Share News

శివారులో అనుమతి లేని కట్టడాలు

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:24 AM

పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాలనుంచి భువనగిరికి వలస వచ్చే కార్మికులు, కూలీల సంఖ్య పెరుగుతోంది.

శివారులో అనుమతి లేని కట్టడాలు
భువనగిరి పట్టణం వ్యూ

వలస కార్మికులు లక్ష్యంగా రేకుల గదులు..

ఇంటి నెంబర్లు లేకుండానే విద్యుత కనెక్షన్లు, మునిసిపల్‌ సేవలు

వివరాలు తెలుసుకోకుండానే అద్దెకిస్తున్న యజమానులు

శాంతి భద్రతల అంశంగా మారుతోందంటున్న పోలీసులు

(ఆంధ్రజ్యోతి- భువనగిరిటౌన): పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాలనుంచి భువనగిరికి వలస వచ్చే కార్మికులు, కూలీల సంఖ్య పెరుగుతోంది. శివారు ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో ఇరుకు గదుల్లో జీవిస్తున్నారు. ఆ అద్దె ఇళ్లు అనుమతులు ఉన్న కట్టడా లేనా అనేది ఒక సమస్య. వలస కార్మికులు అనేక మంది మంచివారు ఉన్నా..వారి ఆధార్‌కార్డులు, వారి వివరాలు పరిశీలించాకే ఇళ్లను అద్దెకు ఇవ్వాలని పోలీసులు సూచిస్తుండడం గమనార్హం. పట్టణంలోని పలు బస్తీల్లో జనావాసాల మధ్య, శివారు ప్రాంతాల్లో నిర్మించిన రూముల ను ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున లెక్కిస్తూ ఇరుకైన గదుల్లో కుక్కేస్తున్నారు. ఉపాధి నిమిత్తం కుటుంబాలకు దూరంగా ఉంటున్న వలస కార్మికులకు లభిస్తున్న వేతనాలు సరిపోకపోవడంతో పాటు పొదుపు మంత్రం కారణంగా పలువురు కార్మికులు కలిసి ఒక్కో గదిలోనే కాలం గడుపుతున్నారు. గది విస్తీర్ణం ఆధారంగా యజమానులకు ఒక్కో గది పేరిట రూ.5వేల నుంచి రూ.10 వేల వరకు అద్దె ఆదాయం లభిస్తోంది. కానీ ఆ గదులకు నిర్మాణ అనుమతులు లేకపోవడంతో మునిసిపాలిటీకి ఆస్తి పన్ను, నిర్మాణ చార్జీల రూపంలో నష్టం కలుగుతోంది. అయితే ఆ ఇళ్లకు విద్యుత కలెక్షన్లు మాత్రం లభిస్తుండటం గమనార్హం. అయితే ఇరుకైన గదులలో అద్దెకు ఉంటున్న వలస కార్మికుల కుటుంబాలకు సరిపడా వెలుతురు, తాగునీరు లభించక జీవితాలు దుర్లభంగా మారుతున్న పరిస్థితి. వీరిలో పలువురు ముఖ్యంగా ఒంటరి కార్మికులు అసాంఘిక కార్యకలాపాల వైపు మల్లుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. అయితే కొద్ది మంది ప్రవర్తన సక్రమంగానే ఉంటుండడం విశేషం.

పోలీసులకు సవాల్‌

జిల్లా కేంద్రం భువనగిరిలోనే వేలాది మంది వలస కార్మికులు నివాసం ఉంటున్నారు. పరిశ్రమలలో, తాపీ, హోటల్‌ కార్మికులుగా, దినసరి కూలీలుగా హమాలీ వ్యవసాయ పనుల, భవన నిర్మాణ, హెయిర్‌ సెలూన తదితర రంగాలలో పని చేస్తున్న సుమారు మూడు వేల మందికి పైగా కార్మికులు స్థానికంగా నివాసం ఉంటున్నారు. వీరిలో వందలాది మంది నేపాల్‌ దేశస్తులు కూడా ఉన్నారు. వలస కార్మికులలో కొద్ది మంది ప్రార్థన మందిరాల్లో ఉండగా మరి కొద్ది మంది పరిశ్రమల క్వార్టర్స్‌లోనూ ఉంటున్నారు. కానీ మెజారిటీ కార్మికులు మాత్రం ఇరుకైన గదులలో జీవనం సాగిస్తున్నారు. వలస కార్మికుల కారణంగానే స్థానికంగా వాహనాల చోరీ, చైన స్నాచింగ్‌, ఇళ్లలో చోరీలు పెరిగాయని పోలీసులతో పాటు స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే మాదకద్రవ్యాలు, గుట్కాలు తదితర పొగాకు ఉత్పత్తుల వినియోగం గణనీయంగా పెరిగింది. ఫలితంగా గంజాయి తదితర మాదకద్రవ్యాలు, గుట్కాల విక్రయాలు ఊహించని స్థాయిలో పెరిగాయి. మాదక ద్రవ్యాల కేసుల్లో పట్టుబడుతున్న వారందరూ వలస కూలీలే కావడం ఇందుకు నిదర్శనం. అలాగే పలువురు కార్మికులపై క్రిమినల్‌ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ తరహా వలస కార్మికులకు ఇరుకైన గదులే అడ్డాగా మారి శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతున్నదని పలువురు అంటున్నారు. ఆధార్‌ కార్డు తదితర గుర్తింపు వివరాల ఆధారంగానే వలస కార్మికులకు ఇళ్లను అద్దెకు ఇవ్వాలని పోలీసులు చేస్తున్న సూచనలను యజమానులు పెడచెవిన పెడుతున్నారు. దీంతో శాంతి భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నదని పోలీసులు అంటున్నారు. ఈ నేపధ్యంలో వలస కార్మికుల వివరాలను నమోదు చేస్తున్నామని పోలీసులు ప్రకటించినప్పటికీ ఆచరణలో అంతంత మాత్రంగానే ఉన్నదని తెలుస్తోంది.

అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటాం

ఇరుకైన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారం తొలగిస్తాం. లేదా 100శాతం జరిమానాతో ఆస్తి పన్ను విధిస్తాం. విద్యుత కనెక్షన్లపై ట్రాన్సకో అధికారులతో చర్చిస్తాం. పుర సేవలను నిలిపివేస్తాం.

- కె.చంద్రప్రకాశరెడ్డి, కమిషనర్‌, భువనగిరి మునిసిపాలిటీ

జాగ్రత్తలు పాటించాలి

వలస కార్మికులకు ఇల్లు అద్దె ఇచ్చే యజమానులు జాగ్రత్తలు తీసుకోవా లి. వారి ఆధార్‌ కార్డు తదితర గుర్తింపు పత్రాలను పరిశీలించాకే అద్దెకు ఇవ్వాలి. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. వారి వివరాలను పోలీసులకు అందజేయాలి. వారి ప్రవర్తనలో అనుమా నం కలిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

- ఎం.రమేష్‌, ఇనస్పెక్టర్‌, భువనగిరి టౌన

Updated Date - Jun 20 , 2026 | 12:24 AM