Share News

మత్స్యసంపద సృష్టిలో ముందుంటాం

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:59 AM

మత్స్య సంపదలో నల్లగొండ జిల్లాను అగ్రస్థానంలో నిలపడ మే మా లక్ష్యం. జిల్లాలో మత్స్య సంపద విస్తీర్ణం కూడా ఎక్కువగా ఉండటం మాకు కలిసొచ్చే అంశం. రెండేళ్లుగా మత్స్య దిగుబడి క్రమంగా పెరుగుతోందని నల్లగొండ జిల్లా మత్స్యశాఖ అధికారి సుకీర్తన పేర్కొన్నారు.

మత్స్యసంపద సృష్టిలో ముందుంటాం

‘ఆంధ్రజ్యోతి’తో జిల్లా మత్స్యశాఖ అధికారి సుకీర్తి

(ఆంధ్రజ్యోతి-నల్లగొండ(కలెక్టరేట్‌): మత్స్య సంపదలో నల్లగొండ జిల్లాను అగ్రస్థానంలో నిలపడ మే మా లక్ష్యం. జిల్లాలో మత్స్య సంపద విస్తీర్ణం కూడా ఎక్కువగా ఉండటం మాకు కలిసొచ్చే అంశం. రెండేళ్లుగా మత్స్య దిగుబడి క్రమంగా పెరుగుతోందని నల్లగొండ జిల్లా మత్స్యశాఖ అధికారి సుకీర్తన పేర్కొన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యసంపద వృద్ధికి చేపడుతున్న చర్యలు, మత్స్యకారుల సంక్షేమం కోసం అమలుజేస్తున్న పథకాలను ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్ఫ్యూలో వివరించారు.

ఆంధ్రజ్యోతి : నల్లగొండ జిల్లాలో మత్స్య సంపద విస్తీర్ణం ఎంత? గత రెండేళ్లతో చేపల దిగుబడి, మత్స్య ఉత్పత్తుల వృద్ధి ఎలా ఉంది?

సుకీర్తన : జిల్లాలో మత్స్య సంపదకు చాలా మంచి అవకాశం ఉంది. సుమారు 211 పెద్ద చెరువులు, 956 గ్రామపంచాయతీ చెరువులు, 9 రిజర్వాయర్లు వీటికి తోడు నాగార్జునసాగర్‌, డిండి, మూసీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అలాగే ఐదు మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకులు ఉన్నాయి. మొత్తం జలవిస్తీర్ణం సుమారు 54,000 హెక్టార్లకు పైగా ఉంది. గత రెండేళ్లతో పోలిస్తే దిగుబడి క్రమంగా పెరుగుతోంది. 2023-24తో పోలిస్తే 2024-25, 2025-26లో దిగుబడి 10 నుంచి 12శాతం వరకు పెరిగింది. దీనికి ప్రధానకారణం ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలు వేయడం, శాస్త్రీయ పద్ధతిలో పెంపకంపై అవగాహన పెరగడం, మత్స్యకార సొసైటీలు చురుకుగా పని చేయడం. ముఖ్యంగా రొహు, కట్ల, మ్రిగాల్‌ వంటి మేజర్‌ కార్ఫ్‌ చేపలతో పాటు, ఇప్పుడు పంగాసియస్‌, తిలాపియా వంటి వేగంగా పెరిగే రకాల వైపు కూడా రైతులు ఆసక్తి చూపుతున్నారు.

ఆంధ్రజ్యోతి: ఉచిత చేపపిల్లల పంపిణీ ఎలా ఉంది?

సుకీర్తన : ప్రభుత్వ పథకాలు నేరుగా క్షేత్రస్థాయికి చేరుతున్నాయి. ప్రతి ఏడాది జిల్లాలోని అర్హులైన అన్ని చెరువుల్లో, సొసైటీల ద్వారా 100శాతం సబ్సిడీపై చేప పిల్లలు వేస్తున్నాం. ఈ ఏడాది కూడా చేపపిల్లల పంపిణీ కార్యక్రమం త్వరలో ప్రారంభమవుతుంది.

ఆంధ్రజ్యోతి: సబ్సిడీ వలలు, బీమా వంటి పథకాలు మత్స్యకారులకు ఏమేరకు చేరుతున్నాయి? కొత్తగా ఏమైనా రాయితీలు అందుబాటులో ఉన్నాయా?

