Share News

ఉపాధి కోల్పోతాం.. ఫ్లైఓవర్‌ వద్దు

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:29 AM

సూర్యాపేట జిల్లాలోని గౌరెళ్లి-కొత్తగూడెం జాతీయ రహదారి(930పీ)పై ప్రధాన పట్టణాల్లో తిరుమలగిరి ఒకటి. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఈ పట్టణంలో చౌరస్తా వాణిజ్య, వ్యాపారాలకు కేంద్ర బిందువు.

ఉపాధి కోల్పోతాం.. ఫ్లైఓవర్‌ వద్దు
తిరుమలగిరిలో ఫ్లైఓవర్‌ బ్రిడ్జి ప్రతిపాదిత ప్రదేశం

(ఆంధ్రజ్యోతి-తిరుమలగిరి)

సూర్యాపేట జిల్లాలోని గౌరెళ్లి-కొత్తగూడెం జాతీయ రహదారి(930పీ)పై ప్రధాన పట్టణాల్లో తిరుమలగిరి ఒకటి. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఈ పట్టణంలో చౌరస్తా వాణిజ్య, వ్యాపారాలకు కేంద్ర బిందువు. ఈ చౌరస్తా నుంచే మరో ప్రధాన సూర్యాపేట-జనగాంకు వెళ్లే రహదారి కలుస్తుంటుంది. అయితే 930పీ రహదారిపై ఫ్లైఓవర్‌ నిర్మాణ ప్రతిపాదనలతో స్థానిక వ్యాపారుల్లో కలవరం మొదలైంది. ఫ్లైఓవర్‌ నిర్మించొద్దన్న డిమాండ్‌ నానాటికీ పెరుగుతోంది. చౌరస్తా సమీపం వరకు అటూ, ఇటూ రహదారి పనులు పూర్తికావచ్చొయి. తిరుమలగిరి మండల పరిధిలో 15 కిలోమీటర్ల పనులు పూర్తిదశలో ఉన్నాయి.

ఫ్లైఓవర్‌ వివాదం

గౌరెళ్లి-కొత్తగూడెం జాతీయ రహదారిపై తిరుమలగిరి కేంద్రంలో తొర్రూర్‌-వలిగొండ క్రాస్‌రోడ్‌లో ఫ్లైఓవర్‌ నిర్మించనున్నట్లు జాతీయ రహదారి అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఫ్లైఓవర్‌ నిర్మించే ప్రదేశాన్ని గుర్తించి, కొలతలు కూడా నిర్ధారించారు. ఇక మిగిలింది కేవలం ఫ్లైఓవర్‌ పనులు చేపట్టడమే. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణంతో తమ వ్యాపారాలు దెబ్బతిని ఉపాధి అవకాశాలు కోల్పోతామని దుకాణ యజమానులు, చిరువ్యాపారులు వాపోతున్నారు. ఫ్లైఓవర్‌ నిర్మించొద్దని, రహదారి విస్తరణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంలో పలుమార్లు ప్రజా ప్రతినిధులకు, జాతీయ రహదారి అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. పనులు చేపట్టడానికి వచ్చిన వాహనాలను, అధికారులను అడ్డుకుని నిరసన తెలిపారు. ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ససేమిరా ఒప్పుకోమని, సుమారు 200 కుటుంబాలకు ఉపాధి లేక రోడ్డున పడతామని, తమ గోడును వెళ్లబోసుకున్నారు.

ఎటూ తేల్చని అధికారులు

తిరుమలగిరి కేంద్రంలోని తొర్రూరు-వలిగొండ క్రాస్‌రోడ్డులో ఫ్లైఓవర్‌ నిర్మిస్తామని హైవే అధికారులు ప్రకటించారు. కానీ ప్రజల నుంచి ఫ్లైఓవర్‌ వద్దన్న డిమాండ్లు పెరగడంతో సందిగ్ధంలో పడ్డారు. ఫ్లైఓవర్‌ పనులు చేపట్టేందుకు వచ్చిన ప్రతీసారి పెద్దసంఖ్యలో స్థానికులు అడ్డుకుంటున్నారు. ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని మాట దాటవేస్తున్నారు. కానీ స్పష్టమైన నిర్ణయం తేల్చడం లేదు. రహదారి విస్తరణ చేపట్టాలని స్థానికుల డిమాండ్‌తో ఫ్లైఓవర్‌ చేపట్టాలా, విస్తరించాలా అన్న సందిగ్ధంలో ఎటూ తేల్చకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు.

ఫ్లైఓవర్‌ వద్దని వినతులు

ఫ్లైఓవర్‌ నిర్మించవద్దని వినతులు వస్తున్నాయి, కానీ దీనిపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

రామరాజు, ఏడబ్ల్యూఈ

ఫ్లైఓవర్‌తో ఉపాధి కోల్పోతాం

తిరుమలగిరిలో ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణంతో ఉపాధి కోల్పోతాం. క్రాస్‌రోడ్‌లో ఎన్నో ఏళ్లుగా ఓ దుకాణం అద్దెకు తీసుకుని స్వీట్‌షాప్‌ నడుపుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నా. నాకు ఆ షాపే జీవనాధారం. ఫ్లైఓవర్‌తో ఉపాధి కోల్పోతాం. బ్రిడ్జి నిర్మించొంద్దు.

చినగాని శ్రీహరి, స్వీట్‌షాపు యజమాని

ఫ్లైఓవర్‌ ప్రతిపాదన రద్దే వరకు పోరాటం

తిరుమలగిరిలో హైవే పనులు మొదలుపెట్టినప్పటి నుంచి ఫ్లైఓవర్‌ వద్దని పోరాటంచేస్తున్నాం. ఫ్లైఓవర్‌తో వ్యాపారులు ఉపాధి కోల్పోతారు.ఎన్నో మార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించాం. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాం. ఫ్లైఓవర్‌ బ్రిడ్జి రద్దు చేసేంతవరకు పోరాటం చేస్తాం.

కొమ్మినేని సతీ్‌షకుమార్‌, మాజీ ఎంపీపీ

Updated Date - Feb 21 , 2026 | 12:29 AM