Share News

రోజుకో మలుపు

ABN , Publish Date - Mar 02 , 2026 | 12:49 AM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధాన్యం స్కామ్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులు నమోదైన ఏడు మిల్లులకు సం బంధించి ఇప్పటివరకు ఇద్దరిని అరె్‌స్టచేయగా, మిగిలిన వారిని అరెస్ట్‌ చేయకుండా హైకోర్టును ఆశ్రయించారు.

రోజుకో మలుపు

చర్చనీయాంశంగా ధాన్యం స్కామ్‌

క్రిమినల్‌ కేసులు కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసిన మిల్లర్లు

రాజకీయ నేతల ప్రమేయంతో కేసుల తీవ్రత తగ్గించేలా ప్రయత్నాలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధాన్యం స్కామ్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసులు నమోదైన ఏడు మిల్లులకు సం బంధించి ఇప్పటివరకు ఇద్దరిని అరె్‌స్టచేయగా, మిగిలిన వారిని అరెస్ట్‌ చేయకుండా హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులను ఆశ్రయించడం ద్వారా కేసు నీరు గారుస్తారా..? లేక బలమైన కౌంటర్లు దాఖలు చేయడం ద్వారా కేసును బలోపేతం చేసే నిందితులను అరెస్టు చేస్తారా.. ? అనే విషయంపైనే అందరి దృష్టి నెలకొంది.

ధాన్యం స్కామ్‌లో కేసులు నమోదైన మిల్లర్లు తమపై క్రి మినల్‌ కేసులు పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ గత నెల 28న హై కోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు సోమవారం కౌంటర్‌ దాఖలు చేయాలని పో లీసులకు సూచించిందని, గురువారం ఈ పిటిషన్‌ విచారించి హైకోర్టు నిర్ణయం వెలువరిస్తుందని చెబుతున్నారు. ఈ కేసు ను నీరుగార్చేచేందుకు మిల్లర్లకు మద్దతుగా రాజకీయ నేతలు ప్రయత్నిస్తున్నారని, కేసువీగిపోయేలా పోలీసులు,పౌరసరఫరా లశాఖ అధికారులపై ఒత్తిడితెస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

చర్యలు తప్పవనే సంకేతాలు

సివిల్‌ సప్లయి కార్పొరేషన్‌ 2022-23లో సీఎంఆర్‌ కింద ఇచ్చిన ధాన్యానికి బదులు బియ్యం ఇవ్వకుండా మూడేళ్లపాటు అంటి పెట్టుకోవడమేకాక, ఆ ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ వేలంవేసి విక్రయిస్తే ధాన్యం ఇవ్వకుండా కాజేసిన మిల్లర్లపై చర్యలు తప్పవని ఉన్నత స్థాయి అధికారికవర్గాల నుంచి సంకేతాలు వస్తున్నాయి. నిర్ధారణ జరిగిన ఈ ఏడు మిల్లుల్లో సుమారు రూ.191కోట్ల మేర ప్రభుత్వానికి చెందిన ధాన్యం కాజేశారనే అభియోగాలను తేలిగ్గా తీసుకోవడం కుదరదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కామ్‌లో భాగస్వాములైన మిల్లర్లకి పౌరసరఫరాల కార్పొరేషన్‌, రెవెన్యూ శాఖల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులనుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి కార్యాచరణ జరుగుతుంది..? అనే అంశంపై ఎప్పటికప్పుడు సమాచారం వెళుతుందని, అందువల్లే సంబంధిత మిల్లర్లు అరెస్టును తప్పించుకోవడంతో పాటు కేసులు నీరుకార్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత నెల 28న రీచెక్‌ నిమిత్తం పోలీసులతో కలిసి పౌర సరఫరాల అధికారులు మిల్లులో తనిఖీలు చేపట్టినప్పుడు కూడా సంబంధిత మిల్లులకు ముందస్తుగానే సమాచారం ఇచ్చారని, తద్వారా మిల్లర్లకోసం అధికారులు, ఉద్యోగుల్లో కొందరు బలంగా పనిచేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ మిల్లులనుంచి మాయమైన ధాన్యం సొమ్ము రికవరీ నిమిత్తం ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ప్రయోగించడానికి ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తుంటే, మరోవైపు ఉన్నతాధికారుల నిర్ణయాలకు తూట్లు పొడిచేలా కొందరు అధికారుల వైఖరిపై విస్మయం వ్యక్తమవుతోంది. ఈ స్కామ్‌లో ధాన్యం కాజేసిన మిల్లులతోపాటు, అప్పట్లో ఈ దందాకు సహకరించిన అన్ని స్థాయిల అధికారులు, ఉద్యోగులను గుర్తించి వారిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల లాబీలకు లొంగకుండా ఈ కేసులను పటిష్టంగా అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నతాధికారులు గుర్తించాలనే డిమాండ్లు వెలువడుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ధాన్యం సేకరణ, మిల్లింగ్‌ జరిగే నల్లగొండ జిల్లాలో ఇలాంటి కేసులను నీరు గార్చితే ప్రభుత్వ ప్రతిష్ట మసక బారుతుందని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగించే సన్న బియ్యం పథకానికి బియ్యం సేకరణపై కూడా ఈ ప్రభావం పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఈ ఏడు మిల్లులకే కేసులు పరిమితం చేయకుండా, ధాన్యం కాజేసిన ఇతర మిల్లులనుంచి కూడా రికవరీ చేపట్టాలనే డిమాండ్లు వస్తున్నాయి.

Updated Date - Mar 02 , 2026 | 12:49 AM