'Ikkat'..Thread.Pochampally:‘ఇక్కత్’ ఖ్యాతి వ్యాప్తికి..త్రెడ్.పోచంపల్లి
ABN , Publish Date - May 26 , 2026 | 11:47 PM
అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సాధించిన భూదాన్‌పోచంపల్లి ‘ఇక్కత్’ వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు జిల్లా అధికార యంత్రంగం రంగం సిద్ధంచేసింది.
‘ఇక్కత్’ వస్త్ర ఉత్పత్తులకువిస్తృత మార్కెటింగ్
జూన్ 5,6,7 తేదీల్లో హైటెక్స్‌లో చేనేత వస్త్ర ప్రదర్శన
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి) అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సాధించిన భూదాన్‌పోచంపల్లి ‘ఇక్కత్’ వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు జిల్లా అధికార యంత్రంగం రంగం సిద్ధంచేసింది. అబ్బురపరిచేలా కళాత్మక వస్త్రాలను రూపొందించే పోచంపల్లి ‘ఇక్కత్’ చేనేత కళాకారుల జీవన ప్రమాణాల మెరుగుపరిచే లక్ష్యంగా ‘త్రెడ్ డాట్ పోచంపల్లి’ పేరిట ప్రత్యేక వస్త్ర ప్రదర్శనను నిర్వహిస్తోంది. అంతర్జాతీయ, జాతీయ వేదికపై అవార్డులు, ప్రశంసలు పొందిన టైఅండ్‌డై విధానంలో దారాలకు రంగులు అద్ది, సృజనాత్మకత, కళా నైపుణ్యంతో చేతిమగ్గాలపై అద్భుత కళారూపాలను తలపిం చే వస్త్ర ఉత్పత్తులకు మార్కెటింగ్‌ను ప్రోత్సహిం చే లక్ష్యంగా ఈ వస్త్ర ప్రదర్శనను చేపడుతున్నారు. జూన్ 5, 6, 7 తేదీల్లో హైదరాబాద్ హైటెక్స్-హాల్4లో ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా టైఅండ్ డై చేనేత వస్త్ర ఉత్పత్తులను జాతీయ, అం తరాష్ట్ర వ్యా పారులతో పాటు వస్త్ర వినియోగదారులకు చేరువ చేయడం ద్వారా మార్కెటింగ్ సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్‌జయంతి రూపొందించారు. జూన్ 5వతేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్న ఈ ఎగ్జిబిషన్‌లో పోచంపల్లి ఇక్కత్, తదితర చేనేత వస్త్ర ఉత్పత్తుల్లో కొత్తకొత్త డిజైన్లు, ఆవిష్కరణలతో కూడిన వస్త్రాలను ట్రేడర్లు, వినియోగదారులకు పరిచ యం చేయడానికి దాదాపు 100 స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. మహిళా శక్తి స్వయం సహాయసంఘాల వివిధ రకాల ఉత్పత్తులకు చెందిన మరో 30 స్టాల్స్‌ను ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేస్తారు. చేనేత వస్త్ర ప్రపంచంలో పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను రూపొందిస్తున్న కళాకారులు దేశానికి, రాష్ట్రానికి, యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎంత గర్వకారణం కాగా, ఈ ఇక్కత్ వస్త్రాలను రూపొందిస్తున్న ఆ చేనేత కుటుంబాల స్థితిగతుల దయనీయంగా ఉన్నాయి. దేశానికి గర్వకారణమైన వస్త్రాలను రూపొందించే చేనేత కళాకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే వీరి ఉత్పత్తులకు మార్కెటింగ్ ఎంతో అవసరమని జిల్లా అధికార యంత్రాంగం భావించింది. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు బ్రాండింగ్, మార్కెటింగ్‌ను ట్రేడర్లు, వినియోగదారుల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఎగ్జిబిషన్ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ ప్రగతిమైదాన్‌లో జరిగే ఎగ్జిబిషన్ల స్ఫూర్తితో హైదరాబాద్ మెగాసిటీలోని హైటెక్స్‌లో పోచంపల్లి ఇక్కత్ చేనేత వస్త్ర ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్‌ను తీసుకురావడమే తమ ప్రయత్నంగా యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొంటున్నారు.
‘ఇక్కత్’ ఖ్యాతి వ్యాప్తికి అన్ని ప్రయత్నాలు చేస్తాం : - అనురాగ్ జయంతి, కలెక్టర్
అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఖ్యాతి సాధించిన పోచంపల్లి ఇక్కత్‌కు మార్కెటింగ్ విస్తృతి తగినంత లేకపోవడం తో చేనేత కళాకారుల జీవన ప్రమాణాలు మెరుగు పడటం లేదు. సృజనాత్మకత ఉన్న కళ ఒక్కటే జీవనస్థితిగతులు మెరుగుపడటానికి సరిపోదు. అందుకే పోచంపల్లి ఇక్కత్ వస్త్ర ఉత్పత్తుల కొనుగోలు పెంపునకు అవసరమైన నవీన మార్కెటింగ్ ఎత్తుగడల ద్వారా ముందుకు సాగాలి. పోచంపల్లిని పర్యాటకంగా అభివృద్ధి చేయటం ద్వారా ఇది సాధించవచ్చు. హైదరాబాద్ మహానగరంలోని ప్రజలు ముఖ్యంగా టెకీలు వీకెండ్స్‌లో టూర్లకు ప్రాధాన్యం ఇస్తున్నందున ఆ దిశగా ఆకర్షించడానికి పర్యాటకంగా పోచంపల్లి పట్టణంలో మౌలిక వసతులు అభివృద్ధి...చేయాలి. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను సోషల్ మీడియా ద్వారా వినియోగదారుల చెంతకు తీసుకువెళ్లడం, వినియోగదారుల వద్దకే మన ఉత్పత్తులను తీసుకువెళ్లడం మరో విధానం. ఈ మార్గంలోనే ఈ వస్త్రాల తయారీలో అత్యంత కీలకమైన దారం అంశానికి ప్రాధాన్యం ఇస్తూ‘ త్రెడ్ డాట్ పోచంపల్లి’ ఎగ్జిబిషన్‌ను హైదరాబాద్ హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ఏర్పాటు చేస్తున్నాం. జూన్ 5, 6, 7 తేదీల్లో ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డి ప్రారంభించే ఈ ఎగ్జిబిషన్‌లో జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా పోచంపల్లి పరిసరాల్లో టైఅండ్‌డై చేనేత వస్త్రాలను రూపొందించే కళాకారులతో 100స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. వీటికి అనుబంధంగా యాదాద్రిభువనగిరి జిల్లాకు చెందిన మహిళా శక్తి స్వయం సహాయక సంఘాలకు చెందిన మరో 30 స్టాల్స్‌ను నెలకొల్పనున్నాం.