ఎవరి లెక్కలు వారివే
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:35 AM
నిన్నటి వరకు ఒక లెక్క. గురువారం ఒక లెక్క. ఇదీ మునిసిపల్ ఎన్నికల అభ్యర్థుల తాజా విశ్లేషణ. ఈ నెల 10వ తేదీ వరకు ఎంతమంది ఓటర్లను కలిశాం, ఏం ఇచ్చాం.. ఇంకా ఏంకావాలి. ఎలా ఓట్లు రాబట్టుకోవాలో లెక్కలేశారు. ఎంత ఖర్చు చేస్తున్నామో లెక్కించకుండానే ముందుకు సాగారు.
నిన్నటి వరకు ఒక లెక్క. గురువారం ఒక లెక్క. ఇదీ మునిసిపల్ ఎన్నికల అభ్యర్థుల తాజా విశ్లేషణ. ఈ నెల 10వ తేదీ వరకు ఎంతమంది ఓటర్లను కలిశాం, ఏం ఇచ్చాం.. ఇంకా ఏంకావాలి. ఎలా ఓట్లు రాబట్టుకోవాలో లెక్కలేశారు. ఎంత ఖర్చు చేస్తున్నామో లెక్కించకుండానే ముందుకు సాగారు. ఈ నెల 11న బుధవారం పోలింగ్ ముగియడంతో గురువారం మరో లెక్కలపై పడ్డారు. ఎక్కడ ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉందీ, ఎక్కడ తక్కువ పడొచ్చు, ఓటింగ్ సరళిపై బూతల వారీగా ఓటర్ల జాబితాను దగ్గరపెట్టుకుని సమీక్షించారు. అనుచరులతో చర్చించి విజయావకాశాలపై ఒక అంచనాకు వచ్చారు. ఎవరికి వారు పైకి ధీమాగా కనిపిస్తున్నా లోలోపల ఆందోళన చెందుతున్నారు.
(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట / దేవరకొండ / చౌటుప్పల్ టౌన / యాదగిరిగుట్ట రూరల్ / కోదాడ టౌన / భూదానపోచంపల్లి )
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మునిసిపల్ పోరు ముగిసి పట్టణాల్లో ప్రశాంతత నెలకొంది. తుపాను అనంతర ప్రశాంతంలా వాతావరణం కనిపిస్తోంది. బుధవారం పోలింగ్ పూర్తి కావడం, ఒక్కరోజు గడిస్తే శుక్రవారం ఫలితాలు తేలనుండటంతో గురువారం విజయావకాశాలను అంచనా వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అనుచరులను, కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో మాట్లాడుతూ ప్రతీ అంశంపై ఆరా తీశారు. ఓట్ల సరళి, ఏ వీధిలో పడ్డాయి, ఎవరు ఓటు వేయలేదు, ఎక్కడ లాభం కలిగింది, ఎక్కడ నష్టం జరిగిందన్న విషయాలను వర్గీకరణ చేసుకుంటూ బిజీగా గడిపారు. ఎంత ఖర్చు చేశాం, ఓటర్లకు కానుకలు అందాయా లేదా అని సమీక్షించుకున్నారు. పోల్ మెనేజ్‌మెంట్ పైనా సమీక్ష చేశారు. కొందరు ఏదైతేనేం పోలింగ్ ముగిసింది, చేసేదేమీ లేదని ప్రశాంతంగా ఇతర పనుల్లో మునిగిపోయారు. అభ్యర్థులతో పాటు పార్టీ ముఖ్యులు కూడా తమ పార్టీ గెలుపొటములపై స్థానిక నాయకత్వం నుంచి ఆరా తీశారు.
