ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చి దిద్దుతాం
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:32 AM
జిల్లా కేంద్రం భువనగిరి పట్టణాన్ని ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దుతామని, అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తామని భువనగిరి మునిసిపల్ చైర్ పర్సన తంగెళ్లపల్లి శ్రీవాణి అంటున్నారు.
అన్ని వార్డుల అభివృద్ధికి సమగ్ర ప్రాధాన్యం
భువనగిరి మునిసిపల్ చైర్‌పర్సన శ్రీవాణి
(ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన): జిల్లా కేంద్రం భువనగిరి పట్టణాన్ని ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దుతామని, అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తామని భువనగిరి మునిసిపల్ చైర్ పర్సన తంగెళ్లపల్లి శ్రీవాణి అంటున్నారు. ఈమేరకు ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలను పేర్కొన్నారు. ఆమె లక్ష్యాలు, అభివృద్ధి ప్రణాళికలపై వివరించారు.
ఆంధ్రజ్యోతి: చైర్ పర్సనగా మీ లక్ష్యం, ప్రణాళిక ఏమిటి?
చైర్‌పర్సన: నిజాం కాలం నుంచే భువనగిరి మునిసిపాలిటీగా ఉన్నది. కానీ పలు కారణాలతో ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. ఆ అభివృద్ధి లోటును అధిగమించడమే మా లక్ష్యం. సీఎం రేవంత రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి సహకారంతో రాష్ట్రంలోనే స్మార్ట్ టౌనగా అభివృద్ధి చేసేందుకు మొదటి రోజు నుంచే ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తాం. వైస్ చైర్మన పోతంశెట్టి మంజులతో పాటు రాజకీయాలకు అతీతంగా అందరు కౌన్సిలర్లతో సమన్వయంతో పట్టణాభివృద్ధి కోసం కృషి చేస్తాం.
ఆంధ్రజ్యోతి: మీ మొదటి ప్రాధాన్యం ఏమిటి?
చైర్‌పర్సన: పెండింగ్‌లో ఉన్న రూ.8కోట్లతో నిర్మించి నిరుపయోగంగా ఉంచిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో మిగులు పనులు పూర్తి చేసి వినియోగంలోకి తెస్తాం. రూ.9కోట్లతో సాగుతున్న ప్రధాన రహదారి విద్యుత టవర్స్ పనులను పూర్తిచేస్తాం. పనులకు ప్రధాన అడ్డంకిగా మారిన ఇండియా మిషన హైస్కూల్ వివాదాన్ని పరిష్కరిస్తాం. ఎంపిక చేసిన 444 మంది లబ్ధిదారులకు డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను స్వాధీనం చేస్తాం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా కృషి చేస్తాం. వీధి కుక్కలు, వానరాలను నియంత్రిస్తాం.
ఆంధ్రజ్యోతి: పారిశుధ్య, వీధి దీపాల సమస్యలు ఎలా పరిష్కారిస్తారు?
చైర్‌పర్సన: పారిశుధ్యం, కంపోస్టుయార్డు నిర్వహణలో భువనగిరికి ఘనమైన గుర్తింపు ఉంది. పలు విదేశీ ప్రతినిధులు సందర్శించి, ప్రశంసించారు. అయినప్పటికీ పారిశుధ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇంటింటా చెత్త సేకరణను మరింత పకడ్బందీగా నిర్వహిస్తాం. చెత్త కుప్పలు కనపడే ప్రాంతాల ఆధారంగా మునిసిపల్ పారిశుధ్య సిబ్బందిని బాధ్యులను చేస్తాం. మురికి కాల్వలను నిరంతర శుభ్రం చేసేందుకు సిబ్బందిని అప్రమత్తంగా ఉంచుతాం. పారిశుధ్య పట్టణం లక్ష్యంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాం. పట్టణంలోని ప్రతీ స్తంభానికి లైటు వెలిగిస్తాం. అవసరమైన ప్రతీచోట నూతన స్తంభాలు ఏర్పాటు చేస్తాం.
