Share News

రైతు భరోసా ఏమాయే..!

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:51 AM

‘‘ఈ రైతు పేరు మేకల రవీందర్‌ రెడ్డి. మునుగో డు మండలం ఎలగలగూడెం గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి కుటుంబానికి 10 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో వరితోపాటు కూరగాయలు సాగు చేస్తున్నాడు.

రైతు భరోసా ఏమాయే..!

యాసంగి సీజన్‌ ముగుస్తున్నా రాని పెట్టుబడి సాయం

తీవ్ర ఆర్థిక ఇబ్బందులుఎదుర్కొంటున్న రైతన్నలు

ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తున్న రైతులు

‘‘ఈ రైతు పేరు మేకల రవీందర్‌ రెడ్డి. మునుగో డు మండలం ఎలగలగూడెం గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి కుటుంబానికి 10 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో వరితోపాటు కూరగాయలు సాగు చేస్తున్నాడు. యాసం గి రైతు భరోసా సాయం సకాలంలో వస్తుందని భావించాడు. సీజన్‌ ప్రారంభమై మూడు నెలలు కావొస్తున్నా, ప్రభు త్వం నుంచి పెట్టుబడి సాయం రాకపోవడంతో రైతు రవీందర్‌ రెడ్డి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. పెట్టుబడులకోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి సాయం వస్తే వ్యవసాయ పనులకు ఉపయోగపడుతాయ ని సదరు రైతు పేర్కొంటున్నాడు. ఇప్పటికైనా ప్రభు త్వం పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని ఎలగలగూడెం గ్రామానికి చెందిన రైతు రవీందర్‌ రెడ్డి కోరుతున్నారు’’.

నల్లగొండ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా జాప్యంపై రైతుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం యాసంగి సీజన్‌ ప్రారంభమై మూడు నెలలు దాటి ముగింపు దశకు చేరుకున్నా పెట్టుబడి సాయాన్ని మంజూరు చేయడంలో నిర్లక్ష్యం చేయడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునిసిపల్‌ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించింది. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. రైతుల ఆశలు మరోసారి నీరుగారే విధంగా ప్రభుత్వం రైతుభరోసాపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాసంగిలో రైతులు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చుకొని వ్యవసాయానికి పెట్టుబడి పెట్టారు. గత నెల 16న ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం 17వ తేదీన రైతులు ఆశతో ఎదురు చూశారు. అయితే ఆ రోజు రైతు భరోసా జమకాలేదు. అదేనెల 23వ తేదీన జరిగిన రాష్ట్ర కేబినెట్‌లో కూడా రైతులకు సంబంధించిన ఎలాంటి చర్చ రాకపోవడం, రైతు భరోసా ఊసెత్తకంపోవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా నిరాశ నిస్పృహాలతో కొట్టుమిట్టాడుతున్నారు. యాసంగిలో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా వరి సాగుచేశారు. అయితే వరి పంటకు అత్యధికంగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21.50లక్షల ఎకరాలకుపైగా సాగు భూమి ఉంది. అయితే యాసంగిలో మెట్టపంటలు తక్కువగా వేసినప్పటికీ, అత్యధికంగా వరి సాగు చేశారు. యాసంగిలో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా సాగైనందున పంటలు వేసిన, పూర్తిస్థాయిలో వేయకున్నా రైతు భరోసా అందుతుందని రైతులు భావించినా ప్రభుత్వం నుంచి స్పందనరాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరిషత్‌ ఎన్నికల జాప్యమే కారణమా?

రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికలు ఆలస్యం కావడం మూలంగానే ప్రభుత్వం రైతు భరోసా నిలిపి వేసిందన్న చర్చ సాగుతోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు, రైతుభరోసాకు ముడిపెట్టడంతో పల్లె ప్రాంతాల్లో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10.50లక్షల మంది రైతులు ఉండగా 21.50లక్షల ఎకరాలు సాగులో ఉంది. ఎకరానికి రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయం రావాల్సి ఉండగా, ప్రభుత్వం యాసంగి సీజన్‌లో రైతుభరోసాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులకు కష్టాలు తప్పడంలేదు. మరికొన్ని రోజుల్లో వరి కోతలు మొదలయ్యే సమయం వస్తున్నా, రైతు భరోసా గురించి ప్రభుత్వం నుంచి స్పష్టత రావడంలేదు. దీంతో యాసంగిలో వరి సేద్యం చేసిన రైతులు కూలీలకు, విత్తనాలు, ఎరువులకు, సేద్యం చేయడానికి పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. పెట్టుబడులకు అందిన దగ్గర అప్పులు చేసి రైతులు వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇచ్చిన వెంటనే అప్పులు తీసుకోవడం లేదంటే ఇతర వ్యవసాయ అవసరాలకు పెట్టాలని భావిస్తున్నారు. అయితే దానిపై మాత్రం ప్రభుత్వం ఒక అడుగు కూడా ముందుకు వేయడం లేదని రైతులు వాపోతున్నారు.

ఈ నెల 4న కలెక్టర్ల సమావేశంలో చర్చకు వచ్చేనా?

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 4వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిపై చర్చలో భాగంగా రైతు భరోసాపై చర్చిస్తారా? లేదా? అనే దానిపై ఎదురుచూడాల్సిందే. రైతుల కష్టాలు ప్రభుత్వానికి తెలిసిన నేపథ్యంలో జిల్లా అధికారులు సైతం రైతు భరోసా అంశాన్ని ప్రభుత్వం దృష్టికి, సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని రైతులు కోరుతున్నారు. గత వానాకాలంలో సైతం ఆశించిన దిగుబడిరాక రైతులు అనేక నష్టాలు చవి చూశారు. కనీసం యాసంగిలో రైతు భరోసా దక్కి ఉంటే తాము కనీసం అప్పుల నుంచి బయటపడుతామని రైతులు ఆశిస్తున్నారు. గత బీఆర్‌ఎస్‌ హయాంలో ఎకరానికి రూ.5వేలు ఉండగా, కాంగ్రెస్‌ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో రూ.7500 ఎకరానికి ఇస్తామని ప్రకటించడంతోపాటు ప్రచారం కూడా చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో పూర్తిస్థాయిలో రైతులందరికీ భూమి ఎంత ఉన్నా సరే రైతుభరోసా జమ చేసింది. ఆ తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు రైతుల ఆశలు వమ్ము చేసే విధంగా ఉన్నాయని ఉమ్మడి జిల్లా రైతులు, ఆయా రైతు సంఘం నాయకులు పెర్కొంటున్నారు. ఈ నెల 4న జరిగే కలెక్టర్ల సమావేశంలోనైనా రైతుభరోసాపై నిర్ణయం వస్తుందని రైతులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రైతు భరోసా వెంటనే ఇవ్వాలి: చీకూరి రాజు, బోయగుబ్బ, చిట్యాల

రైతు భరోసా వెంటనే జమ చేయాలి. పెట్టుబడి సకాలంలో రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలి. పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. రైతులకు సంబంధించి సకాలంలో పెట్టుబడి జమ చేస్తే వ్యవసాయరంగానికి పెట్టుబడి ఎంతగానో ఉపయోగం ఉంటుంది. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. తక్షణమే పెట్టుబడి అందించి రైతులకు మేలు చేయాలి.

పెట్టుబడులు లేక ఇబ్బందులు: కుమ్మరి యాకుబ్‌, మామిడాల, తిప్పర్తి

యాసంగి సీజన్‌లో పెట్టుబడులు లేక సమస్యలు ఎదురవుతున్నాయి. నాకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఉన్న భూమిలో పంటలు పండించుకోవడానికి పెట్టుబడుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. సీజన్‌ ప్రారంభమైన వెంటనే పెట్టుబడి సాయం వస్తుందని భావించినా ప్రభుత్వం మాత్రం సీజన్‌ ముగిసే సమయానికి పెట్టుబడి జమ చేయకపోవడం బాధాకరం. ప్రతీ సీజన్‌లోనూ పెట్టుబడులు సకాలంలో వేసి రైతులను ఆదుకోవాలి.

Updated Date - Mar 02 , 2026 | 12:51 AM