Share News

ట్రామాకేర్‌ కేంద్రాలేవీ?

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:05 AM

రోడ్డు ప్రమాద అనంతరం గోల్డెన అవర్‌లో క్షతగాత్రులకు సరైన వైద్య చికిత్సలు అందడం లేదు. హైవేలు, ప్రధానరహదారులపై 35 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఒక ట్రామాకేర్‌ సెంటర్‌ ఉండాల్సి ఉన్నా ఉమ్మడి జిల్లాలో ఎక్కడా ఏర్పాటుచేయలేదు.

ట్రామాకేర్‌ కేంద్రాలేవీ?

గోల్డెన అవర్‌లో అందని వైద్యసేవలు

మృత్యువాతపడుతున్న క్షతగాత్రులు

జిల్లాలో ఏర్పాటుకాని ట్రామాకేర్‌ సెంటర్లు

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట క్రైం)

రోడ్డు ప్రమాద అనంతరం గోల్డెన అవర్‌లో క్షతగాత్రులకు సరైన వైద్య చికిత్సలు అందడం లేదు. హైవేలు, ప్రధానరహదారులపై 35 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఒక ట్రామాకేర్‌ సెంటర్‌ ఉండాల్సి ఉన్నా ఉమ్మడి జిల్లాలో ఎక్కడా ఏర్పాటుచేయలేదు. దీంతో క్షతగాత్రులు వైద్యం అందక మృతి చెందుతున్నారు. సమీపంలోని ఆసుపత్రులకు క్షతగాత్రులను తరలించినా ఆ సమయంలో వైద్యులు, సిబ్బంది ఉండక వైద్యం అందడం లేదు. కొన్నేళ్లుగా ట్రామాకేర్‌ సెంటర్ల ఏర్పాటు చేస్తామంటున్నా ఆచరణలోకి రాలేదు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా చుట్టూ జాతీయ రహదారులతో పాటు ప్రధాన రహదారులు ఉన్నాయి. వేల సంఖ్యలో వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా హైదరాబాద్‌-విజయవాడ(65)వ జాతీయ రహదారి 154 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అదేవిధంగా బీబీనగర్‌ మండలంలోని ఔశాపూర్‌ నుంచి ఆలేరు మండలం వరకు 50 కిలోమీటర్ల మేర హైదరాబాద్‌-భూపాలపల్లి రహదారి విస్తరించి ఉంది. వీటికి తోడు నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి 85 కిలోమీటర్లు, కోదాడ-జడ్చర్ల హైవే 145 కిలోమీటర్లు, సిరోంచ-రేణిగుంట హైవే 135 కిలోమీటర్లు, సూర్యాపేట-జనగాం 50 కిలోమీటర్లు, హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ ప్రధాన రహదారి 185 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.

ఉమ్మడి జిల్లాకు నాలుగు వైపులా

ఉమ్మడి జిల్లా చుట్టూ నాలుగు వైపులా జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులు నిత్యం రద్దీగా ఉంటాయి. ఆయా రహదారులపై నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందక మృతి చెందుతున్నారు. సకాలంలో వైద్యం అందితే ప్రాణాలు కోల్పోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఆయా రహదారులపై క్షతగాత్రులకు వైద్య చికిత్స కోసం 24 గంటలు వైద్య సేవలందించేందుకు ట్రామా కేర్‌ సెంటర్లు ఏర్పాటుచేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రధాన రహదారులపై ప్రతీ 35 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ట్రామా కేర్‌ సెంటర్లు ఏర్పాటుచేయాలి. కానీ జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటుచేసినా అనేక మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లా కేంద్రాల్లో ట్రామా కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాల బారిన పడిన వారికి సకాలంలో వైద్యం అందే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం

క్షతగాత్రులను సమీపంలోని ప్రాంతీయ ఆస్పత్రులు, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయా సమయాల్లో అన్ని విభాగాలకు సంబంధించిన వైద్యులు, సిబ్బంది అక్కడ అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంతో మెరుగైన వైద్య సేవలందక మృతి చెందుతున్న సంఘటనలు ఎక్కువగా ఉంటున్నాయి.

కేంద్రాలతో ఉపయోగాలు

ట్రామాకేర్‌ సెంటర్లు ఏర్పాటైతే అనేక ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సెంటర్లు కేవలం రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర వైద్య సేవలందించేందుకు మాత్రమే పనిచేస్తాయి. ఇందులో ఆర్థోపెడిక్‌, జనరల్‌ సర్జరీ, న్యూరో సర్జరీ, యూరాలజీ వైద్యులతో పాటు వైద్యసిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు. ప్రమాదాల బారిన పడిన వారిని ఈ సెంటర్లకు తరలించిన వెంటనే చికిత్స అందిస్తారు. దీంతో వారు ప్రాణాలను దక్కించుకునే అవకాశం ఉంటుంది.

గోల్డెన అవర్‌లో చికిత్స అందితే..

రోడ్డు ప్రమాదం తర్వాత మొదటి గంటను గోల్డెన అవర్‌ అంటారు. ఈ సమయంలో క్షతగాత్రులకు సరైన చికిత్స అందితే బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలామందికి గోల్డెన అవర్‌లో చికిత్స అందక మృతి చెందుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, సూర్యాపేట, తిరుమలగిరి, అర్వపల్లి, నల్లగొండ, మిర్యాలగూడెం, దేవరకొండ, మల్లేపల్లి, నార్కట్‌పల్లి, చౌటుప్పల్‌, భువనగిరి ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగి అందులో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలంటే వారి హైదరాబాద్‌కు తరలించాల్సి వస్తోంది. అందుకోసం కనీసం రెండు గంటల సమయం పడుతోంది. అదే ట్రామాకేర్‌ సెంటర్‌ ఉంటే గంటలోపు వైద్యం అందే అవకాశం ఉంటుంది.

ఉమ్మడి జిల్లాలో రెండేళ్లలో 4 వేల ప్రమాదాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి ఏటా వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో వేల మంది మృతి చెందుతుండగా, అంతేస్థాయిలో గాయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రెండేళ్లలో 4 వేలకు పైగా ప్రమాదాలు జరిగాయి. ఇందులో 2 వేల మందికి పైగా మృతి చెందగా 5వేల మందికి పైగా గాయపడ్డారు. గత రెండు నెలల్లో ఉమ్మడి జిల్లాలో 100కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 100 మంది వరకు మృతి చెందారు. రోడ్డు ప్రమాదాలు రహదారులపై గుర్తించిన బ్లాక్‌ స్పాట్‌లలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టినా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు.

క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ త్వరలో ప్రారంభం కానుంది

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో త్వరలో క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ ప్రారంభం కానుంది. అందుకోసం ఇప్పటికే భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులు పూర్తయితే యూనిట్‌ ప్రారంభిస్తాం. ఈ యూనిట్‌లోనే ట్రామా కేర్‌ సేవలు అందిస్తాం. అత్యవసర సమయంలో 24 గంటల పాటు వైద్య సేవలందుతాయి.

- డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌, సూర్యాపేట.

Updated Date - Jul 10 , 2026 | 12:05 AM