ఉన్నపళంగా పొమ్మంటే ఎక్కడికి పోయేది?
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:44 AM
వాళ్ల తాతలు, తండ్రులు, వాళ్లూ పుట్టి పెరిగింది అక్కడే. బంధువులు, మిత్రులు, తోటి స్నేహితులంతా కలిసి ఒకే కు టుంబంలా జీవిస్తున్నారు. సజావుగా సాగుతున్న వారి కుటుంబాల్లో ఆధునికీకరణ పేరుతో పిడుగులాంటి వార్త వచ్చిపడింది. మీరుండే ఇళ్లు, స్థలాలు మీ వి కావు. ఇక్కడి నుంచి వెళ్లిపోండని నోటీసులు వచ్చాయి. దీంతో వారు దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ దినదినగండంగా బతుకీడుస్తున్నారు.
వందేళ్లుగా ఇక్కడే ఉంటున్నాం..
యాదాద్రి రైల్వే స్టేషన్ విస్తరణ.. పరిసరాల ఇళ్లకు నోటీసులు
పునరావాసం కల్పించాకే, ఖాళీ చేయించాలని వేడుకోలు
(ఆంధ్రజ్యోతి-భువనగిరి రూరల్): వాళ్ల తాతలు, తండ్రులు, వాళ్లూ పుట్టి పెరిగింది అక్కడే. బంధువులు, మిత్రులు, తోటి స్నేహితులంతా కలిసి ఒకే కు టుంబంలా జీవిస్తున్నారు. సజావుగా సాగుతున్న వారి కుటుంబాల్లో ఆధునికీకరణ పేరుతో పిడుగులాంటి వార్త వచ్చిపడింది. మీరుండే ఇళ్లు, స్థలాలు మీ వి కావు. ఇక్కడి నుంచి వెళ్లిపోండని నోటీసులు వచ్చాయి. దీంతో వారు దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ దినదినగండంగా బతుకీడుస్తున్నారు.
అది ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ సందర్శనకు రైల్వే కూడ లి. వివిధ రాష్ట్రాల నుంచి యాదగిరి నృసింహుడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల పై (చిరువ్యాపారాలు చేసుకుంటూ) ఆధారపడి వందేళ్లుగా జీవనం సాగిస్తున్న కుటుంబాలు వీధిన పడే పరిస్థితులు నెలకొన్నాయి. భువనగిరి మండలం రాయిగిరి గ్రామ రెవెన్యూ పరిధిలోగల యాదాద్రి రైల్వేస్టేషన్ ఆధునికీకరణ, ఎంఎంటీఎస్ రైల్వే అదనపు ట్రాక్ నిర్మాణం కోసం స్టేషన్ పరిసరాల్లోని గృహాల తొలగింపునకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నోటీసులు జారీచేశారు. దీంతో దాదాపు వందేళ్లుగా తాతలు, తండ్రులు నాలుగు తరాలుగా ఆవాసముంటున్న తమ ఇళ్లను స్వాధీనం చేసుకుంటే తామెక్కడ ఉండాలని నిర్వాసిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. తమకు ప్రత్యామ్నాయ గృహ వసతి, పునరావాస చర్య లు చేపట్టిన తర్వాతే తమ నివాస గృహాలను స్వాధీనం చేసుకోవాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
యాదాద్రి స్టేషన్ వద్ద 29 గృహాలకు నోటీసులు
భువనగిరి మండలం రాయిగిరి రైల్వే స్టేషన్.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శిం చే భక్తులకు రైల్వే కూడలి. ఈ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని యాదగిరిగుట్ట ఆలయానికి రాకపోకలు సాగించే భక్తులపై ఆధారపడి పలు పేద కుటుంబాలు జీవనం సాగిస్తుంటాయి. యాదగిరిగుట్ట ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యికోట్లతో పునరుద్ధరించి, ప్రపం చస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేసింది. దీంతో