Share News

పరిహారమేదీ..?

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:34 AM

రేయనక.. పగలనక.. చమటోడ్చి సాగు చేసిన పంట తీరా నోటికాడికొచ్చే సమయాన ప్రకృతి విపత్తు దెబ్బతీసింది. రూ.లక్షలు అప్పు తెచ్చి పెట్టుబడి పెడితే నష్టపరిహారం వచ్చేది మాత్రం రూ.వేలల్లో. అదీ నెలల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి. జిల్లావ్యాప్తంగా 2025 వానాకాలంలో 1,807 మంది రైతుల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

పరిహారమేదీ..?

కాగితాలపై లెక్కలకే పరిమితమైన పంట నష్టం

ఏడాదిన్నరగా ట్రెజరీల్లోనే మూలుగుతున్న పరిహారం బిల్లులు

జిల్లాలో 2025 వానాకాలంలో 1,807 రైతుల పంటనష్టం

పెండింగ్‌లోనే రూ.2.19 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): రేయనక.. పగలనక.. చమటోడ్చి సాగు చేసిన పంట తీరా నోటికాడికొచ్చే సమయాన ప్రకృతి విపత్తు దెబ్బతీసింది. రూ.లక్షలు అప్పు తెచ్చి పెట్టుబడి పెడితే నష్టపరిహారం వచ్చేది మాత్రం రూ.వేలల్లో. అదీ నెలల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి. జిల్లావ్యాప్తంగా 2025 వానాకాలంలో 1,807 మంది రైతుల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంట చేతి కి వస్తుందనే నమ్మకం లేకుండా పోతోంది. గతేడాది వానాకాలంలో అతివృష్టి, వడగండ్లు చేతికి వచ్చిన పంటను దెబ్బతియగా.. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితుల్లో పొట్టదశ లో.. పూత.. కాత దశల్లో రైతన్నలకు తీరని నష్టం చేకూరుస్తున్నాయి. జిల్లాలో 2025లో ఏప్రిల్‌ నుంచి 2025 అక్టోబరు చివరి వరకు ప్రకృతి పగబట్టి పంటలకు నష్టం చేకూరిస్తే.. ఈ ఏడాది ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితులు రైతులను అప్పుల పాలు చేస్తున్నాయి. ఈ ఏడాది వానాకాలం పంటలపై వర్షాభావ పరిస్థితుల ప్రభావం పంటనష్టం అంచనాలకు ప్రభుత్వం కరువు మండలాల ప్రకటన దిశగా కసరత్తు ప్రారంభిస్తున్నా.. నష్టపోయిన రైతుల కు పరిహారం చేతికి అందుతుందన్న నమ్మకమైతే లేకుండా పోతోంది. గతేడాది ఇదే యాసం గి కోతలు, వానాకాలం కోతలవేళ అకాల వర్షా లు.. వడగండ్ల వర్షాలు రైతులకు మిగిల్చిన కడగండ్ల నుంచి ఆదుకుంటామని.. నష్టం అంచనా లు, రైతుల వారీగా వివరాలు సేకరించి.. ఎకరానికి రూ.10వేల పరిహారం బిల్లులు సైతం సిద్ధంచేసి, ట్రెజరీకి నివేదించారు. అయితే ఏడాదిన్నరగా రైతుల కాగితాల్లో లెక్కలకే పరిమితమైంది. ట్రెజరీల్లో బిల్లులు ఎప్పుడు మంజూరైతాయి..? రైతుల ఖాతాల్లో ఎప్పుడు జమవుతాయో? కూడా నమ్మకంలేని పరిస్థితులు నెలకొన్నాయి.

