ధాన్యం అక్రమార్కుల్లో వణుకు
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:14 AM
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)లో అక్రమా లకు పాల్పడ్డ వారిపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించింది. సివిల్ సప్లయిస్ సంస్థ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రెండు రోజుల్లో కీలక పాత్రధారి మహేందర్, అతడి భార్య పద్మను అరెస్ట్ చేశారు.
ధాన్యం కుంభకోణంలో కదులుతున్న డొంక
కీలక నిందితుడు మహేందర్, అతడి భార్య అరెస్టు
నానబెయిలబుల్ కేసుతో ఇతర నిందితుల్లో కలవరం
మహేందర్ నేతృత్వంలో రూ.42.80కోట్ల ధాన్యం మాయమైనట్లు గుర్తింపు
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)లో అక్రమా లకు పాల్పడ్డ వారిపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించింది. సివిల్ సప్లయిస్ సంస్థ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రెండు రోజుల్లో కీలక పాత్రధారి మహేందర్, అతడి భార్య పద్మను అరెస్ట్ చేశారు. నల్ల గొండ జిల్లాలోని ఏడుమిల్లుల్లో సుమారు రూ.190కోట్ల విలువైన 7,40,000 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లర్లు కాజేసినట్లు సివిల్ సప్లయిస్ సంస్థ తమ విచారణలో నిర్ధారించుకుంది. ఈ ఉదంతంపై పోలీసు లకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శరవేగంగా కేసును తేల్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఆర్‌ఆర్ యాక్ట్ ప్రయోగిస్తారా? లేదా అన్నది తేలాల్సి ఉంది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ)
సీఎంఆర్ కింద ప్రభుత్వం కేటాయించిన రూ.190కోట్ల ధాన్యాన్ని కాజేసిన వ్యవహారంలో నిందితుల అరెస్టుల పర్వం మొదలైంది. 2022-23 యాసంగి సీజనకు సంబంధించి నల్లగొండ జిల్లాలోని మిల్లులకు కేటాయించిన ధాన్యంలో ఏడుమిల్లులకు సంబంధించి రూ.190 కోట్ల విలువైన 7,40,000 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లర్లు కాజేసినట్లు సివిల్ సప్లయిస్ విజిలెన్స విభాగం నిగ్గుతేల్చింది. ఈ నేపథ్యంలో మిల్లర్లపై సివిల్ సప్లయిస్ సంస్థ కేసులు పెట్టింది. ఎస్పీ శరతచంద్రపవార్ నేతృత్వంలో విచారణ చేపట్టిన పోలీసులు రెండురోజుల్లోనే మూడు మిల్లులలో రూ.42.80 కోట్ల విలువైన ధాన్యం కాజేసిన వ్యవహారంలో ప్రధాన నిందితుడు కందుకూరి మహేందర్‌తో పాటు అతడి భార్యని బుధవారం అరెస్టుచేశారు. ఈ అక్రమంలో అతడితో భాగస్వామ్యమైన మరో అయిదుగురు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. మిగిలిన నాలుగు మిల్లుల్లో సుమారు రూ.148 కోట్ల ధాన్యం కాజేసిన నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు డీఎస్పీ శివరాంరెడ్డి నేతృత్వంలో పోలీ్‌సబృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. ప్రభుత్వ ధాన్యంలో భారీగా అక్రమాలు జరగడంతో ఎస్పీ శరతచంద్రపవార్ కేసుని సీరియ్‌సగా తీసుకొని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాజకీయ ఒత్తిళ్లకు సైతం లొంగే పరిస్థితి కనిపించకపోవడంతో మిగిలిన నిందితుల్లో కలవరం మొదలయినట్లు పేర్కొంటున్నారు.