ఫ సూర్యాపేట మునిసిపాలిటీల్లో చైర్‌పర్సన రేసులో ఉన్న అభ్యర్థులను కూడా సమీక్షలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ప్రత్యర్థులకు ధీటుగా ప్రచారం చేసినా, కానుకలు పంపిణీ చేసినా విజయావకాశాలపై పూర్తిస్థాయిలో ధీమా వ్యక్తం చేయలేని పరిస్థితి నెలకొంది. కొన్ని వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు ధీటైన పోటీ ఇవ్వడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు, ఓటములపై ఎటూతేల్చుకోలేక పోతున్నారు. ఓటర్ల లెక్కన డబ్బులు పంపిణీ చేసినా ఇతర ప్రాంతాల్లోని చాలామంది పోలింగ్ రాలేదని తెలిసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలింగ్ బూతల వారీగా
ఒక వార్డులో 700 మంది ఓటర్లుంటే ఒక పోలింగ్ బూతను ఏర్పాటుచేశారు. 2 వేల ఓట్లున్న చోట మూడు, 2700 ఓట్లుంటే నాలుగు బూతలను ఏర్పాటుచేశారు. అభ్యర్థులు గురువారం విశ్రాంతి తీసుకోకుండా బూతల వారీగా విశ్లేషణ చేశారు. ఎక్కడ తమకు ఎక్కువ ఓట్లు పడ్డాయి, ఎక్కడ తక్కువ పడ్డాయే విశ్లేషించుకున్నారు. గెలుపు ఓటములపై ఒక అంచనాకు వచ్చారు.
స్వతంత్రులు గెలిచేనా
సూర్యాపేట జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లోనూ కొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. సూర్యాపేటలో నలుగురు, కోదాడలో ఒకరు, హుజూర్‌నగర్‌లో ఒకరు, నేరేడుచర్లలో ఒకరు, తిరుమలగిరిలో ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమానంగా బరిలో ఉన్నారు. వీరిలో ఎంతమంది విజయం సాధిస్తారో వేచి చూడాలి. ప్రచారంలో కానీ, ఓటర్లకు కానుకలు పంపిణీ చేయడంలో పోటీపడ్డారు. సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాక ముగ్గురు అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేశారు. వీరికి బీఆర్‌ఎస్ మద్దతు తెలిపింది. మిగిలిన చోట్ల ఇదేవిధంగా స్వతంత్రులు కొంతమంది ప్రభావం చూపిస్తున్నారు.
సెంటిమెంట్ ఫలించేనా
గెలుపే లక్ష్యంగా కానుకలతో పాటు అభ్యర్థులు సెంటిమెంట్‌ను నమ్ముకున్నారు. ఒకటిరెండు సార్లు కలుస్తూనే కొంతమంది అభ్యర్థులు ఓటర్ల కాళ్లపై పడి మొక్కారు. వేటు వేయాలని దండాలు పెట్టారు. ఇటువంటి వారిని ఓటర్లు ఏమాత్రం కరుణిస్తారోనని ఎదురుచూస్తున్నారు. రెండు, మూడుసార్లు కౌన్సిలర్లుగా గెలిచిన ప్రజాసేవ చేసిన వారికి కూడా కానుకలు ఇవ్వకతప్పకపోగా, ఓటర్లను వేడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వారంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఫ నల్లగొండ దేవరకొండలో కౌంటింగ్ పాస్‌ల కోసం మునిసిపల్ కార్యాలయానికి అభ్యర్థులువచ్చారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మిగతా అభ్యర్థులతో ఓట్ల వివరాలు, గెలుపు, ఓటములు చర్చించుకోవడం కనిపించింది.
ఫ యాదగిరిగుట్టలో గెలుపుపై అధికార, ప్రతిపక్షాలు ఎవరికి వారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని డబ్బులు పంపిణీ చేసినా ఓట్లు పడ్డాయా లేదా అనే ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదిలా ఉండగా అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు ఇప్పటికే క్యాంప్‌లోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం.
