Share News

ఎవరి ధీమా వారిదే..

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:55 AM

మునిసిపల్‌ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాల నేతలు రంగంలోకి దిగారు. పార్టీ అభ్యర్థులను విజయతీరాలకు చేర్చేందుకు ఓవైపు ఉధృత ప్రచారం సాగిస్తున్న నేతలు మరోవైపు డివిజన్లు, వార్డుల్లో పరిస్థితులపై సర్వే చేయిస్తున్నారు.

ఎవరి ధీమా వారిదే..

వ్యూహ,ప్రతివ్యూహాల్లో పార్టీల నేతలు

మూడో స్థానంలో ఉండే అభ్యర్థుల ఓట్లపైనే అందరి దృష్టి

(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): మునిసిపల్‌ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్షాల నేతలు రంగంలోకి దిగారు. పార్టీ అభ్యర్థులను విజయతీరాలకు చేర్చేందుకు ఓవైపు ఉధృత ప్రచారం సాగిస్తున్న నేతలు మరోవైపు డివిజన్లు, వార్డుల్లో పరిస్థితులపై సర్వే చేయిస్తున్నారు. వాటినిబట్టి ప్రజలనాడిని గమనిస్తూ వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతున్నారు.

ప్రతీ మునిసిపల్‌ కేంద్రంలో చైర్మన్‌ స్థానం కాంగ్రెస్‌ ఖా తాలోకి రావడమే లక్ష్యంగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నారు. వారికి దీటైన వ్యూహంతో బలమైన అభ్యర్థులు, సామాజిక సమీకరణాలను తెరమీదకు తెస్తూ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి నేతృత్వంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం సాగిస్తున్నారు. ఉమ్మ డి జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు, 17మునిసిపాలిటీల్లో అత్యధిక స్థానా ల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నడుమ పోటాపోటీ ఉంటే, ప్రతీ మునిసిపాలిటీలో కొన్ని సీట్లలో దీటైన పోటీ ఇస్తున్న బీజేపీ దాదాపు అన్ని సీట్లలోనూ గతం కం టే అధికంగా ఓట్లను రాబట్టే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థులతో పాటు కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలో టికెట్‌ దక్కని కీలక నాయకులు మునిసిపాలిటీల్లో స్వతంత్రులుగా బరిలో దిగడంతో వీరు చీల్చే ఓట్లు ప్రధాన అభ్యర్థుల ఫలితాలను తలకిందులు చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇది నేతలకు, అభ్యర్థులకు సవాల్‌గా మారింది.

అధిక పోటీ ఉన్న చోట ఆందోళన

ఉమ్మడి జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు, 17 మునిసిపాలిటీల్లో తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో కొన్ని సీట్ల లో త్రిముఖ, చతుర్ముఖ పోటీ నెలకొంది. కార్పొరేషన్‌ సహా అన్ని మునిసిపాలిటీల్లోని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులను బరిలో దింపింది. ఎన్నికలు జరిగే అన్ని డివిజన్లు, వార్డుల్లో పోటీలో నిలిపింది. దీంతో సగానికి పైగా సీట్లలో త్రిముఖ పోటీ నెలకొనగా, ఇక్కడ మూడో స్థానంలో ఉండే పార్టీ అభ్యర్థికి వచ్చే ఓట్లు మొదటి రెండు స్థానాల్లో ఓట్లు పొందే అభ్యర్థుల జాతకాలను తారుమారు చేసే పరిస్థితి నెలకొందని ప్రధాన నేతలు ఆందోళన చెందుతున్నారు. వార్డుల్లో బలమైన ఓట్లు సాధిస్తే గెలుపు అవకాశాలకు గండి కొడతారని భావిస్తున్న మూడో అభ్యర్థులను బుజ్జగిస్తూ ఓట్లు కొల్లగొట్టకుండా ఉండేందుకు కీలక నేతలు వారితో చర్చలు ప్రారంభించారు. కొన్ని చోట్ల రెండో స్థానంలో ఉంటామని భావిస్తున్న అభ్యర్థులు, మూడో స్థానంలో ఉండే అభ్యర్థి పార్టీతో ములాఖత్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మునిసిపాలిటీ పరిధిలో రెండో స్థానంలో ఉండే వార్డుల్లో మూడో స్థానంలో ఉండే పార్టీ మద్దతిస్తే, పార్టీ మూడోస్థానంలో ఉండే వార్డుల్లో రెండో స్థానంలో ఉండే పార్టీకి మద్దతిస్తామంటూ స్థానికంగా సర్దుబాట్లకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మరోవైపు కొన్ని వార్డుల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలో టికెట్‌ దక్కని నాయకులు స్వతంత్రులుగా, చిన్న పార్టీల నుంచి అభ్యర్థులుగా బరిలో నిలిచారు. వీరు కొన్ని వార్డుల్లో ప్రధాన అభ్యర్థులకు బలమైన పోటీ ఇస్తుంటే, మరికొన్ని వార్డుల్లో వీరు చీల్చే ఓట్లు ప్రధాన అభ్యర్థుల తలరాతలు మార్చే పరిస్థితి ఏర్పడింది. దీంతో వీరికి నచ్చజెప్పడానికి పార్టీ పూర్వ నేతలు, తమవైపు తిప్పుకోవడానికి ప్రత్యర్థి పార్టీ నేతలు వలవేస్తున్న పరిస్థితి నెలకొంది. మునిసిపాలిటీల్లో గెలుపే లక్ష్యం గా రంగంలోకి దిగి ప్రతీ వార్డులో పోటాపోటీగా అభ్యర్థులను దింపి ప్రచారం సాగిస్తుండడంతో, అభ్యర్థుల నడుమనే కాకుండా ఏకంగా పార్టీల మధ్యనే లోపాయికారీ చర్చలు మొదలయ్యాయనే చర్చ రాజకీయవర్గాల్లో ఉంది. మొత్తంగా ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారడంతో ఈ రెండు, మూ డు రోజుల్లో ఉమ్మడి జిల్లాలో అనూహ్య రాజకీయపరిణామా లు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

Updated Date - Feb 07 , 2026 | 12:55 AM