ఉపాధి కూలి ఏదీ?
ABN , Publish Date - Apr 20 , 2026 | 11:43 PM
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీ) కూలీలకు రెండున్నర నెలలుగా కూలి డబ్బుల చెల్లింపులు నిలిచిపోయాయి.
కూలీలకు రెండున్నర నెలలుగా నిలిచిన చెల్లింపులు
4.52 లక్షల పనిదినాలు.. రూ.13.88 కోట్ల బకాయి
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీ) కూలీలకు రెండున్నర నెలలుగా కూలి డబ్బుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఎండాకాలంలో పనులులేక ఇతర ప్రాంతాలకు వలసలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎంజీఎన్‌ఆర్‌ఈజీ చేపట్టిన లక్ష్యం నెరవేరడంలేదు. గతంలో కనీసం 15 రోజులకు ఒకసారి ఖాతాలో జమయ్యే కూలి డబ్బులు జమకాకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స కూలీలకు ఫిబ్రవరి 6వ వరకు డబ్బులు చెల్లించారు. కానీ ఆ తర్వాత ఇప్పటివరకు వారి డబ్బుల జాడలేదు. వేసవి కాలంలో అసలే వ్యవసాయ పనులు లేని తరుణంలో ఉపాధి కూలీల జీవనానికి ఈ పథకం అండగా నిలిచేది. నిరుపేదలు ఎండలో చెమటోడ్చి చేసిన కూలీకి డబ్బులు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి, పూటగడుపుకునే పరిస్థితులు నెలకొన్నాయని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనుల పరిశీలనకు వెళ్లిన అధికారులను తమ కూలి డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారని అడిగితే అధికారుల వద్ద కూడా స్పష్టమైన సమాచారం లేకుండా పోయింది.
రూ.13.88 కోట్ల కూలి బకాయి
జిల్లాలోని 17 మండలాల్లో 1,43,080 కుటుంబాలకు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎ్‌స పథకంలో జాబ్ కార్డులు ఉన్నాయి. వీటిలో 2,61,897 మంది కూలీలు నమోదై ఉన్నారు. ఈ జాబ్ కార్డుల్లో క్రియాశీలకమైనవి కేవలం 84,115 కాగా, వీటిలో 1,17,775 మంది మాత్రమే క్రియాశీలక కూలీలు ఉన్నారు. ఈ పథకంలో పారదర్శక కార్యకలాపాలకోసం చేపట్టిన ఈకేవైసీని పూర్తి చేసిన కార్మికులు 1,11,913 మంది ఉన్నారు. జిల్లాలో ఈకేవైసీని 95.02 శాతం పూర్తి చేశారు. ఈ ప్రకారం పారదర్శకంగా అర్హతలు గల క్రియాశీలక కూలీలు 1.14లక్షల మందికి ఫిబ్రవరి6వ తేదీ వరకే తాము చేసిన కష్టానికి ప్రతిఫలం వారి ఖాతాల్లో జమ అయింది. ఫిబ్రవరి 7వ నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు కూలీ డబ్బులు చెల్లించలేదు. జిల్లావ్యాప్తంగా ఉపాధి కూలీలు చేసిన 4.52 లక్షల పనిదినాలకు దాదాపు రూ.13.88 కోట్ల కూలీ డబ్బులు రావాల్సి ఉంది. దాదాపు 71 రోజులపాటు చేసిన 4.52 లక్షల పనిదినాలకు సంబంధించిన కూలి డబ్బులు నిలిచిపోయాయి. సగటున ఉపాధి కూలీకి పని దినానికి రూ.307 చెల్లిస్తారు. ఈ లెక్కన జిల్లాలో దాదాపు రెండున్నర నెలలపాటు నమోదైన 4.52లక్షల పనిదినాలకు రూ.13.88 కోట్లు చెల్లించాల్సి ఉంది.
పక్షం రోజులకు ఒకసారి చెల్లించాలి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం నిబంధనల ప్రకారం ప్రతీ 15 రోజులకు ఒకసారి కూలి డబ్బులు తప్పనిసరిగా చెల్లించాలి. చెల్లించడంలో జాప్యం జరిగితే అందుకు కూలీలకు తగిన పరిహారం సైతం చెల్లించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో దాదాపు రెండున్నర నెలలుగా ఉపాధి కూలీలకు చెల్లింపులు నిలిచిపోయాయి. అయితే కూలీల చెల్లింపుల్లో జాప్యానికి కారణాలు కూడా తెలియడం లేదని జిల్లాస్థాయి అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షించే అధికారులను కూలీలు తాము చేసిన కూలి డబ్బులు ఎప్పుడు వస్తాయని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రస్థాయినుంచి జరిగే చెల్లింపుల వ్యవహారంలో రెండున్నర మాసాలుగా ఎందుకు నిలిచిపోయాయో అధికారులకు స్పష్టత లేకపోవడంతో త్వరలోనే చెల్లింపులు జరుగుతాయని సర్ధిచెబుతున్నారు. అయితే రోజు కూలీ పనిచేసి, కూలీ డబ్బులు చేతికి అందితేనే కుటుంబాలు గడిచే ఉపాధి కూలీలు మాత్రం తమ కూలీల డబ్బులు త్వరగా చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.
జిల్లాలో ఉపాధి హామీ పథకం ఇలా..
జారీ చేసిన జాబ్‌కార్డులు 1,43,080
నమోదైన ఉపాధి కూలీలు 2,61,897
క్రియాశీలక జాబ్‌కార్డులు 84,115
క్రియాశీలక ఉపాధి కూలీలు 1,17,775
ఈ-కేవైసీ పూర్తిచేసి ఉపాధి కూలీలు 1,11,913
ఈ-కేవైసీ పూర్తిచేసిన కూలీల శాతం 95.02శాతం
రెండున్నర నెలలుగా నిరీక్షణ : ద్యానబోయిన మల్లేశ్, ఉపాధి కూలీ, దత్తాయపల్లి, తుర్కపల్లి మండలం
ఎండా కాలం.. మండుటెండల్లో పనులు చేస్తున్నాము. ఫిబ్రవరి7వ తేదీ నుంచి చేసిన పనులకు కూలి డబ్బులు రాలేదు. గతంలో 15 రోజులకు ఒకసారి డబ్బువస్తేనే కుటుంబం గడిచేది. ప్రస్తుతం దాదాపు రెండున్నర నెలలుగా కూలి రాకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోంది. వెంటనే మా కూలీ డబ్బులు చెల్లించేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. కనీసం వారం.. వారం చెల్లింపులు చేస్తే కుటుంబ ఖర్చులు చేయగలుగుతాము.