చివరికి నీరేదీ?
ABN , Publish Date - Mar 05 , 2026 | 12:35 AM
ఎస్సారెస్పీ ఆయకట్టు చివరి భూములకు నీరందక రైతులు లబోదిబోమంటున్నారు. రెండేళ్లుగా మునుపెన్నడూ లేనివిధంగా వర్షపాతం నమోదైనా పంటల సాగుకు నీరందడం లేదు.
ఎస్సారెస్పీ కింద ఎండుతున్న పంటలు
వారబందీ పద్ధతిలో నీటి విడుదల
ఆత్మకూరు(ఎస్), మోతె, పెనపహాడ్ మండలాల్లో చివరి భూములకు అందని నీరు
ఎండుతున్న పంటలు జీవాల మేతకు
ఎస్సారెస్పీ ఆయకట్టు చివరి భూములకు నీరందక రైతులు లబోదిబోమంటున్నారు. రెండేళ్లుగా మునుపెన్నడూ లేనివిధంగా వర్షపాతం నమోదైనా పంటల సాగుకు నీరందడం లేదు. పిచ్చిచెట్లతో కాల్వలు, మోటార్లు వేసి ఎగువన రైతులు చివరి వరకూ నీరందకుండా చేస్తున్నారు. దీంతో చేతికొచ్చే దశలో పంటలను పశువులకు మేతగా వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది. ఆత్మకూరు(ఎస్), మోతె, పెనపహాడ్ మండలాల్లో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
(ఆంధ్రజ్యోతి-ఆత్మకూరు(ఎస్)
జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో ఎస్సారెస్పీ రెండోదశ కింద ఆయకట్టు ఉంది. యాసంగి సీజనకు ప్రస్తుతం వారబంధీ పద్ధతిలో సాగునీటిని విడుదల చేస్తున్నారు. అయితే చివరి భూముల వరకు నీరు చేరడం లేదు. ఆత్మకూరు(ఎస్) మండలంలో డీపీఎం-71 ప్రధాన కాల్వల నుంచి ఎల్-36తో పాటు ఎల్-35 మరికొన్ని మైనర్ కాల్వల ద్వారా 28 గ్రామాలకు సాగునీరు అందాల్సి ఉంది. అదేవిధంగా ఈ కాల్వకు అనుసంధానంగా మోతె మండలంలోని ఎల్-22 కాల్వ కలిపి ఆత్మకూరు(ఎస్), మోతె మండలాల్లో సుమారు 29 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. గత ప్రభుత్వహయాంలో అన్నికాల్వల్లోకి నీరు వదలడంతో పాటు చెరువులు నింపారు. దీంతో భూగర్భజలాలు పెరిగాయి.
రెండేళ్లుగా అందని నీరు
ఎస్సారెస్పీ కింద యాసంగి సీజనలో ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే మునుపెన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైనప్పటికీ ఆరుతడి పంటలే వేసుకోవాలన్న పాతధోరణిలోనే అధికారులు ఉన్నారని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారబంధీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో చివరి భూములకు చేరుకునేలోపు నీటి ప్రవాహం తగ్గిపోతోంది. మోతె, ఆత్మకూరు(ఎస్) మండలాల్లో ప్రస్తుత సీజనలో 29 వేల ఎకరాలకు గాను 50 శాతం కూడా సాగు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు (ఎస్) మండలంలోని పాతర్లపహాడ్, ఇస్తాళాపురం, ముక్కుడుదేవులపల్లి, రామన్నగూడెం, బొప్పారం, మిడ్తనపల్లి, కొత్తగూడెం, శెట్టిగూడెం గ్రామాలకు కాల్వలు ఉన్నా సక్రమంగా నీరందక రెండేళ్లుగా చేతికి వచ్చే సమయంలో పంటలు ఎండిపోతున్నాయి. ప్రస్తుతం కూడా నీరంక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళనతో ఉన్నారు.
అధ్వానంగా కాల్వలు
ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని కాల్వలు అధ్వాన స్థితికి చేరాయి. పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి నీటి ప్రవాహనానికి అడ్డంకిగా మారాయి. ఆత్మకూరు(ఎస్) మండలంలోని ఏపూరు, రామన్నగూడెం, ఇస్తాళాపురం, కాసర్లపాడ్, బొప్పారం, ముక్కుడుదేవులపల్లి, కాశిగూడెంతండాలో కాల్వలు ఉన్నా నీరందడం లేదు. అంతేకాకుండా పిచ్చిమొక్కలు పెరిగి కాల్వలు రూపురేఖలు లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే ఎల్-22 కాల్వ పరిధిలో కందగట్ల, గట్టికల్, పాతసూర్యాపేట, కోటినాయక్‌తండా, నర్సంపేట, శెట్టిగూడెం, కోటపహాడ్ గ్రామాలకు కొద్దిపాటి నీరు అందుతోంది. ఈ నెల చివరి నాటికి నీరందే అవకాశం లేదని
పెనపహాడ్ మండలంలోనూ..
పెనపహాడ్ : మండలంలో ఎస్సారెస్పీ కాల్వలు 20 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. వీటి పరిధిలోని 15 గ్రామాల్లో 12 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే యాసంగి సీజనలో కాల్వలకు నీటి విడుదల చేస్తారన్న ధీమాతో ఉన్న రైతులు పంటలు సాగు చేశారు. అయితే వారబంధీ పద్ధతిలో నీటి విడుదల కొనసాగుతుండటంతో చివరి వరకు నీరందడం లేదు. ధర్మాపురం, భక్తళాపురం, ఈదులవాగుతండా, మొర్రకుంటతండా, జీకేతండా, గాజులమల్కాపురం వరకు కొద్దిపాటి నీరు కాల్వలకు వస్తోంది. నూర్జాహానపేట, చిన్నగారకుంటతండా, పెద్దగారకుంటతండా, చిన్నసీతారాంతండా, సీతమ్మతండా, ఎల్లప్పకుంటతండా, చెట్లముకుందాపురం గ్రామాలకు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. సుమారు 200 ఎకరాల వరకు పంటలు ఎండిపోతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ఎండిన పొలాలను పశువులు, గొర్రెలతో మేపుతున్నామని రైతులు తెలిపారు.
గ్రామరైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండేళ్లుగా గోదావరి నీళ్లు రావడం లేదు
రెండేళ్లుగా ఏపూర్ గ్రామంలో వరి సాగు చేస్తున్నా. ఎస్సారెస్పీ కాల్వలకు గోదావరి జలాలు పూర్తిస్థాయిలో అందడంలేదు. వారబంధీ ప్రకారం నీళ్లు విడుదల చేస్తున్నా అన్ని కాల్వలకు చేరడం లేదు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. పంట చేతికి వచ్చే సమయానికి నీరందక ఎండుతుండటంతో పశువులకు మేపాల్సి పరిస్థితి ఏర్పడింది. పాలేరు రిజర్వాయర్ నుంచి నీళ్లు అందించాలి.
సానబోయిన ఉపేందర్, ఏపూర్, ఆత్మకూరు(ఎస్) మండలం
ఆరుతడి పంటలు సాగుచేయాలి
ఆరుతడి పంటలే వేసుకోవాలని సూచించాం. వరి సాగు చేసి నీరు అందించాలంటే కుదరదు. ఎగువన రైతులు కాల్వలకు మోటార్లు పెట్టుకుని పారిస్తున్నారు. దీంతో కింది వరకు నీరు చేరడం లేదు. ఎన్ని పర్యాయాలు హెచ్చరించినా రైతులు పట్టించుకోవడం లేదు.
లింగయ్య, నీటిపారుదల శాఖ ఈఈ