Share News

పోచంపల్లిలో తాగునీటి సమస్య తీరేనా?

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:57 AM

ఎండలు ముదురుతున్నాయి. అడుగంటుతున్న భూగర్భజలాలు ఓ వైపు.. మరోవైపు ముంచుకొస్తున్న తాగునీటి ఎద్దడి.. భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడుతున్నారు.

పోచంపల్లిలో తాగునీటి సమస్య తీరేనా?
భూదానపోచంపల్లి కూడలి

భూదానపోచంపల్లి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఎండలు ముదురుతున్నాయి. అడుగంటుతున్న భూగర్భజలాలు ఓ వైపు.. మరోవైపు ముంచుకొస్తున్న తాగునీటి ఎద్దడి.. భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రపంచ పర్యాటకంగా పేరొందిన చారిత్రక నేపథ్యం ఉన్న భూదానపోచంపల్లి మునిసిపాలిటీలో గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నీటి కష్టాలు తప్పలేదు. ఆర్‌వోఆర్‌ ప్లాంట్లపైనే పట్టణ ప్రజలు ఆధారపడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ముందస్తు చర్యలు చేపడుతున్నారు. తాగునీటి సమస్యకు నూతన చైర్మన తడక వెంకటేశ్వర్లు ప్రత్యేక కార్యాచరణతో ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

- సగం గోదావరి, కృష్ణాజలాలు..

భూదానపోచంపల్లి పట్టణ వాసులకు సగం గోదావరి, కృష్ణా జలాలు మాత్రమే అందుతున్నాయి. మరిసగం మాత్రం స్థానిక జలాలు సరఫరా అవుతున్నాయి. గోదావరి జలాలను మూడ రోజులకోసారి, కృష్ణాజలాలు రెండు రోజులకోసారి, స్థానిక జలాలను రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నారు. పట్టణ జనాబా 18,750 మందికి రోజువారీగా 25.31 లక్షల తాగునీరు డిమాండ్‌ ఉండగా గోదావరి జలాలు 4.5 లక్షల లీటర్ల నీరు, కృష్ణా జలాలు 6.5లక్షల లీటర్ల నీరు సరఫరా చేస్తున్నారు. మిగతా స్థానిక నీటిని నిరంతరంగా సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పట్టణ ప్రజలకు మాత్రం స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయలేకుండా ఉన్నారు. కృష్ణా, గోదావరి జలాల సరఫరా కోసం వేసిన పైప్‌లైన్లు పూర్తిగా వేయలేదు. దీంతో పాత పైప్‌లైన్ల ద్వారా స్థానిక జలాలతో కలిపి కృష్ణా, గోదావరి జలాలు సరఫరా కావడంతో పట్టణ ప్రజలకు ప్రభుత్వం అందించే నీరు నిరుపయోగంగా మారింది. పట్టణ ప్రజలు ఆర్‌వో ప్లాంట్లను ఆశ్రయించి డబ్బులు వెచ్చించి తాగునీటిని పొందుతున్నారు. పట్టణంలో శాశ్వత తాగునీటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం అమృత 2.0 ద్వారా చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కలుగుతుంది.

తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

-తడక వెంకటేశ్వర్లు, చైర్మన, భూదానపోచంపల్లి మునిసిపాలిటీ

భూదానపోచంపల్లి మునిసిపాలిటీలో తాగునీటి సమస్య తలెత్తకుండా నూతన పాలక వర్గం అన్ని రకాల ముందస్తు చర్యలు చేపడుతున్నాం. వేసవిని దృష్టిలో పెట్టుకుని తగిన ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుటు పైప్‌ లైన్ల లీకేజీలను కనిపెట్టి మరమ్మతులు చేయడం, నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో కృష్ణా జలాలు, మరికొన్ని ప్రాంతాల్లో గోదావరి జలాలను సరఫరా చేస్తున్నాం. ఇప్పటికే ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సహకారంతో ముందస్తు చర్యలకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం. అమృత 2.0 పనులు పూర్తయితే పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

Updated Date - Mar 13 , 2026 | 12:57 AM