గెలిచినా.. ఓడినా లెక్కలు చెప్పాల్సిందే..
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:52 AM
మునిసిపల్ ఎన్నికలు ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బుల వరద పారింది. అయితే నిబంధనల పరిమితి మేరకు వ్యయ వివరాలను ఎన్నికల సంఘానికి అందజేయాల్సి ఉంటుంది. పోటీ చేసి గెలిచి నా.. ఓడినా రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఎన్నికల ఘట్టం ముగిసిన 45 రోజుల్లోపు వ్యయ వివరాలను అధికారులకు అందజేయాలి.
మునిసిపల్ ఎన్నికల ఖర్చుల నివేదనకు ఈ నెల 29 వరకు గడువు
జిల్లాలో ఆరు మునిసిపాలిటీలు, 353 మంది అభ్యర్థుల పోటీ
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి) : మునిసిపల్ ఎన్నికలు ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బుల వరద పారింది. అయితే నిబంధనల పరిమితి మేరకు వ్యయ వివరాలను ఎన్నికల సంఘానికి అందజేయాల్సి ఉంటుంది. పోటీ చేసి గెలిచి నా.. ఓడినా రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఎన్నికల ఘట్టం ముగిసిన 45 రోజుల్లోపు వ్యయ వివరాలను అధికారులకు అందజేయాలి.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన సాధారణ మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వారి రోజువారీ ఎన్నికల ఖర్చుల వివరాలను అందజేసేందుకు 45 రోజులగడువు ఈనెల 29వతేదీ లోపు ముగియనుంది. ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల వ్యయ నివేదికలు అందజేయని అభ్యర్థులపై మునిసిపల్ ఎన్నిక ల చట్టం ప్రకారం ఎన్నికల సంఘం చర్యలు తీసుకు నే అవకాశాలున్నాయి. గడువులోగా వ్యయ నివేదికలు సమర్పించకపోతే ఎన్నికైన అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించేఅధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది. ఓట మి చెందిన అభ్యర్థులు మూడు నుంచి ఆరేళ్ల వరకు పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్ అవసరాల కోసం ఎన్నికల వ్యయాన్ని నమోదు చేసి మునిసిపల్ ఎన్నికల అధికారులకు అందజేసే హడావుడిలో గెలిచిన కౌన్సిలర్లు, ఓడిన అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల సంఘం పరిమితి మేరకు నిర్ణీత ఫార్మెట్‌లో అధికారులకు వ్యయ లెక్కలు అందజేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
పరిమితికి ఎన్నో రేట్లు అధిగమించి
మునిసిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థుల ఖర్చులపై పరిమితులను విధించింది. ము నిసిపల్ ఎన్నికల చట్టం-2019 ప్రకారం జీహెచ్‌ఎంసీయేతర కార్పొరేషన్‌లో వార్డు కార్పొరేటర్‌కు ఎన్నికల వ్యయ పరిమితి రూ.1.50లక్షలు కాగా, ఇతర మునిసిపాలిటీల్లో కేవలం రూ.1లక్ష మాత్రమే. అయితే ఆచరణలో మాత్రం కొన్ని చోట్ల పరిమితికి 200 రెట్లకు మించి అభ్యర్థులు వ్యయం చేశారు. కానీ ఎన్నికల వ్యయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి, దానికి సంబంధించిన ఆధారాలను రికార్డు చేయాల్సిన వ్యయ పరిశీలకులు ప్రేక్షక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో ఒక్కో వార్డులో గరిష్ఠంగా వార్డు కౌన్సిలర్ రూ.లక్ష మాత్రమే ఖర్చు చేయాల్సి ఉండగా, వాస్తవంగా రూ.2కోట్లు కూడా వ్యయం చేసిన అభ్యర్థులు ఉన్నారు.
మొత్తం 353 మంది అభ్యర్థులు : జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో 104 వార్డులు ఉండగా, వాటిలో యాదగిరిగుట్ట మునిసిలిపాలిటీలో ఒకటి, చౌటుప్పల్‌లో మరొకటి ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 102 వార్డులకు ప్రధా న రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 353మంది పోటీచేశారు. వీరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు కనిష్ఠంగా వార్డుకు రూ.30లక్షలు ఖర్చు చేయగా, గరిష్ఠంగా రూ.2.50కోట్ల వరకు ఖర్చు చేసినట్టు వినికిడి.
నిబంధనల మేరకు వ్యయ నివేదికలు : ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లో వ్యయానికి సంబందించిన నివేదికలు అధికారులకు అందజేయాలి. ఈ గడువు మరో రెండు వారాల్లో ముగుస్తుండటంతో, నిబంధనల మేరకు నివేదకలను అభ్యర్థులు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల సంఘమే జెండాకు ఎంత ఖర్చ, బ్యానర్‌కు ఎంత?, టిఫిన్లకు ఎంత? భోజనాలకు ఎంత? అని నిర్ణయిస్తుంది. ఆ పరిధిలోనే వ్యయ నివేదికలు సిద్ధం చేసి అధికారులకు అందజేస్తున్నారు. ఎన్నికల సంఘం వ్యయ జాబితాలో లేని అనైతిక ఓట్ల కొనుగోలు, మద్యం, మాంసం వంటి పంపిణీలకే అభ్యర్థులు లక్షలు, కోట్ల రూపాయల వ్యయం చేశారనేది బహిరంగ రహస్యం.