Share News

ప్రయత్నాలు ఫలించేనా?

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:10 AM

ఐదు రోజుల్లో ఇంటర్‌ పరీక్షలు జరుగనున్నాయి. మెరుగైన ఫలితాల కోసం ఇప్పటికే ఇంటర్‌ విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గత ఏడాది 24వ ర్యాంకుతో సరిపెట్టుకున్న జిల్లాను ఈ ఏడాది ఉత్తమ ర్యాంకు సాధించేందుకు కార్యచరణ రూపొందించారు.

ప్రయత్నాలు ఫలించేనా?

ఈ ఏడాది ప్రత్యేక కార్యాచరణతో ముందుకు

అదనపు తరగతులతో పాటు పలుమార్లు పరీక్షలు

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ

ఐదు రోజుల్లో ఇంటర్‌ పరీక్షలు జరుగనున్నాయి. మెరుగైన ఫలితాల కోసం ఇప్పటికే ఇంటర్‌ విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గత ఏడాది 24వ ర్యాంకుతో సరిపెట్టుకున్న జిల్లాను ఈ ఏడాది ఉత్తమ ర్యాంకు సాధించేందుకు కార్యచరణ రూపొందించారు. సకాలంలో సిలబస్‌ పూర్తి చేయడంతో పాటు పలుమార్లు పరీక్షలు నిర్వహించి, విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. గతేడాది అక్టోబరు నుంచి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో గంట వరకు రోజు వారీగా వివిధ సబ్జెక్టుల వారీగా ప్రత్యేక అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట(కలెక్టరేట్‌)

ప్రభుత్వ జూనియర్‌కళాశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఇంటర్‌ విద్యాశాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రైవేట్‌ కళాశాలల కంటే మెరుగైన విద్యనందించి ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు తక్కువేమి కాదని నిరూపించేందుకు జిల్లా ఇంటర్‌ విద్యాశాఖ చర్యలు చేపట్టింది. రెండేళ్లుగా వార్షిక ఫలితాల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదు. 2023-24 విద్యాసంవత్సరంలో ఫస్టియర్‌లో 48శాతం, సెకండీయర్‌లో 61శాతం ఉత్తీర్ణతతో సరిపెట్టుకున్నారు. జిల్లాకు ఫస్టియర్‌లో 28వ స్థానం, సెకండియర్‌లో 24వ స్థానం దక్కింది. 2024-25 వార్షిక ఫలితాల్లో ఫస్టియర్‌లో 54శాతం, సెకండీయర్‌లో 66.25శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు కలిపి 15,586 మందికి 9,403 మంది ఉత్తీర్ణత సాధించగా 60.32శాతం నమోదైంది.

గతేడాది 68.84 శాతమే..

జిల్లాలో 2025-26 వార్షిక ఫలితాల్లో ఫస్టియర్‌లో 6,389 మంది విద్యార్థులకు 3,613 మంది ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా సెకండీయర్‌లో 10,957 మందికి 7,543 మంది ఉత్తీర్ణులయ్యారు. 68.84 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండీయర్‌లో 5,006 మందికి 4,491 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో రాష్ట్ర స్థాయిలో ఫస్టియర్‌లో 26వ స్థానం, సెకండీయర్‌లో జిల్లాకు 24వ స్థానం దక్కింది. అయితే గత రెండేళ్లకంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇదిలా ఉండగా జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సూర్యాపేట, నెమ్మికల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలతో పాటు పలు కళాశాలల్లో ఆశించిన మేర ఫలితాలు రాలేదు. చాలామంది వివిధ సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయినట్లు సమాచారం.

16, 503 మంది ఇంటర్‌ విద్యార్థులు

జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఎనిమిది, ప్రభుత్వ కళాశాలలు 48, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు 30 ఉన్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 16,503 మంది విద్యనభ్యసిస్తున్నారు. కాగా ఈసారి వార్షిక ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 10 లోపు ర్యాంకులో ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ప్రత్యేక వార్షిక ప్రణాళిక

ఇంటర్‌ ఈ ఏడాది పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఫలితాల్లో జిల్లా మెరుగైన స్థానం సాధించేందుకు విద్యాసంవత్సరం మొదటి నుంచే ప్రత్యేక ప్రణాళికను రూపొందించి, అమలుచేస్తున్నారు. జిల్లాలో 168 మంది అధ్యాప కులు అవసరం కాగా రెగ్యులర్‌ అధ్యాపకులు 140 మంది ఉండగా, మిగిలిన 28 మందిని గెస్ట్‌ లెక్చరర్స్‌గా తీసుకున్నారు. గతేడాది అక్టోబరు నుంచి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం అదనంగా గంట పాటు రోజూ వివిధ సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. డిసెంబరు నెలాఖరు వరకు సిలబ్‌సను పూర్తిచేశారు. తర్వాత విద్యార్థులకు స్లిప్‌ టెస్టులు నిర్వహించి విద్యలో వెనుకబడిన వారిని గుర్తించి వారికి అవసరమైన విద్యాభోధన చేస్తున్నారు. ఈఏడాది జనవరి నుంచి సిలబ్‌సను రివిజన జరుగుతోంది. ఇప్పటికే యూనిట్‌, స్లిప్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. వాటి ఫలితాల ఆధారంగా విద్యార్థుల స్థాయిని గుర్తిస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి రోజూ ఉదయం వేళలో కొంతమంది నిపుణులతో అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్న విద్యార్థును గుర్తించి వారికి ప్రత్యేకంగా నిపుణులతో మాట్లాడిస్తున్నారు.

ఎమ్మెల్యే జగదీ్‌షరెడ్డి సాయంతో మధ్యాహ్న భోజనం

జిల్లాలోని ఇంటర్‌ విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నా భోజనం అందించేందుకు దాతలు ఎవరూ ముందుకు రాలేదు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని విద్యార్థులకు మాత్రం 45 రోజులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి తన తల్లి సావిత్రమ్మ జ్ఞాపకార్థం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. రోజూ సుమారు 880 మంది ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతోంది.

మెరుగైన ఫలితాలే లక్ష్యం

ఇంటర్‌లో ఈసారి మెరుగైన ఫలితాల సాధన కోసం కృషి చేస్తున్నాం. నాణ్యమైన విద్యనందించి విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది 100శాతం ఫలితాలు రాబట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ప్రైవేట్‌కు ధీటుగా ఫలితాలు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాం. అదనపు తరగతులు, లెక్చరర్స్‌ నియమాకంతో పాటు అవగాహన సదస్సులు నిర్వహించాం.

భానునాయక్‌, డీఐఈవో సూర్యాపేట.

Updated Date - Feb 20 , 2026 | 12:10 AM