Share News

తిరుమలగిరి యోధ

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:46 PM

పందెం గుండు పోటీలకు నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలకేంద్రం ప్రసిద్ధి చెందింది. 60 ఏళ్లుగా ఈ పోటీలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా ఆ గ్రామంలో సుమారు 120 కిలోలకు పైగా బరువున్న పందెం గుండు ఎత్తే పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

తిరుమలగిరి యోధ
పందెం గుండును ఎత్తుతున్న పెదమాం అలేఖ్య

150 కిలోల గుండును అవలీలగా ఎత్తే సామర్థ్యం

60 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ

(ఆంధ్రజ్యోతి-తిరుమలగిరి(సాగర్‌)

పందెం గుండు పోటీలకు నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలకేంద్రం ప్రసిద్ధి చెందింది. 60 ఏళ్లుగా ఈ పోటీలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా శ్రీరామనవమి సందర్భంగా ఆ గ్రామంలో సుమారు 120 కిలోలకు పైగా బరువున్న పందెం గుండు ఎత్తే పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పోటీలు ఆంధ్రప్రదేశ రాష్ట్రం పల్నాడు ఏరియాలో ఎక్కువగా నిర్వహిస్తుంటారు. అయితే తిరుమలగిరి గ్రామం కృష్ణపట్టెకు ఆనుకుని ఏపీ సరిహద్దుకు సమీపంలో ఉండడంతో ఆ ప్రాంత సంస్కృతీ, సాంప్రదాయాలు ఇక్కడికి కూడా విస్తరించాయి. పల్నాడులో పేరొందిన పందెం గుండు ఎత్తుట, భారత కోలాటం, ఎడ్ల పందేలు ఇక్కడ కూడా పెద్దఎత్తున నిర్వహిస్తుంటారు. వాటిని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాలు పెద్దసంఖ్యలో ప్రజలు తరలిస్తుంటారు. పోటీల్లో ప్రధానంగా సుమారు 120 కిలోల బరువైన రాయితో చేసిన గుండ్రటి పందెం గుండును ఎత్తేందుకు పోటీపడడం ఆకర్షణీయంగా మారింది. సుమారు 60 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రారంభంలో ఆంరఽధప్రదేశలోని పల్నాడుకు చెందిన మాచర్ల, నాగారం, మండాది, నర్సారావుపేట, బోజినీడు తదితర గ్రామాల నుంచి పలువురు కండలు తిరిగిన యోధులు వచ్చేవారు. వీరికి పోటీగా తిరుమలగిరితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువకులు కూడా తలపడేవారు.

పోటీలకు ఆద్యుడు సీతారాములు

తిరుమలగిరి గ్రామానికి చెందిన నల్లమేకల సీతారాములు ఈ ప్రాంతంలో పందెం గుండు పోటీలకు ఆద్యుడు. 1980 ప్రాంతంలో జరిగిన పోటీల్లో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే వారితో పోటాపోటీగా తలపడి సుమారు 15 ఏళ్ల పాటు తిరుమలగిరిని సీతారాములు అగ్రస్థానంలో నిలిపారు. సీతారాములు బరిలో ఉంటే బహుమతి తప్పక సాఽధిస్తాడని నమ్మకంతో పోటీలను తిలకించేందుకు స్థానికులు తరలివచ్చేవారు. ఈ క్రమంలో తరుచూ పోటీల్లో గెలుపొంది ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చారు.

పోటాపోటీగా తలపడుతున్న యువకులు

సుమారు పదేళ్లుగా ఇదే గ్రామానికి చెందిన పలువురు యువకులు కూడా ఈ పోటీల్లో తలపడుతూ తమ ప్రతిభను చాటుతున్నారు. వరుసగా బహుమతులు సాధిస్తున్నారు. వీరిలో ప్రధానంగా రోజువారి కూలీ పనులు చేసుకునే మారేపల్లి అలేఖ్య, పెదమాము ప్రశాంత అనే యువకులు పోటీల్లో సత్తా చాటుతున్నారు. వీరిద్దరూ పోటీల్లో వరుసగా విజయాలు సాధిస్తూ ఈ ప్రాంతవాసుల మన్ననలు పొందుతున్నారు. తిరుమలగిరితో పాటు కొత్తపల్లి, చిలకాపురం, రాజవరం, పేరూరు, సత్తెనపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లి తమ సత్తా చాటుతూ బహుమతులు సాధిస్తున్నారు.

క్రమపద్ధతితో కూడిన ఆహారం

బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకుంటూ మంచి దేహదారుఢ్యం కలిగి ఉంటేనే పందెం గుండు పోటీల్లో పాల్గొనేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ పోటీల్లో పాల్గొనే వారు నెల రోజుల ముందు నుంచే ప్రతి రోజూ మొలకెత్తిన శెనగలు, పెసర్లు, మినుములను, గుడ్లు, మాంసాహారాన్ని క్రమం తప్పకుండా పాలు ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అదేవిధంగా పోటీలకు కొన్ని రోజుల ముందు నుంచి చిన్న సైజు గుండుతో ప్రారంభించి పెద్ద సైజు గుండు వరకు సాధన చేస్తుంటారు.

ఐదు నిమిషాల్లో 10 రౌండ్లు

భారీ సైజులో 120 కిలోల బరువైన పందెం గుండును మోకాళ్లపై నుంచి లేపుకుంటూ భుజంపై నుంచి వెనుకగా వేయడం ఈ పోటీ ప్రత్యేకత. ఈ విధంగా ఈ భారీ గుండును ఎత్తేందుకు మంచి దేహదారుఢ్యంతో పాటు అలసటకు వెరవకుండా నిర్ణీత సమయంలో ఎక్కువ రౌండ్లు వేయాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టతరమైనప్పటికీ నిరంతర సాధన, గుండును ఎత్తడంలో ఒడుపు, మెలకువలు కూడా ఉంటేనే సాధ్యమవుతోంది. ఐదు నిమిషాల్లో కనీసం 10 రౌండ్లు గుండును లేపేందుకు పోటీలో పాల్గొనే యువకులు పోటాపోటీగా తలపడుతుంటారు.

మొదట్లో 70 కిలోల గుండుతో సాధన

పదేళ్ల క్రితం మా గ్రామంలో 70 కిలోల పందెం గుండుతో ప్రాక్టీస్‌ ప్రారంభించా. ఇప్పుడు 150 కిలోల బరువున్న గుండును సైతం ఎత్తగలను. గతంలో ఏపీ నుంచి వచ్చి పోటీల్లో పాల్గొనేవారు. మనమేందుకు పోటీల్లో పాల్గొనలేమనే పట్టుదలతో పందెంలో పాల్గొంటున్నా.

- మారేపల్లి అలేఖ్య(తిరుమలగిరి(సాగర్‌)

ఒడుపు, పట్టుదల ముఖ్యం

పందెం గుండు ఎత్తి గెలి చేందుకు పట్టుదలతో పాటు ఒడుపు చాలా ముఖ్యం. 8 ఏళ్లుకు పైగా మేము పాల్గొంటున్న ప్రతి పోటీల్లో బహుమతు లు గెలుస్తూనే ఉన్నాం. చుట్టుపక్కల గ్రామాల వారు మమ్మల్ని ఈ పోటీలకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. పోటీలకు సుమారు 15రోజుల ముం దు నుంచి మంచి పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు నియమబద్ధంగా ఉండాల్సి ఉంటుంది.

- పెదమాం ప్రశాంత (తిరుమలగిరి(సాగర్‌)

Updated Date - Apr 24 , 2026 | 11:46 PM