Share News

యువ వికాసమేదీ?

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:30 AM

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంగా ప్రభుత్వం రాయితీతో ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించిన రాజీవ్‌ యువ వికాస పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది.

యువ వికాసమేదీ?

ప్రారంభానికి నోచుకోని రాజీవ్‌ యువ వికాస పథకం

గత ఏడాది రాష్ట్ర అవతరణ రోజున ప్రారంభిస్తామని ప్రకటన

జిల్లాలో సాయం కోసం 9,538మంది దరఖాస్తు

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి

పథకం ప్రారంభం కాకపోవడంతో నిరుద్యుగుల ఎదురుచూపు

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంగా ప్రభుత్వం రాయితీతో ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించిన రాజీవ్‌ యువ వికాస పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. నైపుణ్యం ఉన్న యువతీ, యువకులు ఆయా రంగాల్లో ఉపాధి పొందేందుకు గరిష్ఠంగా రూ.4లక్షల వరకు ఆర్థిక సాయం అందించేందుకు రూపొందించిన ఈ పథకం ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ఎంపిక ప్రక్రియ పూర్తయి, ఆర్థిక సాయం అందించే దశలో అవాంతరాలతో కాగితాలకే పరిమితమైంది.

రాజీవ్‌ యువ వికాస పథకం ద్వారా ప్రభుత్వం అందించే సాయంతో ఉపాధి లభిస్తుందని కొండత ఆశలు పెట్టుకున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువత ఎనిమిది మాసాలుగా ఎదురుచూస్తోం ది. ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకున్న యువ త కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా, ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయం ప్రకారం అమలవుతుందని, ప్రస్తుతానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని చెబుతూ తిప్పి పంపిస్తున్నారు. ప్రభు త్వం మాత్రం ఈ పథకం గురించి కనీసం ఊసేత్తకపోవడంతో యువత నిరాశకు గురవుతోంది.

జిల్లాకు రూ.166.55కోట్లు, 10,582 యూనిట్లు

రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు పెద్ద మొత్తంలో స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంగా ఆర్భా టం ప్రకటించిన ఈ పథకానికి జిల్లాలో రూ.166.55 కోట్లు బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించింది. జిల్లా వ్యాప్తంగా వివిధ యూనిట్లకు 39,101 దరఖాస్తులు రాగా, బడ్జెట్‌ అంచనాల ప్రకారం 10,582 మంది అర్హులుగా గుర్తించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేశారు. ఈ పథకానికి షెడ్యూల్డ్‌ కులాల నుంచి 3,644, షెడ్యూల్డ్‌ తెగలు 1,250, వెనుకబడిన తరగతు లు 4,295, ఈబీసీలు 1,044, ముస్లిం మైనార్టీలు 269, క్రిస్టియన్‌ మైనార్టీలు 80మంది చొప్పున ఎంపిక చేశారు. అదే విధంగా యూని ట్ల వారీగా రూ.0-50వేలలోపు 3,540... యూనిట్లు, రూ.50వేల నుంచి రూ.లక్షలోపు 2,585, రూ.లక్ష నుంచి రూ.2లక్షల లోపు 2,260, రూ.2లక్షల నుంచి రూ.3లక్షలలోపు 1,290, రూ.3లక్షల నుంచి రూ.4లక్షల లోపు 496, రూ.4లక్షలకుపైబడి 411 యూనిట్లను ఎంపిక చేశారు. ఈ యూనిట్లను లబ్ధిదారులకు అందజేసేందుకు జిల్లా వ్యాప్తంగా రూ.166.55కోట్ల బడ్జెట్‌ అంచనాలను సైతం అధికారులు రూపొందించారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి లక్ష్యంగా

రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజీవ్‌ యువ వికాస పథకాన్ని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువతకు ప్రభుత్వపరంగా రాయితీలతో బ్యాంకు రుణాలు అందించి సేవ, ఉత్ప త్తి రంగాల్లో స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు. దీనికింద కనిష్ఠంగా రూ.50వేల నుంచి గరిష్ఠంగా రూ.4లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. బ్యాంకు రుణాలతో పాటు ప్రభుత్వ రాయితీలను కలిపి ఇచ్చేందుకు జిల్లాల వారీగా వివిధ శాఖలు బడ్జెట్‌ను సైతం ప్రతిపాదించాయి. రూ.50వేల ఆర్థిక సాయం అందించేందుకు నూటికి నూరు శాతం రాయితీ, రూ.1లక్ష వరకు 90శాతం రాయితీ, రూ.2లక్షల ఆర్థిక సాయం అవసరమయ్యే యూనిట్లకు 80శాతం రాయితీని ప్రకటించా రు. ఈ పథకాన్ని ఆర్భాటంగా 2025 జూన్‌ 2 రాష్ట్ర ఆవిర్భావం రోజున ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈమేరకు నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు కోరగా, యువత వారి ఆసక్తి, నైపుణ్యం ప్రకారం స్వయం ఉపాధి కోసం కిరాణ దుకాణాలు, జిరాక్స్‌ సెంటర్లు, ఫొటో స్టూడియోలు, ఆటో రిక్షాలు, మోటార్‌ వైండింగ్‌, మెకానిక్‌ షెడ్లు వంటి స్వయం ఉపాధి యూనిట్లకు దరఖాస్తులు చేసుకున్నారు.

ఎంపికతోనే సరిపుచ్చారు

నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తించిన రాజీవ్‌ యువ వికాసం పథకానికి ఆఘమేఘాల మీద దరఖాస్తులను ఆహ్వానించి, ఎమ్మెల్యేల ద్వారా జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు జాబితాలను నివేదించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. అయితే 2025 జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున అట్టహాసంగా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ముమ్మర కసరత్తు చేశారు. ఈ మేరకు నిధుల సర్దుబాటు జరుగుతున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే అర్ధాంతరంగా ఈ పథకం ప్రారంభానికి నోచుకోలేదు. ఆ తర్వాత ఎనిమిది మాసాలు గడుస్తున్నా, ప్రభుత్వం నుంచి ఈ పథకంపై ఎలాంటి ప్రకటన లేదు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మాత్రం కేవలం కాగితాలకే పరిమితం కాగా, పథకానికి దరఖాస్తులు చేసుకున్న అర్హులైన యువతీ, యువకులు మాత్రం ఆయా శాఖల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తాము ఎంపిక ప్రక్రియను పూర్తి చేశామని, ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుని నిధులు కేటాయిస్తేనే పథకం భవితవ్యం ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు.

ప్రభుత్వం ఆదేశాల మేరకే గ్రౌండింగ్‌: జనుకుల శ్యాంసుందర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ

రాజీవ్‌ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సిద్ధం చేశాం. అయితే ప్రభుత్వ తదుపరి ఆదేశాల మేరకే ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు యూనిట్ల గ్రౌండింగ్‌ ఆధారపడి ఉంటుంది. అదే విషయాన్నే దరఖాస్తుదారులకు తెలియజేస్తున్నాం.

యూనిట్లు ఇలా..

రూ.0-రూ.50వేలు 3,540

రూ.50వేలు రూ.లక్ష 2,585

రూ.లక్ష-రూ.2లక్షలు 2,260

రూ.2లక్షలు-రూ.3లక్షలు 1,290

రూ.3లక్షలు-రూ.4లక్షలు 496

రూ.4లక్షలకు పైగా 411

మొత్తం యూనిట్లు 10,582

జిల్లాలో రాజీవ్‌ వికాసం ఇలా..

కేటగిరి దరఖాస్తులు యూనిట్లు

ఎస్సీ 10,254 3,644

ఎస్టీ 2,536 1,250

బీసీ 23,664 4,295

ఈబీసీ 857 1,044

మైనార్టీ 1790 349

మొత్తం 39,101 10,582

Updated Date - Feb 28 , 2026 | 12:30 AM