భూగర్భ జలం.. పాతాళం
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:40 AM
భువనగిరి మండలానికి చెందిన కౌలురైతు జీడిమడ్ల వీరారెడ్డి కౌలుకు తీసుకున్న కమతంలో వ్యవసాయ బావితో పాటు ఓ బోరుబావిసైతం ఉంది. ప్రస్తుతం భూగర్భ నీటిమట్టం తగ్గడం, ఎండలు పెరగడంతో బోరు ఆగి ఆగి సన్నగా పోస్తోంది.
వేసవి ఆరంభంలోనే మండే ఎండలు
వట్టిపోతున్న బోరు బావులు
తడారిపోతున్న వరిపైర్లు
తల్లడిల్లుతున్న రైతులు
భువనగిరి మండలం వీరవెల్లిలో రేగు వెంకటేష్‌కు చెందిన ఎండిన వరిచేలో మేస్తున్న పశువు
భువనగిరి మండలం వీరవెల్లి గ్రామానికి చెందిన రేగు వెంకటేష్ భూమిని నమ్ముకు ని బతుకుతున్న యువ రైతు. యాసంగిలో బోరుబావి ఆధారంగా రెండెకరాల్లో వరిసాగు చేశాడు. మార్చి మొదటి వారంలోనే బోరు వట్టిపోయింది. సుమారు రూ.లక్ష పెట్టుబడిపెట్టిన వరిపైరు తడారి ఎండిపోతోంది. దీంతో చేసేది లేక గొర్రెలకు, పశువులకు గ్రాసం కోసం కోసం వరిపైరును విక్రయించాడు.
భువనగిరి మండలం వీరవెల్లి గ్రామానికి చెందిన మార్రెడ్డి రామకృష్ణారెడ్డి 12 ఎకరాలను బోరుబావు కింద సాగు చేశా డు. బోరుబావుల్లో నీరు తగ్గడం దీనికి తోడు విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. దీంతో సద్ది కట్టుకుని బావివద్దనే ఉంటున్నాడు. ప్రస్తుతం పొట్టదశలో ఉన్న పైరును మరో నెలపాటు కాపాడుకుంటే గట్టెక్కుతాడు.
భువనగిరి మండలానికి చెందిన కౌలురైతు జీడిమడ్ల వీరారెడ్డి కౌలుకు తీసుకున్న కమతంలో వ్యవసాయ బావితో పాటు ఓ బోరుబావిసైతం ఉంది. ప్రస్తుతం భూగర్భ నీటిమట్టం తగ్గడం, ఎండలు పెరగడంతో బోరు ఆగి ఆగి సన్నగా పోస్తోంది. వ్యవసాయ బావిలో నీరు అడుగంటింది. దీంతో సాగు చేసిన రెండెకరాలు బీడుబారుతోంది. ఇప్పటికే పెట్టుబడి నష్టపోతుండగా, కౌలు ఎలా చెల్లించాలంటూ దిగాలు చెందుతున్నాడు.
యాదాద్రి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. జిల్లాలో చెరువులు, కుంటలు నిండగా వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. దీంతో వానాకాలం పంటలకు సమృద్ధిగా నీరందడమేగాక యాసంగి ప్రారంభంలో కూడా భూగర్భ జలమట్టాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. దీంతో యాసంగి సాగుపై రైతుల్లో ఆశలు చిగురించి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వరిని సాగుచేశారు. ప్రస్తుతం వరి పొట్ట దశను దాటుతుండగా, మార్చి మొదటి వారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. సూర్యుడి ప్రతాపానికి చెరువులు, కుంటల్లో నీరు ఆవిరైపోతోంది. భూగర్భ జలమట్టం రోజురోజుకూ పాతాళ మార్గం పడుతోంది. వ్యవసాయ బావుల్లో నీరు అడుగంటిపోగా, బోరుబావులు ఆగి ఆగి సన్నగా పోస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో వరిపైరు తడారిపోతుండగా, మరికొన్ని మండలాల్లో ఏకంగా వాడిపోయి పశుగ్రాసంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి.
సమృద్ధిగా వర్షాలతో విస్తారంగా వరిసాగు
జిల్లాలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే 76 శాతం ఎక్కువగా కురిసింది. జిల్లా సాధారణ వర్షపా తం 670.1మి.మీ కాగా, ఈ ఏడాది 1180.80మి.మీ వర్షపాతం నమోదైంది. అదే విధంగా జిల్లాలోని 17 మండలాల్లో 13 మండలాల్లో అత్యధిక వర్షపాతం న మోదు కాగా,మిగిలిన నాలుగు మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఆశాజనకమైన వర్షపాతంతో భూగర్భ జలాలు సమృద్ధిగా అందుబాటులోకి వచ్చా యి. భూగర్భ జలమట్టం గతం కంటే మెరుగ్గా ఉండటంతో వానాకాలంలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడలేదు. జనవరి, ఫిబ్రవరి రెండో వారం వరకు కూడా భూగర్భ జలాలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నా యి. దీంతో మూసీ పరివాహక ప్రాంతం మినహా జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో బోరుబావుల ఆధారంగానే పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో సాధారణంగా యాసంగిలో కేవలం వరి సాగవుతోంది. యాసంగిలో వరి పంటకు నీరందుతుందని ఆశించిన రైతులు విస్తారంగా సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 17 మండలాల పరిధిలో దాదాపు 1.40లక్షల బోరుబావుల కింద 3,14,621 ఎకరాల్లో వరి సాగైనట్టు వ్యవసాయశాఖ అధికారుల నివేదికలు చెబుతున్నాయి.
