ఆన్‌లైన్ సేవలేవీ?
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:48 AM
పంచాయతీల్లో ఆన్‌లైన్ సేవలు అందక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో డిజిటల్ సేవలు అందించాలని గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
పంచాయతీల్లో అలంకార ప్రాయంగా సర్వర్లు.. ప్యానల్ బోర్డులు
అందుబాటులోకి రాని డిజిటల్ సేవలు
ఆపరేటర్లు లేక నిరుపయోగంగా పరికరాలు
(ఆంధ్రజ్యోతి,భువనగిరి రూరల్): పంచాయతీల్లో ఆన్‌లైన్ సేవలు అందక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో డిజిటల్ సేవలు అందించాలని గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ప్రతీ గ్రామపంచాయతీ కార్యాలయాని కి టీ.ఫైబర్ కేబుల్ లైన్‌ను సమకూర్చి ఇంటర్నెట్ సేవలు అం దించేందుకు వీలుగా పరికరాలు సమకూర్చింది. నెట్ సౌక ర్యం మాత్రమే కల్పించి కంప్యూటర్లు, ఆపరేటర్లను నియమించకపోవడంతో కార్యదర్శులు ఇబ్బందులుపడుతున్నా రు. పంచాయతీ కార్యాలయంలో సర్వర్లు, ప్యానల్ బోర్డుల ను ఏర్పాటుచేసినా వాటి ఉపయోగం లేకుండా పోయింది.
గ్రామపంచాయతీల్లో ఆన్‌లైన్ సేవలు అందించేందుకు టీ.పైబర్ అందుబాటులోకి తెచ్చారు.ఇంటి నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్సు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పంచాయతీ నిధుల వివరాలు, వినియోగం, పన్నుల వసూలు, పంచాయతీ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులు, జమ ఖర్చులు, సిబ్బంది జీతాల చెల్లింపులు అన్ని ఈ పంచాయతీ ఆన్‌లైన్ ద్వారా చేపడుతున్నారు. వీటిలో పారదర్శక పాలన ఉండేలా అక్రమాలను అరికట్టేందుకు గత ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అప్పటినుంచి పంచాయతీలో జరిగే ప్రతీ విషయాన్ని పంచాయతీ కార్యదర్శులు ఆన్‌లైన్‌లో చేయాల్సి వస్తుంది. దీంతోపాటు అందుబాటులో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న కంప్యూటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు లేక కార్యదర్శులు అవస్థలు పడుతున్నారు. భువనగిరి ఎంపీడీవో కార్యాలయం ద్వారా కార్యదర్శులు ఆన్‌లైన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వం నెట్ సేవలను వినియోగించుకునేందుకు అవసరమైన సర్వర్, ప్యానల్ బోర్డులను పంచాయతీలవారీగా సమకూర్చేందుకు ప్రైవేటు సంస్థకు పనులు అప్పగించింది. సంస్థకు చెందిన సిబ్బంది అన్ని గ్రామపంచాయతీలో సర్వర్, ప్యానల్ బోర్డులను అమర్చి నెట్ సేవలను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. అయితే కంప్యూటర్లు, ఆపరేటర్లు లేని కారణంగా కోట్లాది రూపాయలు ఖర్చుచేసే ఏర్పాటు చేసిన పరికరాలు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో అలంకర ప్రాయంగా మారాయి.
ఆపరేటర్ లేక ఇబ్బందులు
భువనగిరి మండలంలో 34 గ్రామపంచాయతీలు ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శులు ఏది అవసరం ఉన్నా జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి. ఎంపీడీవో కార్యాలయంలో ఈ పంచాయతీ ఆపరేటర్లు ఉండడంతో వారి ద్వారా పంచాయ తీ కార్యదర్శులు ఆన్‌లైన్ పనులు చేసుకోవాల్సి వస్తుంది. 34 గ్రామపంచాయతీలకు కేవలం ముగ్గురు మా త్రమే పంచాయతీ ఆ పరేటర్లు పని చేస్తుండడంతో వారిపై తీవ్ర పనిభారం పడుతుంది.
కంప్యూటర్లు, ఆపరేటర్లను నియమించాలి : చిల్కూరి శ్రీనివాస్, ఎంపీడీవో, భువనగిరి
భువనగిరి మండలంలోని 34 గ్రామపంచాయతీలకు కంప్యూటర్లను ఏర్పాటుచేసి ఆపరేటర్లను నియమించాలి. భువనగిరి ఎంపీడీవో కార్యాలయంలో ఈపంచాయతీ ఆపరేటర్లు ముగ్గురు మాత్రమేఉన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో కంప్యూటర్లను ఏర్పాటు చేసినట్లయితే కార్యదర్శులు ఆన్‌లైన్ సేవలు చేసేందుకు అవకాశం ఉంటుంది.