రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:49 PM
ఎండలు దంచికొడుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో పెద్దమొత్తంలో ధాన్యం పేరుకుపోయింది.
వ్యవసాయశాఖ సబ్‌డివిజన సహాయ సంచాలకులు శాంతినిర్మల
(ఆంధ్రజ్యోతి-యాదగిరిగుట్ట రూరల్)
ఎండలు దంచికొడుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో పెద్దమొత్తంలో ధాన్యం పేరుకుపోయింది. రైతులు ధాన్యాన్ని ఆరబోసి, తాలు తీసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం సకాలంలో కాంటాలు కాకపోవడం.. కాంటాలు అయినా ధాన్యం మిల్లులకు తరలకపోవడవం ఇత్యాధి సమస్యలు రైతులను వెంటాడుతన్నాయి. ఇలాంటి తరుణంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని వ్యవసాయ శాఖ యాదగిరిగుట్ట సబ్‌డివిజన సహాయ సంచాలకులు శాంతినిర్మల రైతులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం యాదగిరి గుట్టలోని ఏడీఏకార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి 12గం టల వరకు ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని యాదగిరిగుట్ట, బొమ్మలరామారం, తుర్కపల్లి, రాజపేట, మోటకొండూర్ మండలాల్లోని రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి సందేహాలను నివృత్తి చేశారు.
రైతు భరోసా, పెట్టుబడి రావడంలేదు
-పాపట్ల నరహరి, యాదగిరిగుట్ట, మారగోని రాంమూర్తి రుస్తాపురం
ఏడీఏ: పంటలు సాగుచేసిన ప్రతీ రైతుకు రైతు భరోసా తప్పనిసరిగా పడుతుంది. ప్రస్తుతం రైతు భోసాను ప్రభుత్వం మూడు విడుతలుగా విడుదల చేసింది. ఇప్పటికే రెండు విడుతలుగా రైతు భరోసా రైతుల ఖాతాలలో జమ అయింది. ఎకరానికి ఆరువేల చొప్పున రైతు భరోసా రెండు పంటలకు రూ. 12వేలు పడుతుంది. రైతు భరోసా పడని రైతులు సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారిని సంప్రదించాలి.
కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు లేవు
-నూకల భాస్కర్‌రెడ్డి, ఎం.ప్రభాకర్, యాదగిరిగుట్ట
ఏడీఏ: ఆయా గ్రామాల్లో నిర్వాహకులు ఏర్పాటు చేసిన కేంద్రాల వద్దని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా తాగునీరు, నీడకోసం తప్పని సరిగా టెంట్, టార్పాలిన్ కవర్లు, టాడిక్లీనింగ్ మిషన, విద్యుత్ సౌకర్యం కల్పించాలి.
ధాన్యం ఆరబెట్టడానికి స్థలం లేదు
-గోపగాని ప్రసాద్‌గౌడ్, గోపి శ్రీనివాస్, మల్లాపురం
ఏడీఏ: కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఆరబెట్టడానికి విశాలమైన మైదానం ఏర్పాటు చేయడానికి డీఆర్‌డీవో దృష్టికి తీసుకెళ్తా. రైతులకు ఇబ్బందులు కాకుండ చర్యలు తీసుకుంటా.
యూరియా యాప్‌తో ఇబ్బందులు అవుతున్నాయి
-సుదర్శన్, మర్యాల, బొమ్మలరామారం, సీస కృష్ణ, యాదగిరిగుట్ట
ఏడీఏ: పంటలు సాగుచేసిన ప్రతీ రైతుకు రైతు భరోసా తప్పని సరిగా మూడు విడుతల్లో పడుతుంది. యూరియా యాప్‌పై ప్రతీ గ్రామంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. డీలర్ల వద్ద ప్రత్యేక వలంటీర్లను ఏర్పాటు చేసి ఇబ్బందులను తొలగిస్తాం.
కొనుగోలు కేంద్రాల వద్ద నిలువనీడ లేదు
-ముక్కెర్ల కొమురయ్య, కొత్తగుండ్లపల్లి, యాదగిరిగుట్ట
ఏడీఏ: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తాం. నీడ, తాగునీటి సౌకర్యాలు కల్పించని కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.
వ్యవసాయ యంత్రాల సబ్సిడీ ఎప్పుడు వస్తుంది?
-ఫర్జానా, జంగంపల్లి, యాదగిరిగుట్ట
ఏడీఏ: రెండు నెలల తరువాత వ్యవసాయ అధునాతన పనిముట్లు సబ్సిడీపై వస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం సబ్సిడీ ఉంటుంది. ప్రతీ మహిళకు 50శాతం సబ్సిడీ ఉంది. బీసీలకు 40శాతం ఉంది. పనిముట్లు వచ్చినప్పుడు తప్పని సరిగా పత్రికా ప్రకటన చేస్తాం.
పూర్తి స్థాయిలో పథకాలు ఎలా పొందాలి
-కల్లేపల్లి మహేందర్, చిన్నకందుకూర్, యాదగిరిగుట్ట మండలం
ఏడీఏ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్కీమ్ ద్వారా రైతులు పథకాలు పొందాలంటే తప్పని సరిగా రైతుకు సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్‌కార్డు, సెల్‌నంబర్లను మీసేవ కేంద్రాలు, వ్యవసాయ కేంద్రాల్లో ఫార్మారిజిసీ్ట్ర తప్పని సరిగా చేసుకోవాలి. లేకుంటే ఎలాంటి ప్రభుత్వ పథకాలు పొందలేరు.
హెచటీ కాటన్ విత్తనాలు సాగుచేయొచ్చా?
-రాజు, రాజపేట మండలం
ఏడీఏ: వాతావరణాన్ని కలుషితం చేసే హెచ్‌టీ కాటన్ విత్తనాలను ప్రభుత్వం నిషేధించింది. వాటిని విక్రయించినా, సాగుచేసినా రైతులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.
రుణమాఫీ కావడంలేదు
-కోట శ్రీశైలం, తుర్కపల్లి మండలం
ఏడీఏ: పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉందా? ఒకవేళ అవి సరిగా లేకుంటే వాటిని స్థానిక వ్యవసాయ కార్యాలయంలో సంబంధిత అధికారులను సంప్రదించాలి. అర్హత ఉంటే తప్పని సరిగా రుణమాఫీ అందుతుంది.