తడారిపోతున్న పైర్లు.. ఆందోళనలో రైతులు
జిల్లాలో భూగర్భ జలమట్టం వేగంగా పడిపోతుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే నీరందక తడారిపోతున్న పైర్లు వాడిపోతున్నాయి. ప్రస్తుతం నీరందుతున్న రైతుల్లో సైతం చివరిదశకు చేరి గట్టెక్కుతామా? లేదా? అనే భయాందోళనలో ఉన్నారు. జిల్లాలోని 17 మండలాల్లో భూగర్భ జలమట్టం పడిపోతోంది. ఇప్పటి వరకు మోతాదు మేర నీరందించిన బోరుబావుల్లో సైతం హఠాత్తుగా నీరు తగ్గిపోతోంది. కొన్ని బోరుబావులు ఆగి ఆగి సన్నగా పోస్తుండగా, మరికొన్ని మొత్తానికే నీరులేక వట్టిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి భూగర్భ జలమటం వేగంగా పడిపోవడమే కారణమని భూగర్భ జలవనరుల నిపుణులు చెబుతున్నారు. జిల్లాలోని సంస్థాన్‌నారాయణపూర్, ఆత్మకూర్(ఎం), రామన్నపేట, ఆలేరు, బొమ్మలరామారం, తుర్కపల్లి, రాజాపేట, యాదగిరిగుట్ట, మోటకొండూరు, బీబీనగర్ మండలాల్లో భూగర్భ జలమట్టాలు గణనీయంగా తగ్గుదల కనిపిస్తోంది. నారాయణపూర్ మండలంలో ఫిబ్రవరి మాసంలో భూగర్భ జలమట్టం 10.01మీటర్ల లోతుకు పడిపోగా ఆత్మకూర్(ఎం)లో 9.87మీటర్లకు లోతుకు పడిపోయింది. జనవరి-ఫిబ్రవరి మాసాల్లోనే బొమ్మలరామారంలో భూగర్భ జలమట్టం 2.34 మీటర్ల లోతుకు పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే మార్చి మొదటి వారంలో దంచికొడుతున్న ఎండల కారణంగా రోజురోజుకూ భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఈ మండలాల్లో బోరుబావుల్లో నీరు తగ్గడం, వట్టిపోవడం కారణంగా పొట్టదశలో వరిపైరు దెబ్బతింటోంది. వేలాది రూపాయలు పెట్టుబడిపెట్టి సాగుచేసిన వరి పైర్లు కళ్లెదుటే ఎండిపోతుండటంతో రైతులు తల్లడిల్లితున్నారు. మరో నెలరోజు పాటు నీరందిస్తే వాటిని కాపాడుకోవచ్చనే ఆశతో కొతమంది రైతులు కొత్తగా బోర్లు వేయిస్తున్నారు. అయినా ఫలితం లేక ఆర్థికంగా నష్టపోతున్నారు. తడారి ఎండిపోతున్న వరి పైర్లను కొంత మంది రైతులు గొర్రెలకు, పశువులకు గ్రాసానికి విక్రయిస్తున్నారు. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన వరిపైరు జీవాలకు గ్రాసంగా విడిచిపెట్టాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఈ ఏడాది భూగర్భ జలమట్టం ఇలా..
మండలం జనవరి ఫిబ్రవరి వ్యత్యాసం
26న 26న (మీటర్లలో)
నారాయణపూర్ 9.79 10.01 -0.22
ఆత్మకూర్(ఎం) 9.12 9.87 -0.75
రామన్నపేట 7.91 8.63 -0.72
బొమ్మల రామారం 6.24 8.58 -2.34
తుర్కపల్లి 6.40 8.14 -1.72
రాజాపేట 6.38 7.42 -1.04
యాదగిరిగుట్ట 5.40 7.19 -1.79
మోటకొండూరు 6.24 7.16 -0.92
బీబీనగర్ 5.29 7.02 -1.74
ఆలేరు 5.57 6.56 -0.99
మోత్కూరు 5.24 6.09 -0.85
భువనగిరి 4.87 5.83 -0.97
చౌటుప్పల్ 4.96 5.54 -0.58
గుండాల 4.49 5.40 -0.90
అడ్డగూడూరు 2.37 3.09 -0.72
వలిగొండ 2.14 2.86 -0.71
పోచంపల్లి 2.50 2.83 -0.33
జిల్లా సగటు 5.49 6.49 -1.00