ఆలయాన్ని సందర్శించే వివిధ రాష్ట్రాల భక్తులకు రైల్వే ప్రయాణ సదుపాయాలను మెరుగుపరచాలని ప్రతిపాదించారు. ఈ మేరకు నిన్నమొన్నటి వరకు రాయిగిరి స్టేషన్‌గా వ్యవహరించిన దానికి యాదా ద్రి రైల్వే స్టేషన్‌గా కేంద్ర రైల్వేశాఖ మార్చింది. అదేవిధంగా అమృత భారత్ పథకంలో రూ.6కోట్లతో రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను చేపట్టింది. దాదాపు రూ.142కోట్లతో ఎంఎంటీఎస్ ఫేజ్-2 మార్గాన్ని వంగపల్లి స్టేషన్ వరకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు అదనపు రైల్వే ట్రాక్ నిర్మాణ పనులతోపాటు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు. ఇందుకోసం స్టేషన్ పరిసరాల్లోని నివాస గృహాల స్థల సేకరణ తప్పనిసరిగా రైల్వే అధికారులు భావిస్తున్నారు. అదే విధంగా ఈ గృహాల నిర్మాణం సైతం అప్పట్లో రైల్వే భూములను ఆక్రమించుకుని ఆవాసాలు ఏర్పరుచుకున్నారని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు 29 గృహాలను సర్వే చేసి, ఆస్తుల ఆక్రమణలను తొలగించనున్నట్లు నోటీసులు జారీ చేశారు. వీటిలో 16 గృహాలు పూర్తిగా,మరో 13 గృహాలను పాక్షికంగా తొలగించనున్నట్లు రైల్వే సబ్ డివిజనల్ ఇంజనీర్ నోటీసులు జారీ చేశారు. దీంతో వంద సంవత్సరాలుగా, తమ తాతలు, తండ్రుల కాలం నుంచి నివసిస్తున్న ఇళ్లను ఉన్నఫలంగా ఖాళీ చేయిస్తే తమ కుటుంబాలు వీధిన పడుతాయని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గృహాల్లో దాదాపు 200 మందికిపైగా పిల్లాపాపలతో నివసిస్తున్నామని చెబుతున్నారు. ఈ గృహాలను, రహదారిని సైతం రైల్వేశాఖ స్వాధీనం చేసుకోవడం ద్వారా స్టేషన్ సమీపంలోని కొండపైగల శ్రీవేంకటేశ్వర ఆలయానికి దారి కూడా లేకుండా అవుతుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నిర్వాసితులు మాత్రం తమకు న్యాయమైన పరిహారం చెల్లించాలని, ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించిన తర్వాతే తమ గృహాలను స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. ఈమేరకు కలెక్టర్ అనురాగ్‌జయంతిని, దక్షిణ మద్య రైల్వే అదనపు డివిజనల్ మేనేజర్ ముత్యాల నాయుడును కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.
ముత్తాతల నుంచి నివసిస్తున్నాం: పాల్త్య హనుమంతు నాయక్, మాజీ ఎంపీటీసీ, రాయిగిరి
రైళ్లలో యాదగిరిగుట్టకు వచ్చే భక్తులపై ఆధారపడి మా తాతలు, తండ్రుల కాలం నుంచి రైల్వే స్టేషన్ వద్ద నివాసాలు ఏర్పరుచుకున్నాము. దాదాపు నాలుగు తరాలుగా మేము ఇక్కడ నివసిస్తూ పక్కా భవనాలు నిర్మించుకున్నాం. ఏనాడు రైల్వేశాఖ తమ స్థలాలని చెప్పలేదు. కానీ ప్రస్తుతం ఉన్నఫలంగా రైల్వే అధికారులు మా ఇళ్లు వాళ్ల స్థలంలో ఉన్నాయని నోటీసులు ఇచ్చారు. నిరుపేదవర్గాలకు చెందిన తమను ఖాళీ చేయమంటున్నారు. దీంతో వీధిన పడుతున్న మా కుటుంబాలకు న్యాయమైన పరిహారం, ప్రత్యామ్నాయ గృహ వసతి, పునరావాసం కల్పించాలి.