క్రీడా ప్రాంగణాలపై పట్టింపేదీ..?
ABN , Publish Date - May 26 , 2026 | 11:05 PM
గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో గ్రామాల్లో క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేసింది.
నిరుపయోగంగా మైదానాలు..కనిపించని సామగ్రి
(ఆంధ్రజ్యోతి-బొమ్మలరామారం): గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో గ్రామాల్లో క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేసింది. కానీ నేడు నిర్వహణకు నోచుకోకపోవడంతో నిరుపయోగంగా మారాయి. క్రీడా సామగ్రి లేక కేవలం బోర్డులకే పరిమితమయ్యయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా ఒక్కో క్రీడా ప్రాంగణం కోసం రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరుకు నిఽధులను కేటాయించగా, అప్పట్లో సర్పంచుల్ల దగ్గరుండి పనులను పూర్తిచేయించారు. కానీ వాటి నిర్వణ గాలికి వదిలేయడంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యింది. ప్రతీ గ్రామంలో క్రీడాప్రాంగణం ఏర్పాటుచేసి, కోచల ద్వారా యువత, చిన్నారులకు శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ముందుకు వెళ్లినప్పటికీ, క్షేత్రస్థాయిలో క్రీడా ప్రాంగణాల లక్ష్యం ఆచరణకు ఆమడ దూరంలోనే ఆగిపొయింది.
అలంకారప్రాయంగా ప్రాంగణాలు
గ్రామాల్లో అర ఎకరం నుంచి ఎకరం విస్తీర్ణంలో తెలగాంణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలో ఉండగా చాల గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు లేకపోవడంతో గ్రామంలో ఉన్న పాఠశాల ఆటస్థలంలో, ఊరికి దూరంలో ఉన్న కొద్దిపాటి స్థలాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. కానీ గ్రామాల్లో క్రీడా ప్రాగాణం పేరిట బోర్డు, వాలీబాల్‌కోర్టులు నామ మాత్రం గానే ఏర్పాటు చేసి వదిలేశారు. కొన్ని చోట్ల కేవలం క్రీడాప్రాంగణం పేరుతో బోర్డులు పెట్టి ఇతరత్రా వసతులను మరిచారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం కూడా క్రీడా ప్రాంగాణాల నిర్వహణపై దృష్టి పెట్టకపోవడం, సరైన వసతులు కల్పించకపోవడంతో గ్రామంలో యవత, క్రీడాకారులు ఆటలు అడేందుకు గ్రామాల్లో ఏర్పాటుచేసిన క్రీడాప్రాగాణంపై అసక్తి చూపడం లేదు. నిర్వహణ సక్రమంగా లేక పోవడంతో పిచ్చిమొక్కలు పెరిగి అధ్వానంగా తయరయ్యాయి. కొన్ని గ్రామాల్లో ఊరుకు దూరంగా క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయడంతో ఒక్కరోజు కూడా క్రీడాకారులు ఆటలు ఆడిన దాఖలాలు ఏ గ్రామంలోనూ లేవు. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు, మందుబాబులకు అడ్డాలుగా మారాయి. లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన ప్రాంగణాలు ప్రారంభం నుంచి నేటి వరకు అందుబాటులో లేకుండా పోయాయి.
కనబడని క్రీడా సామగ్రి
మండలంలో పూర్తిచేసిన క్రీడా ప్రాంగాణాల్లో సూమారు రూ.60 వేలతో జిమ్ పరికరాలతో పాటు, వాలీబాల్, క్రికెట్, ఖోఖో, స్కిప్పింగ్‌తో కలిపి పలు రకాల పరికరాలను గ్రామ పంచాయతీలకు అందజేసినట్లు రికార్డు పరంగా ఉన్నప్పటికీ, గ్రామపంచాయతీలకు వచ్చేవరకు క్రీడా సామగ్రి కిట్లు రాలేదని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటు న్నారు. అధికారులు క్రీడా సామగ్రిపై దృష్టి పెట్టకపోవడంతో, పంపిణీ చేసిన కిట్లు గ్రామపంచాయతీలో కనబడకుండా పోయాయి. బొమ్మలరామారం మండంలో 34 గ్రామపంచాయతీలకు గాను 10 గ్రామపంచాయతీల్లో స్థలం లేకపోవడంతో క్రీడా ప్రాగాంణాలు ఏర్పాటు చేయలేకపోయారు. బొమ్మలరామారం, మైలారం, పెద్దపర్వతాపూర్ గ్రామపంచాయతీలో నిర్మాణ పనులను ప్రారంభించారు. కానీ పూర్తిచేయలేదు. మిగిలిన 21 గ్రామపంచాయతీల్లో క్రీడా ప్రాగాంణాలు ఉన్నట్లు బోర్డులు మాత్రమే దర్శనమిస్తున్నాయి.
క్రీడాప్రాంగణాలను పూర్తిచేసిన గ్రామాలు ఇవే..
1)చీకటిమామిడి, 2)పకీర్‌గూడెం, 3) హాజీపూర్, 4)జాలాల్‌పూర్, 5)కాలువకుంట్ల తండా, 6)మాచినపల్లి, 7)మర్యాల, 8)మల్యాల, 9)మేడిపల్లి, 10)మైలారం కిందితండా, 11)నాగినేనిపల్లి, 12)నాయక్ తండా, 13)పిల్లిగుండ్లతండా, 14)ప్యారారం, 15)రామలింగంపల్లి, 16)సోలిపేట్, 17)తిమ్మపూర్, 18)తిరుమలగిరి, 19)తూముకంట, 20)యావపూర్ తండా, 21) రంగాపూర్ తదితర గ్రామా ఏర్పాటుచేశారు. ఇందులో చాలా వరకు నిరుపయోగంగానే ఉన్నాయి.
క్రీడా ప్రాంగణాలను వినియోగంలోకి తేవాలి
-దొమ్మాట మహేష్, యువకుడు, మల్యాల గ్రామం
గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న క్రీడా ప్రాంగణాలను వినియోగంలో తీసుకొచ్చినట్లుయితే యువతీ యువకులకు సాయంకాలం వేళలో ఆటలు ఆడుకునేందుకు ఉపయోగపడతాయి. ప్రస్తుతం పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. క్రీడా ప్రాంగణాలను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు పంచాయతీలు కృషి చేయాలి. వాటి పర్యవేక్షణపై అధికారులు దృష్టి సారించాలి.