కీలక నిందితుడిపై నానబెయిలబుల్ కేసు నమోదు
సీఎంఆర్ అక్రమాల్లో కీలకపాత్రధారి మహేందర్‌పై నాన బెయిలబుల్ కేసు, అతడి భార్యపైనా కేసు నమోదుచేయడంతో వ్యాపారవర్గాల్లో కలవరంమొదలైంది. కందుకూరి మహేందర్, కందుకూరి పద్మ, మాశెట్టి రాధాకృష్ణ, మేడం కృష్ణమూర్తి, ఇడుకుళ్ల దామోదర్, కందుకూరి రవికుమార్, బూరుగు బాలకృష్ణతో కలిసినల్లగొండ పట్టణంలోని సుమాంజలి రైస్‌మిల్, చిట్యాలలోని వరలక్ష్మి పార్‌బాయిల్డ్ రైస్‌మిల్, మునుగోడులోని మనోహర అగ్రోఫుడ్ ప్రొడక్ట్స్ రైస్‌మిల్లులను నిర్వహిస్తూ ఈ దందాకు తెరదీసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 2022-23 యాసంగి సీజనలో సీఎంఆర్ ఒప్పందం మేరకు కేటాయించిన ధాన్యంలో సుమారు రూ.42.80 కోట్ల విలువైన 13,170.061 మెట్రిక్‌టన్నుల బియ్యాన్ని నిర్ణీత గడువులోగా సివిల్‌సప్లయిస్ సంస్థకు ఇవ్వాల్సి ఉండగా అక్రమంగా విక్రయించుకున్నారని ఆ సంస్థ విజిలెన్స కమిటీ ఇటీవలి తనిఖీల్లో నిర్థారించింది. ఈ నివేదిక ఆధారంగానే సివిల్ సప్లయిస్ అధికారులు కేసులు పెట్టారు. ప్రధాన నిందితుడు మహేందర్‌పై నానబెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమో దు చేయగా, ఇతర నిందితులపై నిత్యావసరాల చట్టం-1955లోని సెక్షన (7)తో పాటు, బీఎనఎ్‌స చట్టంలోని 316/2, 316/5, 318/4, 318/3 సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు.
మిగతా వారిపైనా ఇదే తరహాలో...
సీఎంఆర్ మొత్తం రూ.190కోట్ల విలువైన కుంభకోణానికి పాల్పడిన ఈ నిందితుల్లో మూడు మిల్లులకు సంబంధించిన వ్యాపారులు, ఉద్యోగులు, భాగస్వాములను గుర్తించి వెల్లడించిన పోలీసులు మిగిలిన నాలుగు మిల్లులకు సంబంధించి సుమారు రూ.148 కోట్ల విలువైన ధాన్యం కాజేసిన వ్యవహారంలో నిందితులను సైతం గుర్తించి, వారికోసం గాలిస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని గౌతమీ రైస్‌మిల్లు, కనకమహాలక్ష్మీ రైస్‌మిల్లు, రామ్‌లక్ష్మణ్ రైస్ ఇండసీ్ట్ర్‌సతో పాటుగా కేతేపల్లిలోని చాముండేశ్వరీ రైస్‌మిల్లులకు కేటాయించిన ధాన్యంలో రూ.148కోట్ల విలువైన సుమారు 55,800 మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని పక్కదారి పట్టించి విక్రయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. నాలుగుమిల్లులకు సంబంధించి ఒక ముఠాగా ఏర్పడి కుంభకోణానికి పాల్పడ్డారా? లేక వేర్వేరుగా పాల్పడ్డారా? అనే విషయంలో పోలీసులు నిర్థారణకు రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. నిందితులను అదుపులోకి తీసుకుంటే ఈ విషయాలపై స్పష్టత రానుందని, ఒకటిరెండు రోజుల్లో నిందితులను అరెస్టు చేస్తామనే ధీమాని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిందితులపైనా నానబెయిలబుల్ సహా ప్రభుత్వ ఆస్తులను ధుర్వినియోగం చేయడం, ప్రభుత్వాన్ని మోసం చేసిన నేరాల కింద కేసులు నమోదు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఆర్‌ఆర్ యాక్ట్ ప్రయోగిస్తారా?
సీఎంఆర్ ధాన్యం కుంభకోణ నిందితులపై రెవెన్యూ రికవరీ(ఆర్‌ఆర్) యాక్ట్‌ను ప్రయోగిస్తారా? లేక ఒకరిద్దరిపై నానబెయిలబుల్ కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటారా? అనే అంశంపై వ్యాపార, ఉద్యోగవర్గాల్లో చర్చ సాగుతోంది. సుమారు రూ.191 కోట్ల పైచిలుకు ధాన్యాన్ని విక్రయించిన నిందితుల నుంచి ఆ సొత్తును రికవరీ చేసేందుకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన రంగంలోకి దిగిందని చెబుతున్నారు. అయితే ఆర్‌ఆర్ యాక్ట్ ప్రయోగించకుండా ధాన్యాన్ని సంస్థకు అప్పగించడం ద్వారా నామమాత్రపు కేసులతో తప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. విజిలెన్స కమిటీ అక్రమాలను నిగ్గుతేల్చడం, కేసులు నమోదు చేయడంతో పాటు దాని నివేదిక ఆధారంగానే కేసులు పెట్టడంతో ఆర్‌ఆర్ యాక్ట్ నుంచి నిందితులు తప్పించుకోలేరనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. మొత్తం నిందితులను అరెస్టు చేసి వివరాలను పోలీసులు వెల్లడిస్తేనే దుర్వినియోగమైన రూ.190 కోట్ల విలువైన ఽధాన్యాన్ని ఏవిధంగా రాబడతారనే అంశం తేలనుందని వ్యాపారులు, ఉద్యోగులు పేర్కొంటున్నారు.