పునర్విభజన నేరేడుచర్లకు కలిసొచ్చేనా?
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:12 AM
నియోజకవర్గాల పునర్విభజనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. శాసనసభా నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నేరేడుచర్ల నియోజకవర్గ ఏర్పాటుపై స్థానికుల నుంచి డిమాండ్ పెరుగుతోంది.
నియోజకవర్గాల పునర్విభజనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. శాసనసభా నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నేరేడుచర్ల నియోజకవర్గ ఏర్పాటుపై స్థానికుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఉమ్మడి నల్లగొండలో ఆరు శాసనసభ స్థానాలు పెరుగనుండగా, సూర్యాపేట జిల్లాలో 2 స్థానాలు పెరగుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని అర్హతలున్న నేరేడుచర్లను నియోజకవర్గ కేంద్రంగా చేయాలనే వాదన బలంగా వినిపిస్తోంది.
(ఆంధ్రజ్యోతి-నేరేడుచర్ల)
మునిసిపాలిటీలు కేంద్రంగా కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. జిల్లాలో ఐదు మునిసిపాలిటీలకు నాలుగు మునిసిపాలిటీలు నియోజకవర్గ కేంద్రాలుగా ఉన్నాయి. ఇక వేగంగా అభివృద్ధి చెందుతున్న నేరేడుచర్లను కూడా నియోజకవర్గం చేయాలని స్థానికులు కోరుతున్నారు. నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు మండలాలతో పాటు పెనపహాడ్ లేదా నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలాలను కలుపుకుంటే నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయవచ్చంటున్నారు. ఒకవేళ జిల్లా పరిధిని ప్రాతిపదికన తీసుకుంటే నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు, పెనపహాడ్ మండలాలను కలిపి ఒక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలంటున్నారు.
కొన్ని ప్రతిపాదనలు
నేరేడుచర్ల నియోజకవర్గం ఏర్పాటుకోసం కొన్ని ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు, పెనపహాడ్ మండలాలను కలుపుతూ నియోజకవర్గంగా చేస్తే 1,38,468మంది ఓటర్లు ఉం టారు. పెనపహాడ్‌గా బదులుగా దామరచర్ల, అడవిదేవులపల్లిని కలిపితే 1,47.750 మంది ఓటర్లు ఉంటారు. నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి, పెనపహాడ్, దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాలను కలిపితే 1,82,066 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ప్రాతిపదికనైనా నియోజకవర్గం చేయడానికి అర్హత ఉంటు ందని పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా మిర్యాలగూడ సమీప ప్రాంతాలను కలుపుతూ జిల్లా కేంద్రం చేయాలని ఇప్పటికే ఉద్యమం ఊపందుకుంది. అదే జరిగితే మిర్యాలగూడ జిల్లాలో నేరేడుచర్ల మరొక అసెంబ్లీ స్థానం ఏర్పాటుకావడానికి కూడా అన్ని అర్హతలు ఉం టాయంటున్నారు. దామరచర్ల, పాలకవీడు మండలాలలో సిమెంటు కర్మాగారాలు ఉండి వ్యాపారపరంగా ఇండసి్ట్రయల్ హబ్‌గా ఉందని గుర్తు చేస్తున్నారు.
ఆలయాలకు నెలవు..
నేరేడుచర్ల నియోజకవర్గం కోసం ప్రజలు ప్రతిపాదిస్తున్న మండలాల్లో కొన్ని ప్రత్యేక ప్రాంతాలున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధిచెందిన జానపహాడ్ దర్గా పాలకవీడు మండలంలో ఉండగా నేరేడుచర్ల మండలంలో అత్యంత ప్రాచీనమైన సోమప్ప దేవాలయం, పెనపహాడ్‌లో నాగులపాటిఅన్నారంలోని పురాతన త్రికుటేశ్వరాలయం ఉంది. ఈ రెండు ఆలయాలు కాకతీయుల కాలం నుంచే విశేషంగా పూజలు అందుకుంటున్నాయి. నల్లగొండ జిల్లాలోని అడవిదేవులపల్లిలో ప్రసిద్ధ సూర్యదేవాలయం, దామరచర్ల మండలంలో వాడపల్లి శివాలయం అత్యంత పేరుగాంచిన పుణ్యక్షేత్రం ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలోనే మూసీ, కృష్ణానదీల సంగమం ఉంది. మూసీనది, కృష్ణానదులు రెండు నేరేడుచర్ల, పాలకవీడు, దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాలను కలుస్తూ ప్రవహిస్తున్నాయి. గరిడేపల్లి మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్త వంగడాల అభివృద్ధికి కృషి చేస్తోంది. దీనితో పాటు నేరేడుచర్లలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉండటం, గడ్డిపల్లి(గరిడేపల్లి)లో నూతనంగా రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు కాబోతుండటాన్ని ప్రస్తావిసు ్తన్నారు. కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారి(167) కూడా గరిడేపల్లి, నేరేడుచర్లల నుంచి వెళుతోంది. ఆధ్యాత్మిక, విద్యాసంస్థలకు నెలవుగా ఇన్ని అర్హతలున్న నేరేడుచర్లతో పాటు ఈ మండలాలను కలుపుతూ నూతన నియోజకవర్గం ఏర్పాటు చేయాలనేది ఈ ప్రాంత ప్రజల డిమాండ్.
ఇప్పటికే కొందరు స్వచ్ఛంద సంస్థల సభ్యులు, రాజకీయ పార్టీల నేతలు ఈ అంశంపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేరేడుచర్ల, గరిడేపల్లి, పెనపహాడ్, పాలకవీడు మండలాలను కలిపి నియోజకవర్గం ఏర్పాటు చేయాలనేది బలమైన వాదనగా వినిపిస్తో ంది. నేరేడుచర్ల కేంద్రంగా నియోజకవర్గంగా ఏర్పా టైతే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి జరుగనుంది.