దఫాలుగా పంట నష్టం

2025లో యాసంగి కోతలు పట్టే ఏప్రిల్‌, మేనెలల్లో, వానాకాలం పంట పొట్టదశ, కోతల కాలంలో అకాల వర్షాలు, వడగండ్లు, భారీ వర్షాల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏప్రి ల్‌ 3న కురిసిన అకాలవర్షం, వడగండ్ల కారణంగా 145మంది రైతులకు చెందిన 236.17 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వారం రోజుల్లోనే మరోసారి ప్రకృ తి ప్రకోపంతో ఏప్రిల్‌ 10 నుంచి 25వ తేదీ మధ్య 1,230మంది రైతులకు చెం దిన 1,386.24 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా మే నెలలో కోత లు కోస్తూ, కల్లాల్లో ధాన్యం సిద్ధం చేస్తుండగా.., చేతికొచ్చిన పంటలను వరుణుడు నీటిపాలు చేశాడు. మే 2న కురిసిన వడగండ్లకు 49 మంది రైతుల కు చెందిన 126.07ఎకరాల పంటలు నేలపాలయ్యాయి. యాసంగిలో దెబ్బతి న్న రైతులను వానదేవుడు వానాకాలం పంటల కోతల వేళల్లో సైతం వెంటాడా డు. ఆగస్టు 11వ తేదీ నుంచి 28వరకు భారీగా కురిసిన వర్షాలతో 31మంది రైతులకు చెందిన 20.35ఎకరాల వరిపైరు దెబ్బతింది. అదేవిధంగా అక్టోబరు 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు తుఫాన్‌ వర్షాలు కమ్ముకోవడంతో చేతికి అందిరావాల్సిన పంటలు నీటి పాలయ్యాయి. దాదాపు ఆరు రోజులపాటు ఎడతెరపిలేని తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో 352 మంది రైతులకు చెందిన 425.65ఎకరాల్లో వరి, పత్తి, కూరగాయాల పంటలకు నష్టం వాటిల్లింది.

జిల్లాలో 1,807 మంది రైతులు... రూ.2.19 కోట్ల పంట నష్టం..

జిల్లాలో రైతులపై ప్రకృతి పగ బట్టి నట్లుగా 2025 ఏప్రిల్‌నుంచి అక్టోబరు వరకు పలు దఫాలుగా అకాల వర్షాలు, వడగండ్లు, భారీ వర్షాలు పంటలను అతలాకుతలం చేశాయి. వరి, పత్తి, మామిడి, సపోట, మిర్చి, టమాట, మొక్కజొన్నతోపాటు కూరగాయలు, ఆకుకూరల తోటలను ధ్వంసం చేశాయి. వ్యవసాయ శాఖ చేపట్టిన అధికారిక సర్వే ప్రకారం జిల్లాలో అకాల వర్షాలకు 1,807మంది రైతులపై ప్రభావంచూపింది. దాదాపు 2,194.46 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అయితే అధికారికంగా నమోదైన పంటనష్టం కంటే క్షేత్రస్థాయి నష్ట తీవ్రత ఎక్కువగానే ఉంది. నష్ట అంచనా నిబంధనలు, నమోదు ప్రక్రియలో పరిమితుల కారణంగా నష్టంవాటిల్లిన పంటలు మొత్తం లెక్కల్లోకి రాలేదు. వాస్తవంగా జిల్లాలో దాదాపు రూ.100కోట్లకు పైగా రైతులకు నష్టం వాటిల్లింది. అయితే రైతులకు తక్షణ ఆర్థికసాయంగా ప్రభుత్వం పంట పెట్టుబడి ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఎకరాకు రూ.10వేల చొప్పున అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ సైతం జిల్లాలో జరిగిన పంటనష్టం లెక్కలువేసి, రూ.2.19కోట్ల నష్టపరిహారం అందించడానికి రైతులవారీగా పట్టాదారు పాస్‌పుస్తకాలు, బ్యాంక్‌ ఖాతాల వివరాలను సేకరించారు. రైతులకు అందాల్సిన పరిహారం బిల్లులను సిద్ధంచేసి వ్యవసాయ శాఖ డైరెక్టరేట్‌ ద్వారా ట్రెజరీకి పంపించారు. పంటనష్టం ఇన్‌పుట్‌ సబ్సిడీ నేరుగా బాధితరైతుల ఖాతాల్లోనే జమచేస్తారని చెప్పి ఊరడించారు. కానీ పంటనష్టం లెక్కలు కాగితాల్లోనే.. బిల్లులు ట్రెజరీల్లోనే నిరీక్షిస్తున్నాయి.