సుకీర్తన : పీఎంఎంఎ్‌సవై కింద వలలు, బోట్లు, ఐస్‌బాక్స్‌లు, మోటార్‌సైకిల్‌ విత్‌ ఐస్‌ బాక్స్‌, త్రీ వీలర్‌ వంటి వాటిపై 40 నుంచి 60శాతం వరకు సబ్సిడీ అందిస్తున్నాం. గిరిజన మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకం ధర్తి ఆబా జనజాతీయ గ్రామ్‌ ఉత్కర్ష్‌ అభియాన్‌ కింద 90 శాతం సబ్సిడీతో 26మంది గిరిజన మత్స్యకారులకు టూవీలర్‌ వాహనాలు, 7మందికి త్రీవీలర్‌ వాహనాలను మంజూరు చేశాం. ప్రస్తుతం కొత్తగా సేజీ కల్చర్‌, బయోఫ్లోక్‌, రాస్‌ వంటి ఆధునిక పద్ధతులకు కూడా సబ్సిడీ అందుబాటులోకి వచ్చింది. మహిళా మత్స్యకారులకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నాం.

ఆంధ్రజ్యోతి : మత్స్యకారుల బీమా పథకం ఏమిటి?

సుకీర్తన : మత్స్యకారుల ప్రమాద బీమా పథకం కింద కార్మికులందరినీ నమోదుచేస్తున్నాం. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.2.50 లక్షలు పరిహారం అందుతుంది.

ఆంధ్రజ్యోతి : నీటి కాలుష్యం, అక్రమ వేటలతో జరుగుతున్న నష్టాన్ని ఎలా అరికడుతున్నారు?

సుకీర్తన: ఇది మాకు చాలా ప్రధానమైన అంశం. చెరువుల్లో ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థ పదార్థాలను వేయకుండా మత్స్యకార సహకార సంఘాలకు అవగాహన కార్యక్రమం, నీటి కాలుష్య నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నాం. లైసెన్స్‌ లేకుండా అక్రమంగా వేటాడే వారిపై నిఘా పెంచాం. ప్రత్యేక తనిఖీలు చేస్తున్నాం. నాగార్జున సాగర్‌ వంటి ప్రాంతాల్లో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాం. అదేవిధంగా పిల్లల వేటను అరికట్టేందుకు అలివి వలలు వాడకాన్ని పూర్తిగా నిషేధించాం. బ్రీడింగ్‌ సీజన్‌లో వేట నిషేధం అమలుజేస్తున్నాం. మత్స్యకారులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. పిల్ల చేపను వదిలేస్తే రేపు పెద్ద చేపగా పెరగడం లాభం అని వివరిస్తున్నాం.

ఆంధ్రజ్యోతి : ఆధునిక పద్ధతులను ప్రోత్సహించేందుకు ప్రణాళిక ఏమిటి?

సుకీర్తన : తక్కువ నీటిలో ఎక్కువ దిగుబడి ఇదే మా లక్ష్యం. యువతను ప్రోత్సహించేందుకు బయోఫ్లోక్‌, కేజీ కల్చర్‌, రాస్‌ ఫిష్‌ పాండ్స్‌లలో చేపల పెంపకం వంటి వాటిపై పాలేరు ఫిషరీస్‌ రీసెర్చ్‌ స్టేషన్‌తో కలిసి శిక్షణ ఇస్తున్నాం. ఈ నెలలోనే మహిళా మత్స్యకారులకు ఫిష్‌ వాల్యూపై మూడు రోజుల శిక్షణ ఏర్పాటు చేశాం.

ఆంధ్రజ్యోతి: మత్స్యకారులకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్‌ సౌకర్యాల కల్పన ఎలా సాగుతోంది?

సుకీర్తన: మధ్యవర్తుల ప్రమేయం తగ్గించి, మత్స్యకారులు నేరుగా విక్రయించుకునేలా ఫిష్‌ మార్కెటింగ్‌ సొసైటీలను బలోపేతం చేస్తున్నాం. నల్లగొండలో ఆధునిక ఫిష్‌ మార్కెటింగ్‌కు, మొబైల్‌ ఫిష్‌ వెండింగ్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం. లైవ్‌ ఫిష్‌ సేల్‌, వాల్యూ ఆడెడ్‌ ప్రొడక్ట్స్‌ ఫిష్‌ పికిల్‌, డ్రై ఫిష్‌ వంటి వాటికి మహిళా ఎస్‌హెచ్‌జీలకు శిక్షణ ఇచ్చి, వారి ఆదాయం పెంచేలా చేస్తున్నాం. దీంతో మత్స్యకారుడికి కిలోకు రూ.20 నుంచి రూ.40 వరకు అదనపు ఆదాయం వస్తుంది.

Updated Date - Nov 21 , 2026 | 12:59 AM