పోషక పదార్థాల పంపిణీలో పారదర్శకత
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:03 AM
చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికల ఆరోగ్య పరిరక్షణకు పౌష్ఠికాహారం పంపిణీలో పారదర్శకతకు మహిళా శిశు సంక్షేమశాఖ కృషి చేస్తోంది. మూడేళ్లు నిండిన ప్రతీ చిన్నారితో పాటు మహిళల్లో పోషకాహారలోపం తలెత్తకుం డా పటిష్ఠ పంపిణీ వ్యవస్థను ఏర్పాటుచేసింది.
అంగన్‌వాడీలకు 5జీ స్మార్ట్ ఫోన్లు
జిల్లాలో 840 స్మార్టు ఫోన్ల పంపిణీ
చిన్నారుల హాజరు నుంచి పోషకాల పంపిణీ వరకు యాప్‌లోనే నమోదు
-(ఆంధ్రజ్యోతి,యాదాద్రి/ భువనగిరి రూరల్ ): చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికల ఆరోగ్య పరిరక్షణకు పౌష్ఠికాహారం పంపిణీలో పారదర్శకతకు మహిళా శిశు సంక్షేమశాఖ కృషి చేస్తోంది. మూడేళ్లు నిండిన ప్రతీ చిన్నారితో పాటు మహిళల్లో పోషకాహారలోపం తలెత్తకుం డా పటిష్ఠ పంపిణీ వ్యవస్థను ఏర్పాటుచేసింది. అందుకోసం క్షేత్రస్థాయిలో కీలక ప్రాత పోషించే అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, ఇతర లబ్ధిదారుల హాజరు మొదలు, వారికి అందజేసే పౌష్ఠికాహారం వరకు ప్రతీది పారదర్శకంగా ఉండేందుకు మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను వినియోగించేందుకు ప్రతీ అంగన్‌వాడీ కేంద్రం టీచర్‌కు ఆధునిక 5జీ స్మార్ట్ ఫోన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని వీటి పంపిణీని ఎమ్మెల్యేలు ప్రారంభించారు.
జిల్లాలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. భువనగిరి, ఆలేరు, మోత్కూరు, రామన్నపేట కేంద్రం గా ఈ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 901 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో వివిధ కా రణాలతో ఖాళీగా ఉన్న 61 అంగన్‌వాడీ కేంద్రా లు మినహా, 840 మంది అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లకు 5జీ స్మార్ట్ ఫోన్లను అందజేస్తున్నారు. ఇప్పటి వరకు అంగన్‌వాడీ టీచర్లు ఆరేళ్ల క్రితం ప్రభుత్వం అందజేసిన 2జీ స్మార్ట్ ఫోన్ల ద్వారా ఐసీడీఎస్ శాఖకు చెందిన యాప్‌లో హాజరు నమోదు చేసేవారు. ప్రస్తుతం యాప్‌ను అభివృద్ధి చేయడంతో పాత ఫోన్లలో టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. దీంతో నూతన యాప్‌ను సపోర్టు చేసే అత్యాధునిక సాంకేతికత ఉన్న 5జీ ఫోన్లను అందజేస్తోంది. జిల్లాలోని నాలుగు ప్రాజెక్టు పరిధిలో అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీని పూర్తిచేశారు.
స్మార్ట్ ఫోన్ల ద్వారా ఏం చేస్తారంటే?
అంగన్‌వాడీ టీచర్లు వారి కేంద్రాల్లోని చిన్నారుల హాజరు, పోషక పదార్థాల పంపిణీకి పోషణ ట్రాకర్, న్యూట్రిషియన్ హెల్త్ ట్రాక్ సిస్టమ్(ఎన్‌హెచ్‌టీఎ్‌స), టేక్‌హోంరేషన్ (టీహెచ్‌ఆర్) యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో నమోదుచేస్తారు. అయితే వీటిని నమోదు చేసేందుకు ఆరేళ్ల క్రితం పంపిణీ చేసిన 2జీ సెల్‌ఫోన్లను వినియోగిస్తుండగా, ఇంటర్‌నెట్, సిగ్నల్ సమస్యలు వస్తున్నాయి. దీంతో వివరాల నమోదు సక్రమంగా జరగకపోవడంతో అవతవకలకు సైతం ఆస్కారం ఉండేది. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు నూతన యాప్‌ను రూపొందించి 5జీ ఫోన్లను అందజేసింది. దీంతో క్షేత్రస్థాయిలో పూర్తి పారదర్శకతకు అవకాశం ఏర్పడింది. అంగన్‌వాడీ టీచర్ కేంద్రానికి వెళ్లిన వెంటనే ఓపెనింగ్ విషయాన్ని యాప్‌లో నమోదు చేస్తారు. తదుపరి హాజరైన చిన్నారుల గ్రూపు ఫొటోను క్యాప్చర్ చేసి, యాప్‌లో అప్‌డేట్ చేస్తారు. అదే విధంగా గర్భిణులు, బాలింతల ఫేస్ రికగ్ననేజేషన్ నమోదు చేస్తారు. వారికి అందించే కోడిగుడ్లు, బాలామృతం, తదితర పౌష్ఠికాహార పదార్థాల ఫొటో క్యాప్చర్ చేసి టీహెచ్‌ఆర్ యాప్‌లో నమోదు చేస్తారు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల లబ్ధిదారుల సంఖ్యలో పారదర్శకత, రోజువారీగా వారికి అందజేసే పోషకపదార్థాల పరిమాణం సైతం నమోదవుతుంది. ఈ యాప్‌లలో నమోదైన వివరాలను పైఅధికారులు సైతం పర్యవేక్షించడానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో జరిగే ప్రతీ రోజువారీ కార్యకలాపాలు, పౌష్ఠికాహార పంపిణీ, తదుపరి రోజులకు అవసరమైన నిల్వలపై కూడా అంచనా వేసేందుకు, పారదర్శకతకు అవకాశం ఉంటుంది.
అంగన్‌వాడీ కేంద్రాల్లో పారదర్శక సేవలు : ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి
చిన్నారులు, మహిళల ఆరోగ్య పరిరక్షణ, పౌష్ఠికాహారం అందించడంలో కీలకమైన అంగన్‌వాడీ కేంద్రాలల్లో పారదర్శకత కోసం అంగన్‌వాడీ టీచర్లకు ప్రభుత్వం 5జీ స్మార్ట్ ఫోన్లను అందజేస్తోందని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భువనగిరి నియోజకవర్గ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లకు 5జీ సెల్‌ఫోన్లను ఆయన పంపిణీచేశారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారి కె.నర్సింహారావు, మునిసిపల్ చైర్‌పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణిరవికుమార్, ఐసీడీఎస్ సీడీపీవో శాగంటి శైలజ, తదితరులు పాల్గొన్నారు.