అడ్డూ అదుపులేని ఇసుక దందా
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:38 AM
ఆత్మకూరు(ఎస్), మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం రామన్నగూడెంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.
ఆత్మకూరు(ఎస్), మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం రామన్నగూడెంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. రాత్రీపగలు తేడా లేకుండా 12 ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తూ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. శనివారం డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ఇసుక ట్రాక్టర్ పల్టీ కొట్టింది. ఏటి నుంచి తరలించి గ్రామంలో కొన్నిచోట్ల డంప్ చేస్తున్నారు. ఇసుకను నింపే సమయంలో స్థానికులు డయల్-100కు ఫోన చేయగా పోలీసులు వచ్చి వెళ్లారు. వారు వెళ్లిపోగానే ఇసుకను తరలిస్తున్నారని, పోలీసులు మామూళ్లు తీసుకుని వెళ్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.7 వేలకు ట్రాక్టర్ ఇసుక విక్రయిస్తున్నట్లు సమాచారం. పోలీసులు కఠినంగా వ్యవహరించకుంటే గ్రామంలో ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు కోరుతున్నారు.
ఐదు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
వేములపల్లి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం రావులపెంట గ్రామానికి చెందిన చింతపల్లి జాన య్య, తంగెళ్ల రవీందర్‌రెడ్డి, ఉత్తెర్ల సైదులు, చింతపల్లి సంపత, మాడ్గులపల్లి మండలం పాములపాడు గ్రామానికి చెందిన యాదగిరి తమ ట్రాక్టర్లతో అనుమతులు లేకుండా రావులపెంట శివారులోని మూసీ వాగు నుంచి ఇసుకను తరలిస్తుండగా ఆదివారం రాత్రి గ్రామ శివారులో పట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్రాక్టర్లను స్టేషనకు తరలించి ట్రాక్టర్ యజమానులతో పాటు డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.