Share News

ఏకేబీఆర్‌కు మరమ్మతులు ఎప్పుడో?

ABN , Publish Date - Jul 10 , 2026 | 12:19 AM

జిల్లాలో 2.20లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌ జంటనగరాలతోపాటు జిల్లాలోని 516 గ్రామాలకు తాగునీరు అందించే ఏఎమ్మార్పీ ప్రాజెక్టులో భాగమైన అక్కంపల్లి జలాశయానికి లీకుల సమస్య వెంటాడుతోంది. తరచూ రిజర్వాయర్‌ నుంచి నీరు లీకవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపడతామని అధికారులు చెబుతున్నా అమలుకు నోచుకోవడంలేదు.

ఏకేబీఆర్‌కు మరమ్మతులు ఎప్పుడో?
అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌

నిధుల కేటాయింపు, పనుల్లో జాప్యం

దేవరకొండ, జూలై 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2.20లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌ జంటనగరాలతోపాటు జిల్లాలోని 516 గ్రామాలకు తాగునీరు అందించే ఏఎమ్మార్పీ ప్రాజెక్టులో భాగమైన అక్కంపల్లి జలాశయానికి లీకుల సమస్య వెంటాడుతోంది. తరచూ రిజర్వాయర్‌ నుంచి నీరు లీకవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపడతామని అధికారులు చెబుతున్నా అమలుకు నోచుకోవడంలేదు. గత ఏడాది డిసెంబరులో ఏకేబీఆర్‌ కట్ట 239అడుగుల ఎఫ్‌ఆర్‌ఎల్‌ వద్ద లీకైంది. దీంతో భారీగా నీరు రావడంతో ఆయకట్టు రైతు లు ఆందోళన చెందారు. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అయితే నిధులు కేటాయించి పూర్తిస్థాయి మరమ్మతులు చేస్తామని ప్రకటించినా అమలవ్వలేదు.

ప్రస్తుతం ఏకేబీఆర్‌లో 244.15 అడుగుల నీరు ఉంది. ఫుల్‌ రిజర్వాయర్‌ లెవల్‌ 245 అడుగులు. 2001 ఏఎమ్మార్పీ ప్రాజెక్టు ప్రారంభం నుంచి సిస్టర్న్‌తోపాటు ఏకేబీఆర్‌ రిజర్వాయర్‌ పలు చోట్ల లీకవుతూనే ఉంది. అధికారులు తాత్కాలిక మరమ్మతులతో చేతులు దులుపుకుంటున్నారే తప్ప పూర్తిస్థాయి పను లు చేపట్టడంలేదు.

ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ 136కిలోమీటర్ల మేర ఉదయసముద్రం వరకు విస్తరించి ఉంది. దేవరకొండ, నాగార్జునసాగర్‌, నల్లగొండ, నకిరేకల్‌ నియోజకవర్గాలకు సాగు, తాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారానే సరఫరా చేస్తున్నారు. అయితే కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు శిథిలావస్థకు చేరాయి. కంపచెట్లు ఏపుగా పెరిగాయి. ఇటీవల ప్రధాన కాల్వ లైనింగ్‌ పనులకు ప్రభుత్వం రూ.334కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం గుర్రంపోడు, కనగల్‌ మండలాల పరిధిలోని పనులు సాగుతున్నాయి. పీఏపల్లి మండల పరిధిలో పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఏఎమ్మార్పీ, అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, సిస్టర్న్‌(రక్షణగోడ) మరమ్మతులకు రూ.34కోట్లు కేటాయించారు. ఈ పనులు ప్రారంభంకాలేదు. ఏఎమ్మార్పీకి నాగార్జునసాగర్‌ నుంచి తాగునీటి అవసరాలకే నీటిని విడుదల చేస్తున్నారు. ఏకేబీఆర్‌ సిస్టర్న్‌ లీకేజీ పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

త్వరలో మరమ్మత్తు పనులు చేపడుతాం : నాగయ్య, ఏఎమ్మార్పీ డీఈ

ఏఎమ్మార్పీ ఏకేబీఆర్‌ కట్ట మరమ్మతులకు రూ.34కోట్లు కేటాయించారు. ఈ నిధులతో సిస్టర్న్‌తోపాటు ఏకేబీఆర్‌ మరమ్మతు పనులు చేపడతాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభం అవుతాయి. ప్రస్తుతం లీకేజీ సమస్య లేదు.

Updated Date - Jul 10 , 2026 | 12:19 AM