క్రీడా ప్రాంగణాలపై పట్టింపేదీ?
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:17 AM
ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఉల్లాసానికి, శారీరక దృడత్వానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయి.
(ఆంధ్రజ్యోతి-గుండాల) : ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఉల్లాసానికి, శారీరక దృడత్వానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయి. గ్రామీణ ప్రాంతంలో యువకులు, విద్యార్థులు ఆడుకోవడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహిస్తూ వారిలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు గత ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి అనేక గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. ఇందుకు అవసరమైన స్థలాలు కేటాయించి నిధులు మంజూరు చేసింది. తర్వాత నిర్వహణ లేకపోవడంతో క్రీడా ప్రాంగణాలు పొదలు, పిచ్చి మొక్కలతో అస్తవ్యస్తంగా మారాయి. ప్రభుత్వాలు క్రీడల ప్రాధాన్యాన్ని గుర్తించి, అందుకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ దిశగానే గత ప్రభుత్వం 2022లో రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి జిల్లాలోని 421 గ్రామ పంచాయితీల్లో క్రీడా ప్రాంగణాల కోసం ఎకరం స్థలాన్ని కేటాయించింది. ప్రభుత్వ స్థలం ఎక్కువ ఉన్న వద్ద ఎక్కువ, స్థలం ఇబ్బంది ఉన్నచోట ఉన్నంతలో స్థలాన్ని కేటాయించింది. మైదానాలను శుభ్రం చేయించి, వాలీబాల్, ఖోఖో లాంటి, కొన్ని రకాల వ్యాయామాల కోసం ఇనుప పైపులను ఏర్పాటు చేయించింది.
బోర్డులకే పరిమితం..
గత ప్రభుత్వం గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసినప్పటికీ నిర్వాహణ కరవై అవి నిరుపయోగంగా మారాయి. మైదానాలు ఏర్పాటు కోసమని స్థలాల కొరత పేరుతో కొన్ని చోట్ల గ్రామాలకు దూరంగా మరికొన్ని చోట్ల గ్రామాల్లోని పాఠశాల ఆవరణలో ఎక్కడ పడితే అక్కడ బోర్డులు అమర్చి మమ అనిపించారు. ప్రాంగణాలను ఏర్పాటు చేసి సౌకర్యాలను కల్పించకుండా బోర్డులు పెట్టించి వదిలేశారు. మరికొన్ని గ్రామాలలో నీరు నిలిచే చౌడు నేలల్లో క్రీడా ప్రాంగణాల బోర్డులను తట్టించి వదిలేశారు. క్రీడా ప్రాంగణాలలో నాసిరకం పరికరాలను బిగించడంతో కొన్ని రోజులకే తుప్పుపడుతున్నాయి. సరైన వసతులు లేక పోవడంతో క్రీడా మైదానాలు నిరుపయోగంగా మారాయి. దీంతో విద్యార్థులు, యువకులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. గుండాల మండల కేంద్రంలో బీసీ బాలుర హాస్టల్ ముందు బోర్డును తగిలించి వదిలేశారు. ఆ ప్రాంగణం మొత్తం కంపచెట్లతో దర్శనమిస్తుంది. పాచిల్ల గ్రామంలో చౌడు భూమిలో ఏర్పాటు చేయడం వల్ల నీటి జాలు వచ్చి ప్రాంగణం నిరుపయోగంగా మారింది. లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన పరికరాలు తుప్పు పట్టి పోయాయి. దీంతో ఆ మైదానాలు ఆటలకు ఏ విధంగానూ ఉపయోగ పడడం లేదు. క్రీడలకు అనువైన చోట వాటికి ఆదరణ కరవైంది. దీంతో మైదానాలు అలంకార ప్రాయంగా మారాయి.
మందుబాబులకు అడ్డాగా క్రీడా మైదానాలు..
క్రీడా మైదానాలు గ్రామాలకు దూరంగా ఉండడంతో మందుబాబులకు అడ్డాగా మరాయి. మైదానాల్లో ముళ్ల పొదలు పెరిగి తుప్పుపట్టిన పరికరాలు దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల ఇనుప గేట్లు విరిగిపోగా మరికొన్ని చోట్ల మైదానాల చుట్టూ కంచె నిర్మాణం లేకపోవడంతో పశువులు, జీవాలకు ఆవాసాలుగా మారాయి. లక్షలాది రూపాయలు వెచ్చించినా వృథాగా మారడంతో క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తగిన చర్యలు చేపడతాం
-చండీరాణి, ఎంపీడీవో, గుండాల
క్రీడా ప్రాంగణాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తాం. దెబ్బతిన్న పరికరాలకు మరమ్మతు చేయిస్తాం. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగంలోకి వచ్చేలా తగిన చర్యలు తీసుకుంటాం.