ఫ భూదానపోచంపల్లి మునిసిపాలిటీలో ప్రధానపార్టీల అభ్యర్థులు పోలింగ్ సరళి తరువాత పార్టీలు లెక్కల్లో మునిగిపోయారు. పోలింగ్ జరిగిన తీరుపై సమీక్ష జరుపుతూ గెలుపు ఓటమిలపై చర్చించుకుంటున్నారు. మునిసిపాలిటీల్లో గెలుపుపై అభ్యర్థుల్లో ఎవరి ధీమా వారికే ఉంది. కాలనీల వారీగా ఎన్నిఓట్లు వచ్చే అవకాశం ఉందో అనుచరులతో లెక్కలు వేసుకుంటున్నారు. వీటితోపాటు తమకు అనుకూలంగా ఎవరు పనిచేశారు? ఎవరు వెన్నుపోటు పొడిచారు ? అనే వివరాలను తెలుసుకుంటున్నారు. స్వతంత్రులు నిలబడిన వార్డుల్లో పోటీ ఆసక్తిగా మారింది. పోచంపల్లిలో కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సల నుంచి టికెట్ దక్కని వారు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. వారు గెలుస్తారా? వారి ప్రభావం ఎవరి విజయావకాశాలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆలోచనలు అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
ఫ కోదాడ గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో ఓటర్ల నాడి అంతుచిక్కని వైనంగా ఉంది. ఓటేసిన వారిలో తమ వారెవరు, ఇతరులెవరో తెలియని పరిస్థితిలో గెలుస్తామా, ఓడుతామా అనే టెన్షనలో అభ్యర్థులు ఉన్నారు. కోదాడలో కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సతో పాటు స్వతంత్ర అభ్యర్థులూ గట్టిపోటీ ఇవ్వడంతో ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఓటర్లకు నగదు పంపకం చేసినా ఓట్లు పడ్డాయా లేదా అన్న టెన్షన అభ్యర్థుల్లో కనిపిస్తోంది. సహచరులు సైతం గెలుపొటములపై స్పష్టత ఇవ్వకపోవడంతో కొందరు అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. మరికొందరు ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్స్‌లో ఉందని దానిపై ఎందుకు ఆలోచన అన్నట్లుగా స్నేహితులతో సేదతీరుతున్నారు. మరికొందరు అభ్యర్థులు దేవాలయాలకు వెళ్లి గెలుపు అందించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నారు.
సోషల్ మీడియా పోల్స్‌పై..
మునిసిపల్ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు సోషల్‌మీడియాను విస్తృతంగా వినియోగించారు. సోషల్ మీడియాలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌పై పార్టీల నాయకులు ఆరా తీస్తున్నారు. ఫోన్ల ద్వారా, ఇతర సోషల్‌మీడియా ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. తమ అంచనాలను సరిగ్గా తూగుతున్నాయా, లేదా అని సరిచూసుకుంటున్నారు.
చిన్న చిన్న బెట్టింగ్‌లు
యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ప్రధానపార్టీల అభ్యర్థుల్లో కొందరు గురువారం ఆందోళనతో కనిపించగా, మరికొందరు ప్రశాంతంగా గడిపారు. కొందరు మెజార్టీపై లెక్కలు వేస్తుండగా, మరికొందరు 10 ఓట్ల తేడాతోనైనా బయటపడతామని భరోసాతో ఉన్నారు. ఓట్ల కూడికలు, తీసివేతలు వేసుకుంటున్నారు. అదేవిధంగా ఖర్చుల వివరాల పుస్తకాలను సైతం తిప్పేస్తున్నారు. గెలుపుపై అనుచరవర్గాలు, అభిమానులు చిన్నచిన్న బెట్టింగ్‌లు కడుతున్నారు. గెలిస్తే మందు పార్టీలు, దేవాలయాలకు తీసుకెళ్తామంటూ హామీలు ఇస్తున్నారు.
క్యాంప్‌లకు తరలివెళ్లిన అభ్యర్థులు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు గురువారం క్యాంప్‌లకు తరలివెళ్లారు. కాంగ్రె్‌సకు చెందిన 19మంది అభ్యర్థులతో పాటు ఏకగ్రీవ కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరీ, బీఆర్‌ఎ్‌సకు చెందిన 12 మంది అభ్యర్థులు వేర్వేరుగా క్యాంప్‌లకు వెళ్లారు. భువనగిరిలో శుక్రవారం కౌంటింగ్ వద్దకు వెళ్లి గెలుపు పత్రాలను తీసుకొని మళ్లీ క్యాంప్‌లకు వెళ్లనున్నారు. ఈ నెల 16వ తేదీన నిర్వహించే చైర్మన, వైస్‌చైర్మన ఎన్నికల వరకు క్యాంప్‌లోనే ఉండనున్నారు.