Share News

వన్యప్రాణుల కోసం నీటి వనరులు

ABN , Publish Date - May 13 , 2026 | 12:05 AM

నల్లమల అడవిలోని వన్యప్రాణులు, అటవీ జంతులు ఎండవేడిమికి అల్లాడిపోకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లి, దేవరకొండ అటవీ పరిధిలో అటవీ శాఖ ఏర్పాటుచేసిన నీటితొట్లు, గుంతలు, చెక్‌డ్యాంల వద్దకు వచ్చి దాహాం తీర్చుకుంటూ ఆ నీళ్లలో సేదతీరుతున్నాయి.

వన్యప్రాణుల కోసం నీటి వనరులు
ఎండల నుంచి నీటిగుంతలో ఉపశమనం పొందుతున్న దుప్పులు, కొండెంగలు

(ఆంధ్రజ్యోతి-దేవరకొండ)

నల్లమల అడవిలోని వన్యప్రాణులు, అటవీ జంతులు ఎండవేడిమికి అల్లాడిపోకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లి, దేవరకొండ అటవీ పరిధిలో అటవీ శాఖ ఏర్పాటుచేసిన నీటితొట్లు, గుంతలు, చెక్‌డ్యాంల వద్దకు వచ్చి దాహాం తీర్చుకుంటూ ఆ నీళ్లలో సేదతీరుతున్నాయి. గతంలో కంటే నల్లమలలో అటవీ జంతువులు, వన్యప్రాణుల సంఖ్య పెరిగినట్లు ఆలిండియా టైగర్‌ ఎస్టిమేషన సర్వే-2026లో అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్డ్వ్‌ ఫారెస్ట్‌ కింద కంబాలపల్లి రేంజ్‌ అటవీ ప్రాంతం ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని 26,795 హెక్టార్లలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. నాగార్జునసాగర్‌ డివిజన పరిధిలో కంబాలపల్లి, దేవరకొండ అటవీ ప్రాంతాలున్నాయి.

బోర్లు వేసి నీటి సౌకర్యం

గత ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో అటవీ శాఖ అధికారులు నీటితొట్లు, చెక్‌డ్యాంలు, గుంతలలో నీరు నింపి అడవీ జీవాలకు తాగునీటి సౌకర్యం కల్పించారు. బోర్లు వేసి పైప్‌ల ద్వారా ట్యాంకర్ల ద్వారా తొట్లకు, చెక్‌డ్యాంలకు నీటిని సరఫరా చేస్తున్నారు. ఎండలు అధికంగా ఉండడంతో జంతువులు, వన్యప్రాణులు నీటి వసతి ఉన్న గుంతలు, చెక్‌డ్యాంల చుట్టూ చేరి నీరు తాగి సేదతీరుతున్నాయి. వన్యప్రాణులకు తాగునీటికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నల్లమలలో పెద్దపులితో పాటు 40వరకు చిరుత పులులు, 100కుపైగా ఎలుగుబంట్లు, పెద్దసంఖ్యలో రేస్‌ కుక్కలు, మనుబోతులు, దుప్పులు, జింకలు, కుందేళ్లు, నెమళ్లు, కొండెంగలు, కోతులు, జంతువులు, పక్షలు, వన్యప్రాణులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు

నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు, జంతువులకు తాగునీటికి ఇబ్బందులు కలుగకుండా నీటి సౌకర్యం కల్పిస్తున్నాం. అటవీ సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. చెక్‌డ్యాంలు, నీటితొట్లు ఏర్పాటుచేసి నీరు నింపుతున్నాం. దీంతో అటవీ జంతువులు, వన్యప్రాణుల సంఖ్య బాగా పెరిగింది.

- భాస్కర్‌, కంబాలపల్లి రేంజ్‌ అధికారి

Updated Date - May 13 , 2026 | 12:05 AM