Share News

యాదగిరిగుట్టపైకి ఉత్తరం వైపు మెట్లేవి?

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:39 AM

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహస్వామి వారికి ఉత్తరం వైపు మెట్లెక్కి మొక్కు చెల్లించుకునేందుకు భక్తులు నానా తంటాలు పడుతున్నారు.

యాదగిరిగుట్టపైకి ఉత్తరం వైపు మెట్లేవి?

పాతమెట్ల నుంచి వెళ్లేందుకు ప్రయాస

(ఆంధ్రజ్యోతి-యాదగిరిగుట్ట)

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహస్వామి వారికి ఉత్తరం వైపు మెట్లెక్కి మొక్కు చెల్లించుకునేందుకు భక్తులు నానా తంటాలు పడుతున్నారు. గుట్టను ఆధ్యాత్మిక నగరికి తీర్చిదిద్దే క్రమంలో ఉత్తర భాగంలో బస్టాండ్‌, కల్యాణకట్ట, అన్నదానసత్రం, ఇతర సౌకర్యాలను కల్పించారు. అయితే మెట్లెక్కి స్వామి వారికి మొక్కు చెల్లించుకోవాలంటే మాత్రం అక్కడి నుంచి ప్రధాన రహదారిపై దక్షిణం వైపు రావాల్సి వస్తోంది. దేశంలోని ఎక్కడి నుంచైనా ఆర్టీసీ, సొంత వాహనాల్లో గుట్టకు చేరుకుంటున్న భక్తులు అటు బస్టాండ్‌లో, పార్కింగ్‌ కోసం గుట్టకు ఉత్తర వైపునకు చేరుకుంటారు. ఇక్కడే తలనీలాలు సమర్పించేందుకు కల్యాణకట్ట, పుణ్యస్నానాలు (కొండపైన విష్ణు పుష్కరిణిలో సౌకర్యం లేదు) చేసేందుకు లక్ష్మీపుష్కరిణి కూడా ఇక్కడే అందుబాటులోకి తెచ్చారు. కాగా, ఆర్టీసీ బస్సులు, ఆటోల ద్వారా కొండపైకి చేరేందుకు మూడో ఘాట్‌ రోడ్డు ఉంది. అయితే ఈ ఉత్తరదిశలో మెట్లమార్గం లేక వచ్చిన దారినే మూట, ముల్లె, పిల్లాపాపలతో దక్షిణ దిక్కుకు చేరుకోలేక(కాలినడకన కొండెక్కేందుకు) భక్తులు తమ మొక్కులను వాయిదా వేసుకుంటున్నారు.

గతంలో...

కొండకు దక్షిణ దిక్కు నుంచి కొత్తగా, ఆగ్నేయం నుంచి పాత(రెండు) మెట్ల మార్గాలు ఉండేవి. ఈ రెండు మెట్ల దారిలో కొండెక్కిన భక్తులు ముందుగా కల్యాణకట్టలో తలనీలాలు సమర్పిం చేవారు. పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మొక్కులు చెల్లించేవారు. అనంతరం ప్రధానాలయం స్వయంభువులు, శివాలయంలో రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని, ఆర్జితపూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించి ప్రసాదాలు కొనుగోలుచేసి తిరుగు వెళ్లే వారు. ఇవన్నీ పూర్తయ్యేసరికి సుమారు రెండు, మూడుగంటల పాటు స్వామివారి దివ్యక్షేత్రంలో కుటుంబసమేతంగా గడిపిన మధురసృతులు భక్తులకు ఉండేవి. ఇప్పుడు పరిస్థితి లేదు.

మూడోఘాట్‌ రోడ్డు ఉన్నా

మూడు ఘాట్‌ రోడ్లు ఉన్నప్పటికీ వాహనాలు కొండపైకి చేరేందుకు (టూ వే) మూడో ఘాట్‌, కిందకు వెళ్లేందుకు మొదటి ఘాట్‌ వినియోగిస్తున్నారు. ఉచిత బస్సుల్లో వెళ్లి వచ్చేందుకు మూడో ఘాట్‌ రోడ్డును వినియోగిస్తున్నారు. ఆటోలు మాత్రం రాకపోకలకు మొదటిఘాట్‌ రోడ్డులో అనుమతిస్తున్నారు. కానీ, ఉత్తర దిక్కు నుంచి మెట్లమార్గం లేక కొండెక్కే మొక్కు చెల్లించలేక భక్తులకు నిరాశే ఎదురవుతోంది. మూడోఘాట్‌ రోడ్డు కింద నుంచి కొండపైకి మెట్లు నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.

ఉత్తరం నుంచి మెట్లు నిర్మించాలి

మెట్లమొక్కు తీర్చుకునేందుకు ఉత్తరం దిక్కులో అవకాశం కల్పించాలి. మెట్ల దారి ఏర్పాటు చేయాలి. అద్దె గదుల సదుపాయం లేక ఉత్తర దిక్కులోని కొత్త బస్టాండులో దిగిన భక్తులు వ్యయప్రయాసాలతో దక్షిణం దిక్కుకు చేరుకోలేకపోతున్నారు. మూడో ఘాట్‌ రోడ్డు కింద నుంచి కొండపైన ప్రధానాలయం వరకు మెట్లను నిర్మించాలి.

ఆకుల చంద్రమౌళీ, స్థానిక భక్తుడు

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

భక్తులు దక్షిణ దిక్కు నుంచే కొండెక్కి మొక్కు తీర్చుకోవాలి. కానీ, ఉత్తరంలో బస్సు దిగిన భక్తులు ఆధ్యాత్మిక వాడ నుంచి దక్షిణం తిరిగి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నది వాస్తవం. దారులు పెరిగితే భద్రత సౌకర్యం కూడా పెంచాల్సి వస్తుంది. భక్తుల ఇబ్బందుల దృష్ట్యా ఈ ప్రతిపాదనను ఈవోతో కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం.

భాస్కరాయణీ నరసింహమూర్తి, అనువంశిక ధర్మకర్త, యాదగిరిగుట్ట దేవస్థానం

మెట్ల మార్గం కోసం పరిశీలించాలి

కాలినడక భక్తులకు అనుగుణంగా మెట్లమార్గం కోసం పరిశీలించాలి. ఉత్తర దిక్కు నుంచి వాస్తుపరంగా కూడా బేషుగ్గా ఉంటుంది. భక్తుల కాలినడక మొక్కులు తీర్చుకోవచ్చు. తిరుపతి మాదిరిగా అవసరం మేరకు దారులు అందుబాటులోకి తేవాలి.

కాండూరి వెంకటాచార్యులు, ప్రధాన పూజారి

Updated Date - Mar 18 , 2026 | 12:39 AM