ఏడాదిన్నరగా ట్రెజరీల్లోనే పంట నష్ట పరిహారం బిల్లులు

అకాల వర్షాలు.. వడగండ్లు.. చేతికి అందివచ్చే పంటలు నేలపాలు.. నీటిపాలై.. రైతుకు నష్టం పరిపాటిగా మారింది. సంఘటనలు జరిగిన వెంటనే ప్రజాప్రతినిధుల పంటనష్ట పరిశీలనలు.. ఓదార్పు యాత్రలతో హడావుడి కూడా అంతే పరిపాటిగా మారింది. రైతులకు ఊరడింపుగా వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు పంటపొలాల్లో తిరిగి అంచనా సిద్ధం చేయడం కూడా ఈ వ్యవహారంలో భాగంగానే మారింది. జిల్లాలో 2025 ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు పలు దఫాలుగా కురిసిన వర్షాలతో పంట నష్టం జరిగితే ప్రతిసారీ ఇదే తంతు జరగడం ఆనవాయితీగా మారింది. ప్రతిసారి అంచనాలు, కంటితుడుపుగా ఎకరానికి రూ.10వేల ఇన్‌పుట్‌ సబ్సిడీ ప్రకటనలు.. వాటికి సవాలక్ష నిబంధనలు, పరిమితులతో పంపిన కొద్దిపాటి బిల్లులు సైతం ఏడాదిన్నరగా ట్రెజరీలోనే పడి ఉన్నాయి. పంట నష్టపోయిన రైతులుసైతం పంట పరిహారం ప్రభుత్వం నుంచి వస్తుందనే నమ్మకం సైతం కోల్పోవాల్సి వస్తుంది. రూ.లక్షలు పెట్టిన పెట్టుబడికి, అరకొరగా ఇస్తామన్న ఇన్‌పుట్‌ సబ్సిడీ బిల్లులను ట్రెజరీల్లో దుమ్ముదులిపి, బాధిత రైతుల ఖాతాల్లో జమచేయాలని కోరుతున్నారు.

బిల్లులు ట్రెజరీకి పంపాము: పి.వెంకటరమణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి

అకాల, భారీవర్షాల కారణంగా 2025 ఏప్రిల్‌నుంచి అక్టోబరు వరకు జిల్లాలో పంట నష్టం జరిగిన రైతుల వివరాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపుల బిల్లులను రైతులవారీగా ప్రభుత్వానికి నివేదించాం. ఈ బిల్లులు చెల్లింపులకోసం ట్రెజరీలోనే ఉన్నాయి. నిధులు మంజూరైన వెంటనే నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలున్నాయి.

వరుసగా నష్టాలు: రెడ్డబోయిన రాజు, రైతు, మొల్లగూడెం, రాజాపేట మండలం

రెండేళ్లుగా వడగండ్లు, అకాల వర్షాలు. ఇప్పుడేమో ఎల్‌నినోతో వానల్లేక కరువు వెంటాడుతోంది. 2025లో వానాకాలం పంటగా నాలుగు ఎకరాల వరిసాగు చేస్తే వడగండ్లు కురిసి కోతకు వచ్చిన పంట నేలపాలైంది. దాదాపు వడ్లు మొత్తం నేలరాలి రూ.లక్ష పెట్టుబడి నష్టపోయి అప్పులే మిగిలాయి. ప్రస్తుతం వర్షాల్లేక బోర్లు అడుగంటిపొలాలు ఎండిపోతున్నాయి. వడగండ్లు కురిసినప్పుడు ప్రజాప్రతినిధులు వచ్చి హడావుడి చేశారు. వ్యవసాయ అధికారులు పరిశీలించి పరిహారం ఇస్తామన్నారు. కానీ నయాపైస పరిహారం అందలేదు.

రెండున్నర ఎకరాల వరిపైరు దెబ్బతింది

వలిగొండ మండలం గోకారానికి చెందిన తుర్కపల్లి సురేందర్‌ వరిపైరు సాగు చేశాడు. అయిదు ఎకరాలను ధర్మారెడ్డి కాల్వ కింద సాగు చేయగా, 2025లో ఏప్రిల్‌లో కురిసిన భారీ వర్షాలకు రెండున్నర ఎకరాలు పూర్తిగా నేలవాలి నష్టం వాటిల్లింది. దాదాపు రూ.1.80లక్షల పంట పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైంది. వ్యవసాయ అధికారులు వచ్చి పంటను పరిశీలించి నివేదిక సైతం పంపామని చెప్పారు. ఏడాదిన్నర కావొస్తున్నా ఇంత వరకు చిల్లిగవ్వకూడా నష్టపరిహారం చెల్లించలేదు.

- తుర్కపల్లి సురేందర్‌, రైతు, గోకారం, వలిగొండ మండలం

Updated Date - Oct 12 , 2026 | 12:34 AM