరులో 1057 ఒకటి. ఇందులో 630 ఎకరాల భూమి ఉంది.150 ఎకరాల భూదాన్‌ భూమితో పాటు 18 ఎకరాల సీలింగ్‌, 8 ఎకరాల దేవాలయ భూములు ఉండగా మిగిలిన భూమి రైతుల పేరు మీద నమోదై ఉంది. అయితే భూదాన్‌ భూమి అన్యాక్రాంతమై కేవలం రెవెన్యూ రికార్డులకే పరిమితమైంది. ఆ భూమిని గుర్తించి, భూదాన్‌బోర్డుకు అప్పగించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో అన్నిరకా ల భూములను ప్రభుత్వం నిషేధితజాబితాలో చేర్చింది. అప్పటి నుంచి సామాన్య రైతులకు చెందిన భూముల క్రయవిక్రయాలు, భూబదిలీలు పూర్తిస్థాయిలో నిలిచాయి. కాలం గడిచే కొద్దీ సమస్య జఠిలంగా మారింది.

వివాద నేపథ్యం...

సర్వే నెంబర్‌ 1057లో అత్యధిక విస్తీర్ణంలో భూమి ఉండ టం, అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన భూమి ఉండడం పట్టాదారులైన రైతులకు శాపంగా మారింది. వ్యవసాయ భూమి కంప్యూటరీకరణ సమయంలో కొంతమంది అక్రమార్కులు నకిలీ పత్రాలతో రెవెన్యూ అధికారుల అండదండలతో పట్టాలు పొందారు. ఈ క్రమంలో ధరణి సమయం లో తమ పేర్లపై భూమిని నమోదు చేసుకునేందుకు వెళ్లిన రైతులకు నిరాశ ఎదురైంది. ధరణి వెబ్‌సైట్‌లో అప్పటికే ఆనెంబరుపై పూర్తిస్థాయిలో భూమి నమోదై(అనగా భూమిమొత్తానికి సరిపడా రికార్డుల్లో పేర్లు, విస్తీర్ణం) ఉంది. నకిలీ పట్టాలతో రైతుల పేరు మీద భూమి పూర్తిగా నమోదుకావడంతో ఖాళీ లేకపోవడం సమస్యగా మారింది. దీంతో భూమి హక్కుదారుల పేర్లు నమోదుకు అవకాశం లేకుండా పోయింది.అధికారుల నిర్లక్ష్యం కారణంగా సమస్య జఠిలమైంది.

ముందస్తు నోటీసులు

రైతుల సుదీర్ఘపోరాటం, గత నెలలో సీఎం అసెంబ్లీలో చేసిన ప్రకటనతో అధికారులలో కదలిక వచ్చింది. ఈ నెల 12 నుంచి సర్వే చేపట్టారు. ఈ క్రమంలో సర్వే నెంబర్‌ 1057తో పాటు ఆనుకుని ఉన్న 1154లోని భూమి హక్కుదారులకు నాలుగు రోజులుగా నోటీసులు అందించారు. భూ మికి సంబంధించిన వారి వద్ద ఉన్న హక్కు పత్రాలను తీసుకుని సర్వేకు సహకరించాలని కోరారు. రికార్డుల ఆధారంగా ముందుగా సర్వే నెంబరులోని భూమి మొత్తానికి హద్దులను గుర్తిస్తున్నారు.

రైతుల్లో ఆందోళన

దశాబ్దానికి పైగా తమ భూమిపై హక్కుకోసం పోరాటం చేస్తున్న రైతులు సర్వేపై ఉత్కంఠతో ఉన్నారు. సర్వే సజావుగా సాగడంతో పాటు ప్రభుత్వానికి చెందిన భూమిని అధికారులు గుర్తించి, ఆ భూమిని స్వాధీనం చేసుకుని తమ భూములకు ఇప్పటికైనా యాజమాన్య హక్కుపత్రాలు అందించాలంటున్నారు. ఇకనైనా భూభారతిలో తమ పేరు నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నిషేధిత జాబితాతో నష్టపోయాం: కందుల వెంకటేశ్వరరావు, రైతు

తమ పొలం సర్వేనెంబర్‌ 1057లో ఉండటంతో ఇప్పటికే చాలా నష్టపోయా. అధికారులు తూతూమంత్రంగా కాకుండా నిష్పక్షపాతంగా సర్వే చేసి సాధారణ రైతుల భూములకు సంబంధించి యాజమాన్య హక్కుపత్రాలను అందించాలి. వంశపారపర్యంగా తనకు సంక్రమించిన భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలి.

Updated Date - Oct 13 , 2026 | 12:12 AM