Share News

రాష్ట్రంలోనే ఆదర్శ, అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:29 AM

హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాలను రాష్ట్రంలోనే ఆదర్శ, అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

రాష్ట్రంలోనే ఆదర్శ, అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం
సచివాలయంలో అభివృద్ధి పనులపై సమీక్ష చేస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పక్కన ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌

సచివాలయంలో మంత్రి ఎన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష

హుజూర్‌నగర్‌, జూన 22 (ఆంధ్రజ్యోతి) : హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాలను రాష్ట్రంలోనే ఆదర్శ, అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ పవార్‌ సమక్షంలో మంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు. 16 కీలక మౌలిక వసతుల నిర్మాణాలకు సంబంధించిన పనులపై మంత్రి సమీక్ష చేశారు. వీటిలో ఐదు ఆధునిక షాదీఖానాలు, మూడు చొప్పున తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాలు, పోలీ్‌సస్టేషన్లు, కోదాడ ఈద్గా అభివృద్ధి, హుజూర్‌నగర్‌లోని క్రైస్తవ సమాధి వాటిక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లే లక్ష్యంతో కొత్త కార్యాలయ భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యమివ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ పనిని నిర్దేశిత గడువులో, నాణ్యతో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 12:29 AM