Share News

‘ఉపాధి’ కల్పించేదెప్పుడో?

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:18 AM

ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నిర్లక్ష్యం, కొరత కారణంగా ఉమ్మడి మండలంలోని చిలకమర్రి, ఘనిపల్లి, భీమనపల్లి, రాంపురం, దుగ్యాల, తిరుమలగిరి గ్రామాల్లో ఉపాది హామీ పనులు సకాలంలో ప్రారంభం కావడం లేదు.

 ‘ఉపాధి’ కల్పించేదెప్పుడో?

(ఆంధ్రజ్యోతి- పెద్దఅడిశర్లపల్లి,): ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నిర్లక్ష్యం, కొరత కారణంగా ఉమ్మడి మండలంలోని చిలకమర్రి, ఘనిపల్లి, భీమనపల్లి, రాంపురం, దుగ్యాల, తిరుమలగిరి గ్రామాల్లో ఉపాది హామీ పనులు సకాలంలో ప్రారంభం కావడం లేదు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు మొబైల్‌ యాప్‌లో ఆన్‌లైన్‌ హాజరు నమోదు చేయకపోవడం పనుల గుర్తింపులో జాప్యంతో కూలీలకు 100 రోజుల పని కల్పించడంలో విఫలమవుతున్నారు. దీనివల్ల కూలీలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి మండలంలో జనవరి నుంచి ఉపాధిహామీ పనులు ప్రారంభమైన ఈ గ్రామాల్లో పనులు ప్రారంభం కాకపోవడంతో ఉపాధి హామీ కూలీలు అధికారులతో మొర పెట్టుకున్నారు.

సిబ్బంది కరువు, ఉన్న వారికి అందని వేతనాలు

గుడిపల్లి ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌, తగినంత టెక్నికల్‌ అసిస్టెంట్లు లేకపోవడంతో ఫీల్డ్‌ అసిస్టెంట్లు పనులు ప్రారంభించలేకపోతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాక నాలుగు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే తక్కువ వేతనమే నెలలుగా ఇవ్వకపోవడంతో కుటుంబం గడవడమే కష్టంగా మారింది. వేతనాలు విడుదల చేసి తమను ఆదుకో వాలని ఎఫ్‌ఏలు కోరుతున్నారు.

రెండు నెలలుగా పనులు కరువు

ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి రెండు నెలలు వృథా పోగా ఒకవేళ ప్రారంభించిన మార్చిలో మిగిలిన 24 రోజులు మాత్రమే ఉపాధి కూలీలకు పనులు దొరుకుతాయి. దీంతో కూలీలు 60 రోజుల పనులకు 24 రోజులు మాత్రమే పని చేసి నష్టపోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. గుడిపల్లి మండలం ఏర్పడినప్పటికి పూర్తిస్థాయి లో ఉపాధి హామీ సిబ్బంది లేక జాబ్‌కార్డులు అప్‌డేట్‌ కాకపోవడం, కొత్త పనులు గుర్తించకపోవడం సమస్యగా మారిందంటున్నారు. గుడిపల్లి మండలంలో 12 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం 760 మంది కూలీలు పనిచేస్తున్నారు. గతేడాది ఇదే మాసంలో 1,670 మంది కూలీలు పని చేశారు. కూలీలకు పని కల్పించాలన్నా ఎస్టిమేషన్‌ వేయాలంటే తప్పనిసరిగా కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉండాలి. కిందిస్థాయి సిబ్బంది మండల, క్లస్టర్‌, జిల్లా అఽధికారులకు చెప్పినా పట్టించుకునే నాథుడే లేడు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో కూలీలు అధికంగా నష్టపోయే అవకాశం ఉంది. అధికారులు స్పందించి మండల స్థాయిలో సిబ్బందిని నియమించి పనులు కల్పించాలని కోరుతున్నారు.

అధికారుల పర్యవేక్షణ ఏదీ

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి పని ప్రాంతంలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు టెంట్లు, తాగేందు కు నీటి వసతి, గాయాలైతే ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు ఇవేవి అందుబాటులో లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.

ఎర్రటి ఎండలో పనిచేసిన కూలీలు కొద్ది సమయం అయినా సేదా తీరడానికి టెంట్లు వేయాల్సి ఉంది. కానీ ఎక్కడ టెంట్లు వేయకపోవడంతో కూలీలకు పని ప్రదేశంలో నీడ కరువవుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కూలీలకు పనులు కల్పించడంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కూలీలకు విధిగా వసతులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినా మండలస్థాయిలో అధికారులు లెక్క చేయడం తేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

Updated Date - Mar 06 , 2026 | 12:18 AM