Share News

బీల్యానాయక్‌తండాలో గ్రామ మంత్రివర్గం

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:21 AM

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు, ప్రభుత్వ ఆలోచనలు తెలిసేలా రాష్ట్ర మంత్రి వర్గం కృషి చేస్తుంటుంది. ఎవరికి కేటాయించిన శాఖలను వారు సమీక్షిస్తూ, పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయికి చేరేలా చూస్తుంటారు.

బీల్యానాయక్‌తండాలో గ్రామ మంత్రివర్గం

వార్డు సభ్యులకు శాఖల కేటాయింపు

పాలనలో సర్పంచ మోతీరాంనాయక్‌ వినూత్న ఒరవడికి శ్రీకారం

(ఆంధ్రజ్యోతి-తుర్కపల్లి)

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు, ప్రభుత్వ ఆలోచనలు తెలిసేలా రాష్ట్ర మంత్రి వర్గం కృషి చేస్తుంటుంది. ఎవరికి కేటాయించిన శాఖలను వారు సమీక్షిస్తూ, పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయికి చేరేలా చూస్తుంటారు. మరి క్షేత్రస్థాయిలోనూ అదే తరహాలో మంత్రివర్గం ఉంటే అన్న ఆలోచనతో వినూత్నంగా గ్రామ మంత్రివర్గానికి యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం బీల్యానాయక్‌తండా సర్పంచ గుగులోతు మోతీరాంనాయక్‌ శ్రీకారం చుట్టారు. గ్రామ పాలకవర్గమంటే సర్పంచ ఒక్కరే కాదని, వార్డు సభ్యులూ సమానబాధ్యతతో పని చేయాలన్న దృక్పథంతో వారికి శుక్రవారం వివిధ శాఖలు, బాధ్యతలు కేటాయించారు.

బీల్యానాయక్‌తండా 2018లో పంచాయతీగా ఏర్పడింది. ఇటీవల 2025లో జరిగిన ఎన్నికల్లో సర్పంచగా గుగులోతు మోతీరాంనాయక్‌ ఎన్నికయ్యారు. గ్రామంలో వార్డు సభ్యులూ ప్రజలకు జవాబుదారీగా ఉండేలా సర్పంచ మోతీరాంనాయక్‌ తమ పాలనకు నూతన ఒరవడిని సృష్టించాడు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వ తరహాలో వార్డు సభ్యులతో గ్రామ మంత్రి వర్గాన్ని శుక్రవారం ఏర్పాటుచేశారు. వారికి వివిధ శాఖలను కేటాయించారు. దీంతో వార్డు సభ్యులు తమతమ వార్డులకే పరిమితం కాకుండా గ్రామంలో విస్తృత పర్యటనలు చేసి సమస్యలను గుర్తించి వాటిపై గ్రామ పాలకవర్గం సమావేశంలో చర్చించేలా తగు చర్యలు చేపట్టారు. 15 రోజులకు ఒకసారి సమావేశం కావాలని ప్రాథమికంగా నిర్ణయించారు. తాము చూస్తున్న శాఖలపై సమీక్ష చేయడం, సమస్యలు పరిష్కరించడంపై చర్చించనున్నట్లు సర్పంచ తెలిపారు. అయితే తమకు శాఖలు కేటాయించడంతో వార్డు సభ్యుల్లోనూ ఉత్సాహం నెలకొంది. వార్డు సభ్యులు బాధ్యతాయుతంగా మెసలుకునే ఆలోచన బలపడిందని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సర్పంచ, వార్డు సభ్యులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి గ్రామాన్ని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే తమ గ్రామంగా రూపుదిద్దుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. సర్పంచ నిర్ణయాన్ని ప్రత్యర్థి పార్టీల నాయకులు సైతం హర్షిస్తున్నారు.

పారదర్శకమైన పాలన అందించేందుకే ...

పంచాయతీలో పారదర్శకమైన పాలన అందించేందుకే రాష్ట్ర మంత్రి వర్గం తరహాలో గ్రామ మంత్రి వర్గాన్ని ఏర్పాటుచేశాం. వారికి వివిధ శాఖలను కేటాయించాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో నూతన విధానానానికి శ్రీకారం చుట్టాం. గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పంచాయతీగా తీర్చి దిద్దడమే మా లక్ష్యం. వార్డు సభ్యులకు బాధ్యతలు అప్పగించడం వల్ల గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాం.

గుగులోత మోతీరాం నాయక్‌, సర్పంచ, బీల్యానాయక్‌తండా

Updated Date - Feb 21 , 2026 | 12:21 AM