Share News

హాస్టల్‌ విద్యార్థులకు సామగ్రి ఏదీ..?

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:12 AM

మోత్కూరు, జూలై 9(ఆంధ్రజ్యోతి): హాస్టళ్లు, పాఠశాలలు తెరిచి 25 రోజులు పూర్తయ్యాయి. అయినా హాస్టల్‌ విద్యార్థులకు ప్రభుత్వం నోట్‌పుస్తకాలు, బెడ్‌షీట్లు, దుప్పట్లు అందించలేదు. బెడ్‌షీట్లు తదితర వాటి మాట ఎలా ఉన్నా నోటుపుస్తకాలు సకాలంలో అందించకపోవడంతో పాఠశాలల్లో బోధిస్తున్న పాఠాలు విని, నోట్స్‌ రాసుకోవడానికి, హోం వర్క్‌ చేయడానికి నోటు పుస్తకాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

 హాస్టల్‌ విద్యార్థులకు సామగ్రి ఏదీ..?

మోత్కూరు, జూలై 9(ఆంధ్రజ్యోతి): హాస్టళ్లు, పాఠశాలలు తెరిచి 25 రోజులు పూర్తయ్యాయి. అయినా హాస్టల్‌ విద్యార్థులకు ప్రభుత్వం నోట్‌పుస్తకాలు, బెడ్‌షీట్లు, దుప్పట్లు అందించలేదు. బెడ్‌షీట్లు తదితర వాటి మాట ఎలా ఉన్నా నోటుపుస్తకాలు సకాలంలో అందించకపోవడంతో పాఠశాలల్లో బోధిస్తున్న పాఠాలు విని, నోట్స్‌ రాసుకోవడానికి, హోం వర్క్‌ చేయడానికి నోటు పుస్తకాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏడాది తమకు నోటు పుస్తకాలు ఆలస్యంగానే ఇస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. గతేడాది జూలై మొదటి వార ంలో ఇచ్చారని ఈ ఏడాది ఇంత వరకు రాలేదని చెబుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నోట్‌బుక్స్‌ సర్దుబాటు

హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల్లో కొందరు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుండగా మరికొందరు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు, నోట్‌ పుస్తకాలు అందించింది. పాఠశాలలు తెరిచిన రోజునే పంపిణీ చేశారు. పాఠశాలలు తెరిచి 25 రోజులు గడుస్తున్నా హాస్టల్‌ విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు అందలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్‌ విద్యార్థులకు కూడా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు హాస్టల్‌కు నోట్‌ పుస్తకాలు వచ్చిన తర్వాత వాపసు ఇచ్చే కండిషన్‌పై సర్దుబాటు చేసి నోట్‌పుస్తకాలు ఇచ్చారు. మిగతా పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో చదివే హాస్టల్‌ విద్యార్థులు సకాలంలో ప్రభుత్వం నుంచి నోట్‌బుక్స్‌ అందక దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం సరఫరా చేసే వరకు ఆగితే ఏరోజుకా రోజు నోట్స్‌ రాసుకోకుండా, హోం వర్క్‌ చేయకుండా ఉంటే నష్టపోతామని దుకాణాల్లో నోట్‌ పుస్తకాలు కొనుగోలు చేసినట్లు పలువురు విద్యార్థులు తెలిపారు. తాము కొనుక్కున్న తర్వాత ప్రభుత్వం నోటు పుస్తకాలు ఇస్తే ఏం లాభమని, వాటిని అమ్ముకుందామన్నా ప్రభుత్వ సరఫరా కాబట్టి ఎవరూ కొనరని, అవి అంతగా ఉపయోగపడకుండా వృ థా అ వుతాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. పాఠశాలలకు సరఫరా చేసినట్టుగానే హాస్టళ్లకు కూడా పాఠశాలలు తెరిచే నాటికే నోటు పుస్తకాలు సరఫరా చేయాలని కోరుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం విద్యార్థుల్లో సుమారు 65 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళుతుండగా, 35 శాతం మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులపై పాఠ్య, నోట్‌ పుస్తకాల కొనుగోలు భారం పడుతున్నది.

Updated Date - Jul 10 , 2026 | 12:12 AM