ఆంధ్రజ్యోతి: తాగు నీటిపై మీ ప్రణాళిక ఏమిటి?
చైర్‌పర్సన: ప్రస్తుత పట్టణ జనాభాకు ప్రతీ రోజు సుమారు 11 ఎంఎల్డీ రక్షిత జలాలు అవసరం. కాని హెచఎండబ్ల్యూఎ్‌స నుంచి కేవలం సగభాగం గోదావరి జలాలు సరఫరా అవుతుండగా మిగతా సగం స్థానిక జలాలను నల్లాల ద్వారా సరఫరా చేస్తున్నాం. అలాగే సికింద్రాబాద్ సైనిక్‌పురి నుంచి భువనగిరి వరకు ఉన్న సుమారు 50 కిలో మీటర్ల పైప్‌లైనకు తరచూ మరమ్మతులకు గురవుతూ నీటి సరఫరాకు అవాంతరాలు తలెత్తుతున్నాయి. దీంతో పట్టణానికి అవసరమైన తాగు నీటిని మిషన భగీరథ ద్వారా సరఫరా అయ్యేలా ప్రభుత్వాన్ని ఒప్పిస్తాం. దీంతో మునిసిపాలిటీకి ఆర్థిక భారం తప్పడంతో పాటు పట్టణ ప్రజలందరికీ గోదావరి జలాలే సరఫరా అవుతాయి. రూ.21కోట్లతో నడుస్తున్న అమృత 2.0పథకం తాగు నీటి పనులు త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తాం.
ఆంధ్రజ్యోతి: కార్యాలయం నిర్వహణలో మార్పులు ఉన్నాయా..?
చైర్‌పర్సన: మునిసిపల్ కౌన్సిల్ అధికారులు, సిబ్బందితో కలిసి పని చేస్తుంది. ప్రజల నుంచి వచ్చే పిర్యాదులపై వెంటనే స్పందించేలా మునిసిపల్ యంత్రాగానికి ఆదేశాలు ఇస్తాం. అవినీతికి ఆస్కారం ఇవ్వం. సిబ్బంది ఖాళీల భర్తీకి, డిప్యూటేషన్ల రద్దుకు కృషి చేస్తాం. బిల్లుల చెల్లింపు, టెండర్లు నూతన పనుల ప్రతిపాదన తదితర పనుల్లో పారదర్శకత పాటిస్తాం. ప్రజలకు నిరంతరం అందబాటులో ఉంటాం. అలాగే ప్రజలు ఆస్తి పన్ను, నీటి చార్జీలు, ట్రేడ్ లైసెన్సు సకాలంలో చెల్లించాలి.
ఆంధ్రజ్యోతి: పార్కుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నది కదా..
చైర్‌పర్సన: నిజమే చాలా పార్కుల్లో పచ్చదనం కనుమరుగైంది. దీంతో పట్టణంలోని అన్ని పార్కులను సుందరీకరిస్తాం. ఓపెన జిమ్‌లు, పిల్లలకు ఆట వస్తువులు ఏర్పాటు చేస్తాం. రూ.8కోట్లతో సాగుతున్న పెద్ద చెరువు కట్ట సుందరీకరణ పనులను త్వరలో పూర్తి చేస్తాం. పెద్ద చెరువు సమీపంలోని 14ఎకరాల మునిసిపల్ స్థలంలో అధునాతన పార్కును అభివృద్ధి చేస్తాం. ఫుట్‌పాత పనులను పూర్తి చేసి గ్రీనరీతో అభివృద్ధి చేస్తాం. జూనియర్ కళాశాల ఆవరణ పరిరక్షణకు ప్రహరీగోడ నిర్మించి పట్టణాన్ని క్రీడా హబ్‌గా అభివృద్ధి చేస్తాం.